పరలోక స్వరము చెప్పగా వింటిని

  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Messages
  • Reference: Jesus Coming Soon Ministries

పరలోక స్వరము చెప్పగా వింటిని ప్రకటన – 14:13

 ఈ లోకంలో స్వరం అనుమాటను మనం ఆలోచించినప్పుడు దానిని మనుషులలో, జంతువులలో, వాయిద్యాలలో, వాహనాలలో, విమానాలలో, భూకంపములో మనం చూస్తాం. పసిపిల్లల స్వరము కూడా కొన్ని సార్లు మనకు చాలా బేజారుగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా లోకానికి చెందినవే. లోకానికి వ్యతిరేకమైనది, దేవుని బిడ్డల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్థలం పరలోకం. ఆ పట్టణము ఎలాగుంటుందో ప్రకటన 21:1-4వచనాలలో చూస్తాం. పరలోకము దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం మరియు బహుమానం. పరలోకము యొక్క నమూనాను యోహాను భక్తుడు చాలా చక్కగా వివరించాడు. ఆయన దర్శనములో చూడగా కనబడింది క్రొత్త ఆకాశం కొత్త భూమి. ఎంత ధన్యత! యోహాను దర్శనములో చూచిన ఆ పరలోకమును నీవు నేను కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమయములో చూడబోతున్నాము. రెండవదిగా అక్కడ మొదటి ఆకాశము, భూమి, సముద్రము ఇక లేవు. ఎంత అద్భుతం. మూడవదిగా అక్కడ సంఘము పెండ్లికుమార్తె వలె సిద్ధపడి దిగివచ్చుట చూచితిని. అప్పుడు సింహాసనమునుండి ఒక స్వరము విన్నట్లు 3, 4 వచనములలో చూస్తాము. అయితే పరలోకమునుండి స్వరము వినబడుటకంటే ముందుగా దేవుని స్వరమును గురించి తెలుసుకుందాము.

*పరలోకమునుండి దేవుని స్వరము :*

     ఇది యెహోవా దేవుని స్వరము. పాతనిబంధన కాలములో దేవుడు ఆదాము మొదలుకొని అనేక మంది ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ అంతమందు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడెను. హెబ్రీ 1:1. ఎందుకు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడెను? క్రీస్తు ఈ లోకములో ఉద్భవించిన తరువాత అనగా తన యవ్వనదశలో దేవుని సంకల్పమును బట్టి బాప్తిస్మము తీసుకున్న తరువాత తండ్రి తన ఏకైక కుమారుని స్వరము వినిపించవలనని అంతేకాక లోకమంతా ఆయన మాట వినవలెనని కోరియున్నాడు. ఈ మాటను మత్తయి 3:17లో మరియు 17:5లో చూడగలుగుతాము. యేసు బాప్తిస్మము తీసుకొనిన వెంటనే త్రిత్వము యొక్క కార్యాన్ని ఇక్కడ చూడగలుగుతాము. పరిశుద్ధాత్మ పావురమువలె తన మీదికి దిగి వచ్చుట చూచెను. అంతట ఆకాశమునుండి ఒక బలమైన స్వరము మేఘములోనుండి వచ్చెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి అని వినిపించబడింది. కావున మనమందరము తండ్రియైన దేవుని ఆజ్ఞను పాటించి క్రీస్తు మాటకు విధేయులమై అనునిత్యము యేసుమాట వినాలి. ఇంట్లో అందరిమాటలు వింటాం, కొన్నిసార్లు పంతంతో చేసి చూపిస్తాం. అయితే పంతంతో నీవు యేసయ్య మాట వినాలని అలాగు చేయాలని, పాటించాలని తీర్మానం చేసుకోవాలి. యేసు మాట వింటే అదే నీకు గొప్ప క్రిస్మస్.
*పరలోకమునుండి దూతల స్వరము :*
     ఈ రెండవ స్వరము దేవదూతల సమూహము మరియు గాబ్రియేలు దూత ద్వారా వినిపించబడింది. ఆ స్వరము ఏమని చెప్పింది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను.
    క్రిస్మస్ పండుగ చేసుకునే చాలా మంది సమాధానము లేకుండానే పండుగను ఆర్భాటముగా చేస్తారు. అలాంటివారు పండుగ చేయడానికి అర్హులు కాదు. సంతోషం ఆర్భాటం అనేది సమాధానమున్నప్పుడే చేయవలెను. విశ్వాసులైనా, సేవకులైనా, సువార్తికులైనా అందరికి ఒకటే వర్తిస్తుంది. నిజమైన క్రిస్మస్ ఆచరించేవారందరు మొట్టమొదట దేవుని స్తుతి చెల్లించి ఆరాధించినప్పుడు దేవునికి మహిమ తెచ్చెడివారమౌతాము. ఆయనకు ఎల్లప్పుడు జిహ్వా ఫలము అర్పించవలెను హెబ్రీ 13:15.
     దూతల సమూహము రెండు వేల సంవత్సరముల క్రితమే సమాధానమని పలికినప్పుడు ఈ భూమి మీద మనకే కాని మన దేశానికే కాని ప్రపంచ దేశములలో సహితము సమాధానము దొరుకుట లేదు. ఎందుకనగా దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వడంలేదు. కాబట్టి 2018 డిసెంబర్ 25న ఈ పండుగ సందర్భంగా దేవుని స్తుతించి ఆరాధించే వ్యక్తిగా వుండాలని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి మన జీవితములో సమాధానపడి ఇతరులతో ప్రేమతో మెలిగినప్పుడే నీవు దేవుని ద్వారా దీవెనలు పొందగలవు. అంతేకాక క్రీస్తులో జీవించుటలో, బ్రతుకుటలో నీవు నిరంతరం పోరాడాలి. అప్పుడే ఆయన ద్వారా సమాధానము పొందెదవు.

