సిలువ ధ్యానాలు Day 18 - సిలువ తెగింపు


  • Author: Rev Anil Andrewz
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini - సిలువ ధ్యానాలు - 40 Days

సిలువ ధ్యానాలు Day 18 - సిలువ తెగింపు

https://youtu.be/SRRIK06vH2U

గెత్సేమనే తోటలో యేసు ప్రభువు 3వ సారి ప్రార్ధన ముగించే వరకు శిష్యులను సహాయం అడుగుతునే ఉన్నాడు. ఒక్క గడియ నాతో పాటు మేలుకొనివుండమని అడుగుతూనే ఉన్నాడు. ప్రార్ధనలో కూడ తండ్రిని, సాధ్యమైతే ఈ గిన్నె తొలగించమని వేడుకున్నాడు. ఎప్పుడైతే నా ఇష్టము కాదు నీ చిత్తమే అని నిర్ణయించాడో, ఎప్పుడైతే మరణం సమీపించిందో భయపడి కాదు తెగించి మరణమునకు ఎదురువెళ్ళాడు.

ప్రతి మనిషిలో తెగింపు లక్షణం ఉంటుంది. తెగించిన వారిని ఎదుర్కోవడం ఎవరి తరం కాదు. తెగించినవాడు తనకు నష్టమని తెలసినా అనుకున్నది చేసితీరుతాడు. అయితే మనిషిని బట్టి తెగింపుతో చేసే పనులు వేరు వేరుగా ఉంటాయి.

అవిశ్వాసి తెగిస్తే అది నిర్లక్ష్యానికి దారితీస్తుంది. అవిశ్వాసి ఎప్పుడు తెగిస్తాడనగా; ఏదైన సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఎక్కడనుండైన, ఎవరినుండైన సహాయం దొరకనప్పుడు నిరీక్షణను కోల్పోవడం లేదా నిరాశకు లొంగిపోవడం వలన నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళడొం ద్వారా దేనికైనా తెగిస్తాడు. ఈ తెగింపు వలన ఎక్కువగ తనకు తాను హాని చేసుకోవడమో లేదా ఎదుటువారికి హాని చేయడమో జరుగుతుంది. అదే విశ్వాసి తెగింపు దేవునికి మహిమను ఇస్తుంది. విశ్వాసి ఎప్పుడు తెగిస్తాడనగా; దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు పాటుపడుతున్నప్పుడు చుట్టూవున్న వారి నుండి సరియైన సహకారం అందనప్పుడు, తోటి వారు దేవుని పనిలో నిర్లక్ష్యం కాని పిరికితనం కనబరుస్తున్నప్పుడు ఎవరు చేయకపోయిన పర్వాలేదు, ఎవరు లేకపోయిన పర్వాలేదని దేవుని పని ఆగకూడదని ఒక విశ్వాసి తెగిస్తాడు. భయమును జయించాలంటే తెగించాలి, తెగింపు ధైర్యాన్ని ఇస్తుంది, తెగించిన వాడు ఎవరి మీద ఆధారపడడు. దేవుని కొరకు తెగించినవాడు ఏ పని చేయుటకైన భయపడడు, వెనకడుగు వేయడు.

మార్కు 15:43 గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు. ఈ అరిమతయియ యోసేపు ఘనత వహించిన యొక సభ్యుడు. దేనిలో సభ్యుడనగా; యూదుల పార్లమెంటులో ముఖ్య సభ్యుడు. యూదులు అన్యాయముగ యేసును అప్పగించారని తెలసినా ఈ యోసేపు, యేసు దేహం కొరకు పిలాతుని అడుగుతే; ఇతడు యేసు అనుచరుడని అందరికి తెలిసిపోతుంది, అప్పుడు ఈయన పదవికి మరియు ప్రాణమునకు కూడ నష్టమే కాని, అరిమతయియ యోసేపు ఉద్దేశం నా ప్రభువు దేహం అనాదగ సిలువ మీద ఉండకూడదు. నా పదవి పోయిన పర్వాలేదు, నన్ను చంపినా పర్వాలేదని అనుకొని యేసు దేహమును తన తోటలో తాను తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో బద్రపరిచాడు.

సిలువ అనగా తెగింపు. యేసయ్య మన రక్షణ కొరకు మరణమును చూసి, ఆ శ్రమలను చూసి భయపడలేదు, సిగ్గుపడలేదు కాని, ధైర్యముతో తెగించి సిలువను అంగికరించాడు. తెగించి సిలువను మోసాడు. తెగించి సిలువ మరణం పొందుకున్నాడు. కాని, ఈ రోజులలో అనేకులు సుఖానికి అలవాటుపడిపోతున్నారు. పేరు కొరకు, ఇతరుల మెప్పు కొరకు పని చేస్తున్నారు. ఈ రోజులలో విశ్వాసులకు కావలసిది సాకులు కాదు తెగింపు కావాలి. ఎవరోఒకరు చేస్తారులే, ఎవరైన వస్తే అప్పుడు చూద్దాంలే అని అనుకోవడం కాదు. ఇతరుల మీద ఆధారపడడం, భయం, సాకులు చెప్పే అలవాటు నీలో ఉంటే ప్రార్ధన చేయాడానికి ఆలోచిస్తావు, చేతిలో బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతావు. పదిమందిలో ప్రార్ధన చేయడానికి 10 సార్లు ఆలోచిస్తావు చివరికి ఏ పని చేయకుండ సమాజం, సంఘం పాడైపోతుందని అందరిముందు నీకే భారంవునట్లు నటిస్తావు.

ప్రియ విశ్వాసి! ఇప్పుడు దేవునికి ఒక అవసరముంది అదేమనగా మాటలు చెప్పెవారు కాదు, సాకులు చెప్పేవారు కాదు తెగించి ఆయన పని చేసేవారు కావాలి. అరిమతయియ యోసేపు వలే భయపడకుండ, వెనకడుగు వేయకుండి తెగించేవారు కావాలి. నీవేమైన చేయగలవా?


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.