దేవుని ముఖాన్ని చూస్తే..?


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 4
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

దేవుని ముఖాన్ని చూస్తే..?

ఎదుటివారి ముఖాన్ని చూసినప్పుడు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో సుళువుగా అర్ధమవుతుంది. కోపంగా ఉన్నారా, ప్రేమను చూపిస్తున్నారా అనే భావనలు వారి ముఖ వ్యక్తీకరణలను బట్టి తెలుసుకుంటూ ఉంటాము. ఎదుటివారి నుండి సమాధానం పొందుకోవాలానే సమయంలో వారి మాటలతో పూర్తిగా సంతృప్తి పొందుకోలేనప్పుడు ముఖంపై ఒక చిరునవ్వు లేదా ఇతర ప్రేమ పూర్వక సూచనలు గొప్ప ఆనందంతో పాటు ధైర్యాన్నిస్తాయి. వాస్తవంగా, ముఖము చిట్లించుకోవడం, కళ్ళు చిన్నవి చేయడం, ఇవన్నీ ఇతరులను గురించి మనము ఏమనుకుంటున్నామో అవి తెలియజేస్తాయి. అంటే, మన ముఖాలు – అవి మనలను తెలియజేస్తాయి.

80వ కీర్తన రచించిన ఆసాపు కలవరముతో నిండుకొన్నవాడై దేవుని ముఖాన్ని చూడాలనుకున్నాడు. యేరూషలేములోని తన స్థానము నుండి అష్షూరీయుల సామ్రాజ్యము పతనమైపోయిన తన తోటి దేశమైన ఇశ్రాయేలీయులను గమనించాడు. ఒకవైపు శత్రువులు విజయంతో విర్రవీగుతున్నారు, మరోవైపు తమకు మద్దతుగా నున్న దేశము పతనమైపోయింది. ఉత్తరదిశగా అష్షూరు, దక్షిణమువైపున ఐగుప్తు, తూర్పున అరబ్బు దేశాలు, అన్నివైపులనుండి యూదా ఆక్రమింపబడటానికి అనువుగా ఉంది. ఎదురు పోటీ ఇవ్వలేని స్థితిలో యూదా వారి సంఖ్య కనబడుతూఉంది. భయాందోళన కలిగించే సమయంలో ఆసాపు తన భయాలన్నిటిని ప్రార్ధనలో పెట్టి “మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.” (కీర్తన 80:3,7,19) అంటూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.

అసాపు ప్రార్ధన మరొక మాటలో చెప్పాలంటే దేవా నీ ముఖములో నీ చిరునవ్వు చూడనివ్వు అని అర్ధం. ఉక్కోరి బిక్కిరి చేసే మన భయాలన్నింటిని ప్రక్కనపెట్టి మన పరలోకపు తండ్రి మొఖాన్ని చూడగలిగితే మన సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఆయన ముఖములోని చిరునవ్వు మన భయాలను తొలగించడమే కాకుండా విజవంతమైన గొప్ప ధైర్యాన్ని కలుగజేస్తుంది. అవును ప్రియమైన స్నేహితులారా, సిలువవైపు చూడటమే దేవుని ముఖాన్ని చూడగలిగిన ఉత్తమమైన మార్గం. సిలువ - ఆయనను తెలియజేస్తుంది. సిలువపై తెరువబడిన క్రీస్తు బాహువులు ఎంతగా చాచి ఉన్నాయో, మనపట్ల అయన ప్రేమ అంతగా విశాలమైనదని ఆలోచన చేయడం గొప్ప అనుభవం. ఆమెన్.

https://youtu.be/O_9aCoZ9TaM