విశ్వాసమే నీ విజయం


  • Author: Unknwon
  • Category: Messages
  • Reference: General

విశ్వాసంలో మాదిరి

నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12

జార్జ్ ముల్లర్ గారి అనాధ ఆశ్రమంలో ఒకరోజు వంటవాడు ఈరాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమి లేదని చెప్పాడు. సరే అని చెప్పి ప్రార్ధించడం ప్రారంభించారు ముల్లర్ గారు. రాత్రి 7 గంటలు అయ్యింది. వార్డెన్ వచ్చాడు. అయ్యగారు ఏమి చెయ్యమంటారు? పిల్లలను ప్లేట్స్ పట్టుకొని డైనింగ్ హాల్ లో కూర్చోమని చెప్పండి. ముల్లర్ గారి మాటలకు వంటవాడు, వార్డెన్ ఆశ్చర్యపోయారు ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అనుకొని, ఆయన చెప్పినట్లే చేసారు. ఈలోపు ఒక పెద్ద లారి ఆశ్రమంలోనికి ప్రవేశించింది. వాళ్ళు ఇట్లా చెప్తున్నారు. అయ్యగారు ఈ రోజు పట్టణంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చెయ్యబడింది. హటాత్తుగా పిలువబడిన ముఖ్య అతిధులలో ఒకరు చనిపోయారు. మీటింగ్ రద్దు చేసారు.సిద్ధ పరచిన ఆహార పదార్ధాలు మీ ఆశ్రమానికి అందజేయమన్నారు. ఆహార పదార్ధాలు లారీ నుండి దించుతూ వుండగానే, వెలుపల పాలు తీసుకెళ్తున్న లారి పంచర్ అయ్యింది. ఆ లారీ డ్రైవర్ ఆ విషయాన్ని వాళ్ళ బాస్ కి చెప్తున్నాడు. అవతల నుండి వాళ్ళ బాస్ "నీవెక్కడున్నావ్?" ముల్లర్ గారి ఆశ్రమం దగ్గర. అయితే, ఆ మిల్క్ ప్యాకెట్స్ ఆశ్రమలో ఇచ్చేసి, లారి ప్రక్కన పెట్టు. ఆప్యాకెట్స్ 15 రోజుల వరకు పిల్లలకు సరిపోయాయట

విశ్వాసం అంటే? పరిస్థితులు ఎట్లావున్నా సరే, దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చ గలడని ఆయనపైనే పూర్తిగా ఆధారపడ గలగడం.

విశ్వాసము అంటే? నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు. హెబ్రీ 11:1

నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమా 4:18 అప్పటికే అబ్రాహాముకు నూరేళ్ళు, శారమ్మకు తొంబై ఏళ్ళు.వారి శరీరం మృతతుల్య మయ్యింది. ఇక బిడ్డలకోసం నిరిక్షించడానికి వారికున్న ఆధారమేదీలేదు. అయితే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచ లేదు.

విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను. హెబ్రీ 11:7

నోవాహు అప్పటి వరకు తన జీవితంలో భూమి మీద ఒక్క వర్షపు చినుకుపడడం చూడలేదు. అయితే, దేవుడు అంటున్నాడు. ఏకరీతిగా నలభై రాత్రులు, పగళ్ళు ఆకాశం నుండివర్షం కురుస్తుందని. కాని, నోవాహు అదెట్లా సాధ్యమని దేవుని ప్రశ్నించలేదు. విశ్వసించాడు. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు.

విశ్వాసమునుబట్టి రాహాబను వేశ్య వేగులవారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతోపాటు నశింపక పోయెను. హెబ్రీ 11:31 అంతే కాదు యేసు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది.

మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను. హెబ్రీ 11:24-26 ప్రతిఫలం కనానులో అడుగు పెట్టలేకపోయినా, పరమ కనానులో మాత్రం అడుగు పెట్టగలిగాడు.

కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను. సంఖ్యా 13:30 అందుకే 30 లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరగా కనానుచేరి వాగ్ధాన భూమిని స్వతంత్రించుకున్న ఇద్దరిలో కాలేబు ఒకడు. మిగిలినవాడు యెహోషువా.

మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు దానియేలు 3:17 ఆ విశ్వాసమే షడ్రకు, మేషకు, అబెద్నేగోలు అనువారికి అగ్నిగుండంను ఆహ్లాదకరంగా మార్చింది.

వీళ్ళెవరూ సమస్యను చూచి భయపడినవారు కాదు, ఆ సమస్యను పరిష్కరించగల దేవునిపైన విశ్వాసముంచిన వారు.

ఇట్లాంటి విశ్వాస వీరులను ఆదర్శముగా తీసుకొని, మనము కూడా విశ్వాసములో విశ్వాసులకు మాదిరిగా జీవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్

toilax 5mg bhalsbrand.site toilax spc