దేవుడంటే విసుగు కలిగిందా?


  • Author: Message By: Sayaram Gattu & Voice over By: Vishali Sayaram
  • Category: Articles
  • Reference: https://www.gospelmessageministry.com/2021/10/blog-post.html

దేవుడంటే విసుగు కలిగిందా?

శీర్షిక (టైటిల్) చూసి బహుశా కొందరికి కోపం కలుగ వచ్చు! కానీ ఇది ముమ్మాటికీ నిజము. చాల మంది విశ్వాసులు ప్రార్థించి, ప్రార్థించి విసిగి పోయి దేవుడు తమను వదిలేసాడు, లేదంటే దేవుడే లేడు అని ఆలోచించటానికి దైర్యం చేస్తారు. అటు పైన ఇదివరకు అసహ్యంగా చూసిన లోక రీతులను కూడా ఆస్వాదించటం మొదలు పెడుతారు. ఒకనాడు దేవుడు చేసిన ఎన్నో మేలులను పూర్తిగా మర్చిపోతారు. ఒక తండ్రిలా, తల్లిలా తమను కాపాడుతూ, వారి అవసరాలను అద్భుత రీతిలో తీర్చిన అయన మహాత్యమును  విస్మరిస్తారు. 

మరి కొంత మంది ఒక్క పెద్ద  ఇబ్బంది రాగానే  "ఏంటి దేవుడు ఇలా చేసేసాడు, అసలు నన్నెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, పక్క వాళ్ళు బాగానే ఉన్నారు కదా. అన్యులు సైతం ఎంతో ఆనందందంగా ఉన్నారు, జీవముగల దేవుడని నమ్ముకుంటే ఇదేంటి! ప్రార్థన కూడా వినటం లేదు" అనుకుంటూ చిన్నగా దేవుడి నుండి దూరంగా  వెళ్ళి పోతారు. 

కానీ ఒక్క విషయం మర్చి పోతున్నాము! దేవుడు మన అవసరాలు తీరుస్తాడు కానీ, మన ఆడంబరాలు కాదు. అంటే దేవుడు మనలను దీవించాడా? ఎప్పుడు ఇలాగ గొఱ్ఱె తోకలాగే ఉంచుతాడా? ముమ్మాటికీ కాదు. దావీదు 23వ కీర్తనలో ఏమని రాసాడు? "నా గిన్నె నిండి పొర్లుచున్నది" అని. దాని అర్థం ఏమిటి? నన్ను సమృద్ధిగా దీవించావు అనే కదా! సమృద్ధి అంటే, లేమి లేకపోవటమే కానీ లెక్క లేనంత ఉండటం కాదు. ఆ లెక్కలేనితనం నిర్లక్ష్యం కలిగిస్తుంది,  గర్వం కలిగిస్తుంది, దేవుణ్ణే మరపిస్తుంది. 

మత్తయి  16: "26. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయో జనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?"

ఈ వచనంలో యేసయ్య ఎం అంటున్నాడు చూడండి!  ఎంత సంపద ఉన్న కూడా చివరకు రక్షణ కోల్పోతే ఏమిటి ప్రయోజనం. ఎవరు కూడా ఇద్దరు యజమానులను సేవించలేరు! వారిలో ఒక్కరు యేసయ్య, మరొకరు ధనము. రక్షణ ఇచ్చే యేసయ్య కావాలా? లోకంలో సుఖపెట్టే ధనం కావాలా? కొందరి విషయంలో ధనం మాత్రమే యజమాని కాదు గాని, వారికి కీర్తి ప్రతిష్టలు కావాలి. వారి గురించి రాత్రికి రాత్రి ఊరంతా, జిల్లా అంత, రాష్ట్రమంతా లేదా దేశమంతా తెలిసి పోవాలి. ఇది కూడా ఒక రకమయిన ఆడంబరమే. దేవుడు నిన్ను వాడుకుంటున్నది, నీ ద్వారా పది మందికి అయన ప్రేమను తెలుపాలని, అంతే కానీ నిన్ను పది మందిలో గొప్ప చేయటానికి కాదు. అవసరం అనుకుంటే ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. 

