సిలువ ధ్యానాలు Day 17 - సిలువ సహనం


  • Author: Rev Anil Andrewz
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - సిలువ ధ్యానాలు - 40 Days

సిలువ ధ్యానాలు Day 17 - సిలువ సహనం

Audio: https://youtu.be/Tfy0HVWgbgA

నాలుక ఎంత ప్రమాదకరమైనదో యాకోబు తన పత్రికలో 3వ అధ్యాయములో వివరించాడు. కొందరు అని చెప్పకుండ అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నామని తనను కూడ కలుపుకొని చెప్పాడు. నిజమే మాట తప్పని వారెవరు, మాట జారని వారెవరు? ఈ రోజులలో వెనకముందు ఆలోచించకుండ, నిజమేదో అబద్దమేదో గ్రహించకుండ, జరిగిందో జరుగలేదో తెలియకుండ నోటికొచ్చినట్లు మాట్లాడడం ఒకటైతే, మరొకటి ఎందుకన్నారో, దేని గురించి అన్నారో అర్ధం చేసుకోకుండా; నన్ను ఇలా అన్నారు అలా అన్నారని పదిమందికి చెప్పుకొని సానుభూతి పొందేవారు లేకపోలేదు. దీనంతటికి కారణం సహనం లేకపోవడమే.

క్రీస్తుని పోలి జీవిస్తున్నవారెవరో, క్రీస్తుని పోలి జీవిస్తున్నట్లు నటించేవారెవరో వారు మాట్లాడే విధానం బట్టి సులువుగ గుర్తించొచ్చు. ఏ తప్పు చేయని కొడుకు ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు ఎందుకు ఆలస్యమైనదని అడిగితే వివరంగా ప్రశాంతంగ సమాధానమిస్తాడు. ఏదైన గణకార్యం చేసినవానిని అడిగామనుకోండి వాడు పెట్టే కేకలను భరించలేము. ఏదైన సమస్యలు వచ్చినప్పుడు ఎదుటివారి గురించి నీవు అమర్యాదగ మాట్లాడుతున్నావంటే తప్పు ఎదుటివారి దగ్గర లేదు తప్పు నీదగ్గరేవుంది.

యెషయా 53:7 అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

యేసు ప్రభువును గెత్సమనే తోటలో బంధించినప్పటి నుండి సిలువలో మరణించేవరకు ఎక్కడ కూడ నోరు జారలేదు. శాపవచనం ఒకటికూడ ఉపయోగించలేదు. తనను హింసిస్తున్నవారిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు కాని, శిక్షించమని అడగలేదు. నేడు కైస్తవుడు అని పిలువబడేవారిలో, నేను సహవాసం మానను, సంఘములో ప్రతి కార్యక్రమములో పాలుగొంటానని చెప్పేవారిలో ఎంతమంది యేసు ప్రభువులో ఉన్న సహనం కలిగివున్నారు? అన్ని బాగున్నప్పుడు చూపించిన ప్రేమను ఏదైన తేడా వచ్చినప్పుడు ఆ ప్రేమ కనిపించదు. బాగున్నప్పుడు ఇచ్చిన మర్యాద ఏదైన జరిగినప్పుడు మర్యాద ఇవ్వలేరు. అన్ని బాగునప్పుడు బూతులు తిట్టిన మర్యాదగానే ఉంటుంది కాని, బాలేనప్పుడు అమ్మా అని పిలిచిన బూతులాగనే వినిపిస్తుంది.

కీర్తనలు 40:1 యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. 2 నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను.

సమస్యలో ఉన్నప్పుడు దేవుని దగ్గర నుండి సహాయం ఎలా పొందుకోవాలో కీర్తనాకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటినని కీర్తనాకారుడు తెలియజేసాడు. సహనానికి కారణం ఒకటి జవాబు రావడం ఆలస్యమైనా సణగకుండా జవాబు వచ్చేవరకు సహనముతో కనిపెట్టుకొన్నాడు. రెండవది నిందలు శ్రమలు కృంగదీసినప్పుడు అయ్యో నాకేఎందుకని ప్రార్ధన మానకుండ సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొన్నాడు. కీర్తనాకారుని సహనానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏమనగా; నాశనకరమైన గుంటలోనుండి అనగా జీవిత పునాదులే కుప్పకూలిపోయే పరిస్థితి, జిగటగల దొంగ ఊబి అనగా తన బలహీనతలు మరియసాతాను శోధనల నుండి పైకెత్తి తన పాదములు బండమీద అనగా క్రీస్తనే బండ మీద నిలిపి అడుగులు స్థిరపరిచాడు.

సిలువ అనగ సహనం. సిలువలో యేసు క్రీస్తు ఆ భయంకరమైన వేదనలను భరిస్తు, ఎవరిని దూషించకుండ, ఎవరిని నిందించకుండ ప్రతీది తండ్రికే చెప్పుకున్నాడు. నీ వింద, శ్రమ, శోధన, అవసరత, సమస్యలలో తిరుగుబాటు చేయక, వెనకడుగు వేయక దేవుని సహాయము కొరకు సహనముతో కనిపెట్టుకున్నప్పుడు నీ జీవితములో అక్షరాల దేవుడు మరణము నుండి యేసుని లేపినట్లుగా సమస్యలలో నుండి దేవుడు నిన్ను లేపగలడు. కీర్తనాకారునిని ఆ గుంటలో నుండి, ఊబిలో నుండి పైకెత్తి క్రీస్తనే బండ మీద నిలిపి అడుగులు స్థిరపరచినట్లుగ నిన్నును స్థిరపరుచును గాక!


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.