ఒంటరిగా ఉన్నప్పుడు!


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

ఒంటరిగా ఉన్నప్పుడు!

చంద్రుణ్ణి దగ్గరగా చూసినప్పుడు ఎలా ఉంటుందో అంతరిక్ష విమానం అపోలో 15 వ్యోమగామి ఆల్ఫ్రెడ్ వోర్డన్ ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. 1971 లో మూడు రోజుల ముందే తనకు ఏర్పాటు చెయ్యబడిన అంతరిక్ష విమాన భాగంలోకి వెళ్ళాడు. అయితే తన తోటి ఇద్దరు వ్యోమగాములు చంద్రుని ఉపరితలానికి కొన్ని వేల మైళ్ళ క్రింద పనిచేయుటకు వెళ్ళిపోయారు. అంతరిక్షంలో తాను కొన్ని దినములు ఒంటరిగా ఉన్నప్పుడు తనతో ఉన్నవి నక్షత్రాలు మాత్రమె, అవి చాల దట్టముగా ఉండి ప్రకాశవంతంగా ఉండి తనను చుట్టేసినట్టుగా అనిపించింది - అని జ్ఞాపకము చేసుకుంటూ తన అనుభవాన్ని వివరించారు.

ఒంటరి తనంలో మనం ఉన్నప్పుడు, ఆ ఒంటరితనం నుండి బయట పడ్డాక, ఆ పరిస్థితులను జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎన్నో అనుభవాలు కలిగిన వారంగా ఉంటాం. ఇటువంటి అనుభవం బైబిలులోని పాత నిబంధన గ్రంథంలో యాకోబుకు కూడా కలిగింది. యాకోబు తన ఇంటి నుండి వెళ్ళిన ఆ రోజు రాత్రి అతడు ఒంటరిగా ఉండిపోయాడు. అయితే తన ఒంటరి తానానికి కారణం, తన అన్న యైన ఏశావు నుండి తప్పించుకొని పారిపోతున్నాడు. కుటుంబంలో జ్యేష్టుడికి ఇచ్చిన ఆశీర్వాదాలు దొంగిలించినందున తన అన్న తనను చంపాలని చూసిన కారణంగా పారిపోతున్నాడు. చాల రాత్రి ప్రయాణించాక అలసిపోయిన యాకోబు ఒక రాయిని తలగడగా చేసికొని నిద్రపోయాడు. ఆ రాత్రి అతడు కలగన్నాడు, భూమితో పరలోకాన్ని కలుపుతూ ఒక నిచ్చెన, దేవ దూతలు ఆ నిచ్చెనను ఎక్కుతూ దిగుతూ ఉండడం గమనించాడు. “నీకు తోడైయుందును, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును” అను దేవుని స్వరాన్ని విన్నాడు.

నిద్ర లేచిన యాకోబు నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియక పోయెననుకొని, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు.(ఆది 28:16-18). కటిక చీకటి వంటి ఒంటరితనం లో ఉన్నప్పుడు క్రొత్త వెలుగులను ప్రకాశించే దేవుని వాగ్ధానాలు మన వెంటే ఉంటాయి అనుటకు ఈ అనుభవం మనకు నిదర్శనం. మన ప్రణాళికలకు మించిన ప్రణాళికలు, మన ప్రణాళికలకంటే శ్రేష్టమైన ప్రణాళికలు కలిగియున్న వాని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుని వాగ్ధానాలు యకోబుకు వలే మన జీవితంలో కూడా నెరవేరుతాయి. మనం అనుకున్న దానికంటే పరలోకం మనకు సమీపంగా ఉంది, ఆనాడు యాకోబుతో ఉన్నదేవుడు నేడు మనతో కూడా ఉన్నాడు. ఆమెన్.


Telugu Audio: https://youtu.be/3mB0egt7JhM