అపజయాలను విజయాలుగా మారిస్తే?


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

అపజయాలను విజయాలుగా మారిస్తే? 

లోకము, శరీరము, అపవాది. ఈ మూడురకాలైన శత్రువులతో మనము అనుదినం పోరాటము చేస్తూ ఉన్నాము. వీటిని ఎదుర్కొని, పోరాడిన మన జీవితాల్లో అపజయాలపాలైనప్పుటికీ అధిగమించగలమనే సామర్ధ్యాన్ని దేవుడు మనకు అనుదినం అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇవి నేటి మన క్రైస్తవ విశ్వాసంలో మరియు ఆధునిక సంఘ సంస్కృతిలో అత్యంత తక్కువగా చర్చించే అంశాలు. మనం ఎటువంటి జీవితం జీవించవలెనని తండ్రి ఉద్దేశం కలిగియున్నాడో, అట్టి జీవితాన్ని అనుభవించ కుండా ఉంటాము. ఎందుకంటే ఈ పోరాటంలో గెలవాలనే ఆలోచనలు ఉన్నప్పట్టికీ  వీటితో రాజీపడిపోతాము. అయితే విజయవంతులము కావాలనే మన ఆలోచనలు మనకు ఉన్నప్పుడే మన జీవితంలో గెలుపుతో పాటు స్వేచ్చను, ఎదుగుదలను గూర్చిన సరికొత్త భావాలను వెల్లడిచేసే సామర్ధ్యాన్ని పొందగలం.

2 థెస్సలొనీకయులకు 3:3 అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి కాపాడును.

దేవుడు తన పిల్లలను ఎప్పుడూ విడిచిపెట్టడు, మనం విజయవంతులంగా ఉండాలనేదే తండ్రి ఉద్దేశం. కాబట్టి, చేసిన తప్పులను తిరిగి చేయకుండా ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడ ఓటమి కలిగిందో అక్కడి నుండి తిరిగి మొదలు పెట్టవలసి ఉంటుంది. ఓటమి అంటే వాయిదా పడ్డ గెలుపు. కోల్పోయినదానిని తిరిగి పొందడం ఎప్పుడూ బాధాకరమైనది మరియు విలువైనదని గుర్తుంచుకోవాలి. అపజయాలను విజయాలుగా మార్చడానికి; ఆశీర్వాదం ఎందుకు కలిగిందో,  ఎక్కడ నుండి వచ్చిందో ఆ మూలాలు గుర్తుంచుకోవాలి.

ఆధ్యాత్మిక, సామాజిక జీవితాలలో విజేతలుగా ఉండాలని మనకూ అనిపిస్తుంది. అనుకున్నంత మాత్రాన సరిపోదు. దానికోసం లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అవసరమైన సాధన చేస్తున్నప్పుడే విజేతలుగా ఉండగలుగుతాము. విజేతలుగా ఉన్నవారిని ప్రజలు మార్గదర్శకులుగా గుర్తిస్తారు.  విజేతలు అధికారానికి అర్హులౌతారు..మనము నిరంతరము విజేతలుగా ఉండాలని యేసు మనకు మార్గదర్శిగా ఉన్నాడు. 

బయటనున్న ప్రపంచానికి సమాధానం ఇచ్చినంతమాత్రాన మనం గెలిచినట్టు కాదు గాని, మనలో ఉన్న ప్రపంచానికి సమాధానం చెప్పుకోగలిగినప్పుడే మనం గెలిచినట్టు. అయితే మన ఆలోచనలు, వైఖరి, ప్రవర్తన, నోరు వీటన్నిటిపై దాడిచేసి ఓడించాలని అపవాది  ప్రయత్నాలు నిరంతరము జరుగుతుంటాయి.  వాటన్నిటిని మన పాదముల క్రింద తొక్కాలంటే ఆయనవైపు తిరిగి "బలపరచుము" అని అడుగుతూ ప్రార్ధించి ఆయన మార్గములను వెదకినప్పుడు మన జీవితంలో విజయోత్సవమును చూడగలం.  ఆమెన్!

Telugu Audio: https://youtu.be/on7CwU-IT3A