కీర్తనలు 73: "3. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని."
 
ఈ వచనములో కీర్తన కారుడు భక్తి హీనుల క్షేమం చూసినప్పుడు నేను ఈర్ష్యపడ్డాను, ఎందుకంటే వారు నా ముందు గర్వం ప్రదర్శిస్తున్నారు అంటున్నాడు. కానీ దేవుడు వారికి సరయిన తీర్పు తిరుస్తాడు. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నది, లోకంలో జీవించే  ఎనభై యేళ్ళ కోసమో లేదా వంద యేళ్ళ కోసమో కాదు. యుగయుగములు ఆయనతో జీవించటానికి అని తెలుసు కోవాలి. అదే 73వ కీర్తనలో 18, 19 వచనములు చూసినట్లయితే "18. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు 19.  క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు." 
 
ఈ వచనముల ద్వారా అవగతమవుతున్నది ఏమిటి? దేవుణ్ణి ఎరుగని వారు ఇప్పుడు సుఖపడుతున్నట్లు కనపడవచ్చు, కానీ చివరకు వారు నశించి పోతారు. ధనవంతుడు, లాజరు ఉపమానంలో యేసయ్య ఏమని చెప్పాడు లూకా 16:19-31 వచనములు దయచేసి చదవండి. 


నువ్వు అనుకున్న పని జరగటం లేదా? నీ ప్రార్థన ఫలించటం లేదా? దేవుడు నీ చేయి విడువలేదు. కానీ  నిన్ను విశ్వాసంలో బలపరుస్తున్నాడు. సమస్య ఉంటేనే కదా సత్తువ పెరుగుతుంది? వ్యాయామం చేయటం అంటే ఏమిటి? బరువులు ఎత్తటం, పరుగులు పెట్టటం, తద్వారా శరీరానికి బలం కలిగించటం. మరి మన విశ్వాసం కూడా బల పడాలంటే శోధన అనే బరువును మోయాలి, ప్రార్థన అనే పట్టుదలతో, విశ్వాసపు పరుగును కొనసాగించాలి. సత్తువ అయిపోతుందా, నిరసపడి పోతున్నావా? అయితే అడుగు నీ దేవుణ్ణి, మొదలు పెట్టిన వాడు, వదిలి పేట్టడు. నిన్ను మధ్యలో దించటానికి ఎత్తుకోలేదు, తనతో జీవింప చేయటానికే నిన్ను రక్షించు కున్నాడు. కాస్త పాటి కష్టానికే చంక దిగుతానని మారాం చేస్తావా? వెలుగును విడిచి చీకటికి దాసోహం అంటావా? కాపరిని వదిలి మోస పోతావా? 


నీకు లేని వాటిని చూపించటమే సాతాను లక్షణం. తద్వారా జీవితంలో అసంతృప్తి, ఆత్మీయ జీవితంలో విసుగు. చూడలేని వాడిని అడిగితె తెలుస్తుంది కళ్ళు ఉన్న వాడి అదృష్టం, కాళ్ళు లేని వాడిని అడిగితె  తెలుస్తుంది  నడవలేని తన దురదృష్టం. ఎటువంటి స్థితి అయినా మార్చగల సమర్థుడు మన దేవుడు. అంతవరకు వేచి చూడటమే విశ్వాసం. విశ్వాసం లేని వాడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. విశ్వాసం ద్వారా శోధన అనే కొలిమి నుండి శుద్ధ సువర్ణము వలే విలువ పెంచుకొని బయటకు రావాలి కానీ కాకి బంగారంల  విలువ లేకుండా మిగిలి పోకూడదు. విశ్వాసం కోల్పోయి  విసుగు పడుతూ దేవునికి దూరం అవుతున్నావా? 


