సిలువ ధ్యానాలు - Day 12 - సిలువ బాధ్యత


  • Author: Rev Anil Andrewz
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - సిలువ ధ్యానాలు - 40 Days

సిలువ ధ్యానాలు - Day 12 - సిలువ బాధ్యత
Audio: https://youtu.be/v9qfXRk8vHM

 

గడిచిన 20 సం।।లు గమనిస్తే మనిషి జీవన విధానంలో, ఆలోచన విధానంలో ఎన్నో మార్పులు కలిగాయి. ఆ రోజులలో బంధువులలో ఎవరైన చనిపోతే రెండు మూడు బస్సులు మారి ఒక రోజంత లేదా కొన్ని రోజులు ప్రయాణం చేసి వెళ్ళేవారు. ఇప్పుడు వాట్సప్ గ్రూప్ లో రిప్ అని పెడుతున్నారు. ఈ గ్రూప్లో పెట్టిన మెసేజ్ చనిపోయిన వ్యక్తి కుటుంబం వారు ఎవరు చూస్తారో తెలియదు. ఇంతకముందు సంవత్సరమునకు ఒక్కసారే ఎండాకాలం సెలవులలో బంధువులను కలిసినా మరచిపోలేని మధుర జ్ఞాపకాలు, ప్రేమలు ఉండేవి, ఇప్పుడు ప్రతి రోజు ఆన్లైన్ లో కనిపిస్తున్నా మనుష్యుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి. ఆ రోజులలో 10, 12 మంది పిల్లలను కని పెంచేవారు. ఇప్పుడు ఒక్కరిని కని పెంచడానికి మూడు చెరువుల నీళ్లు తాగినట్లు చేస్తున్నారు. అ రోజులలో చుట్టూ అనుభవం ఉన్నవారు ఉండేవారు, ఏ సమస్యవున్నా ఖచ్చితమైన సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు చుట్టూ తెలివైన మూర్ఖులు కనిపిస్తారు.

ఎక్కువ మాట్లాడితే రోజులు మారాయి, మనము మారాలి అంటారు. సరే ఏమి మారాయోనని వెనుకకు తిరిగి చూస్తే సూర్యుడు తూర్పున ఉదయించి పడమరననే అస్తమిస్తున్నాడు. మామిడి చెట్టుకు మామిడి కాయలు, జామ చెట్టుకు జామ కాయలే వస్తున్నాయి కాని, రోజులు మారాయని మనము కూడ మారాలని సుర్యుడు దక్షిణమున ఉదయించడంలేదు, మామిడి చెట్టుకు సపోట, సపోట చెట్టుకు వేపకాయలు రావడంలేదు. వేటి స్థానంలో ఏవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండి ఎవరు పట్టించుకున్నా పట్టించుకొనకపోయిన వాటి వాటి పనులు జరిగిస్తున్నాయి.

రోజులు గడిచేకొలది మనిషే మారిపోతున్నాడు. ఇంతకముందు ఏ పని చేసిన అందులో ఆనందించేవారు, లాభనష్టాల కంటే ముందు, ఎవరు పట్టించుకొనకపోయిన ఇది నా పని అని బాధ్యతతో పని చేస్తు అందులో నైపున్యత కనబరచేవారు. కాని, ఈ రోజులలో మనిషిలో మార్పు వచ్చింది. మనిషి కష్టపడుటకంటే దోచుకోడానికి ఇష్టపడుతున్నాడు. స్వార్ధం పెరిగిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాధ్యత లేకుండ జీవిస్తున్నాడు.

యషయీ 53:8 అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు? యేసు ప్రభువు అన్యాయపు తీర్పు పొందినా, కొట్టబడినా, అతని తరమువారిలో యేసు ప్రభువు చేస్తున్న కార్యము గురించి ఎవరు ఆలోచించకపోయిన పని ఆపలేదు, వెనకడుగు వేయలేదు. రక్షణ కార్యం సంపూర్ణముగ ముంగించాడు.

సిలువ అనగ బాధ్యత. బాధ్యత పరిస్థితులను పరిసరాల గురించి ఆలోచించదు. బాధ్యత మనుష్యుల మెప్పు కొరకు, ఎవరైన చూడాలని, ఎవరైన పట్టించుకోవాలని ఆలోచించదు. బాధ్యత ఎప్పుడు తన పనిని ముగించుట కొరకే ఆలోచిస్తుంది. యేసు ప్రభువులో బాధ్యత ఉన్నది కాబట్టే పరిస్థితులు ఎంత వ్యతిరేకముగవున్నా తన పని ఆపలేదు.

ప్రియ విశ్వాసి! నీ బాధ్యత ఏమిటి? చేతగాక ప్రక్కవారి మీద నేరం మోపుతు, అవి ఉంటే చేసేవాడిని, ఇలా అయితేనే చేస్తాను. ఎవరి కోసం చేయ్యాలి? ఈ విధముగ మాట్లాడుతున్నావా? దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని నియమించాడు, ఆ పనికి జీతం కూడ సిద్ధపరిచాడు. దేవుడు నీకిచ్చిన పనిని సాకులు చెప్పకుండ బాధ్యతతో ముంగించుటకు సిద్ధపడు. బాధ్యతలేని నిర్లక్ష్య జీవితం వలన కిరీటం దొరకదు.


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.