మీకా 6: "3. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాసపరచితిని? అది నాతో చెప్పుడి. 4. ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని." 


ఈ వచనముల ద్వారా దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఆయన ఇదివరకు చేసిన మేలులకు సమాధానం ఉందా నీ దగ్గర? అసాధ్యమే అనుకున్న కార్యాలు నీ జీవితంలో జరిగించినప్పుడు, సంతోషంతో కన్నీళ్లు పెట్టి సాక్ష్యం పంచుకున్నావు. మరి ఇప్పుడు ఏమైంది ఆ విశ్వాసం? దేవుడు నీతోనే మాట్లడుతున్నాడు. అయన ప్రేమను చులకనగా చూడవద్దు. విశ్వాసం కోల్పోవద్దు, విసుగు పడవద్దు.  మన విశ్వాసం సన్నగిల్లుతుంటే సాతాను మన మీద తన ఆధిపత్యం పెంచుకుంటూ ఉంటాడు, తద్వారా మనలను పూర్తిగా నాశనం చేస్తాడు. పాపం అనే తన ప్రపంచంలో సుఖమనే మత్తులో మనలను బంధిస్తాడు. దేవుని మాటలు చేదుగా అనిపిస్తాయి, చేతకాని వారు  పాటించేవిగా గోచరిస్తాయి. 


మరి ఇటువంటి స్థితిని ఎలా అధిగమించాలి? ఈ విసుగు చెందే తత్వం ఎలా ఏర్పడుతుంది? చెట్టు వేళ్ళు ఎంత లోతుగా ఉంటె చెట్టు అంత పచ్చగా ఉంటుంది. కానీ మొక్క వేళ్ళు లోతుగా ఉండవు కనుక కాస్త ఎండ తగలగానే వాడి పోవటం మొదలు పెడుతుంది. విశ్వాసి జీవితం కూడా అటువంటిదే. దేవునితో లోతయిన సంబంధం కలిగి ఉండటం ద్వారా విశ్వాసం పెరుగుతుంది,  తద్వారా ధైర్యం కలుగుతుంది. మరి దేవునితో లోతయిన సంబంధం ఎలా ఏర్పడుతుంది?


కీర్తనలు 1. "1. దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక 2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 3. అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును." 
 
ఈ వచనములలో ఏమి చెప్పబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, ఎంతో మంది ఆలా చేయు ఇలా చేయు అని తమకు తోచిన సలహాలు ఇస్తుంటారు. తాము ఎలా బాగుపడింది, చిన్న చిన్న అబద్దాల ద్వారా, మోసాల ద్వారా డబ్బులు ఎలా సంపాదించింది చెపుతుంటారు. వాటిని పాటించక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అంటే వారి పిచ్చి పరిహాసాలకు నవ్వకుండా, చతురతకు అబ్బురపడకుండా దేవుని వాక్యమును నిత్యమూ ధ్యానిస్తూ, అనగా పనులన్నీ మానేసి బైబిల్ చదవమాని కాదు గాని, ఎక్కడ ఉన్న, దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ, కృతజ్ఞత  పూరితమయిన  సమయము దినమంతా గడుపుతూ ఉండేవారు నీటి కాలువల వద్ద నాటిన చెట్టువలె ఆకు వాడక ఉంటారు. మరియు తగిన సమయంలో ఫలం పొందుకుంటారు.  అంతే కాకుండా వారు చేసే దంతయు సఫల మవుతుంది. ఈ విధంగా దేవునితో లోతయిన సంబంధం విశ్వాసంతో కూడిన ధైర్యం కలిగిస్తుంది, తద్వారా ఈ విసుగు స్థానంలో శాంతి, సమాధానం, నెమ్మది మన జీవితాలలో చోటు చేసుకుంటాయి. 

దేవుడు  మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !! 


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.