*పరలోకమునుండి దేవుని స్వరము వినిన యోహాను :*

     యోహాను ఏమని విన్నాడు? ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయము. యోహాను వ్రాసిన ఈ మాటలే మనము చదివి, వాటిని విని గైకొనాలి. అప్పుడు మనము కూడా ధన్యులమే. మనము బ్రతికేది కొంతకాలమే. బ్రతికినంత కాలం క్రీస్తులో బ్రతికి క్రీస్తు మనలో నివసించునంతగా పరిశుద్ధతలో, పవిత్రతలో నీవు నీ కుటుంబము వుండాలి. మరణం అందరికి ప్రాప్తిస్తుందని దావీదు వ్రాశాడు. నీ మరణమెప్పుడో నీకు తెలియదు గనుక సిద్ధపడి జీవించాలి. బ్రతికియుండగానే నీ దీపం అనగా నీ ఆత్మను నీ కుటుంబమును రక్షించుకోవాలి. నోవాహు ఏ విధముగా తన కుటుంబమును కాపాడుకున్నాడో ఆ విధముగా నీవు కూడా నీ కుటుంబమును కాపాడుకోవాలి. 1పేతురు 3:19-20

     నేను సుఖముగా ఉన్నానని అనుకునే నీకు మరణం వస్తే ఆ తరువాత ఏంటి? నా గురించి ప్రజలేమనుకుంటారు? పోయిందే బాగు అనుకుంటున్నారా? లేక ప్రభువు నందు నిద్రించిన ఇతడు ధన్యుడు అనుకుంటున్నారా?

     మీ జీవితములో మీరు పండుగను ఆచరించుటకు ఇచ్చిన ప్రాముఖ్యతకంటే ఆయన రాజ్యములో ప్రవేశించుటకు మరి ఎక్కువైనా ప్రాముఖ్యత ఇవ్వవలెను. మరి ముఖ్యముగా ఎవరైతే పరలోకమునకు పోవుదురో వారందరు ధన్యులు. ఇంత శ్రేష్టమైన ఈ మాట అనగా నీవుకూడా ధన్యుడవు అనుమాట చేత పిలువబడాలని ఆశ నీకుంటే ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తములో కడుగబడి నీ చివరి ఊపిరివరకు నమ్మకముగా జీవించి ఆయన రాజ్యములో ప్రవేశించుటకు యోగ్యుడవుగా జీవించుదువుగాక.

సార్వత్రిక సంఘమునకు వినబడుచున్న దేవుని స్వరము :

     ప్రకటన 2:7 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినును గాక. యోహాను భక్తుడు వినిన సందేశమును కొంత విపులముగా ఆలోచిస్తాము. చెవిగలవాడు అనే మాట మొట్టమొదట చెప్పినది యేసుప్రభులవారు. అనేక స్థలములలో దేవుని వాక్యమును ప్రకటిస్తూ ప్రజలకు అనేక ఉపమానములు చెప్పెను. ఉపమానమనగా భూసంబంధమైన సంగతులను ఆధారము చేసుకొని తెలియజేసే పరలోక సంబంధమైన మర్మములను ఉపమానమంటారు. యేసు చెప్పిన అనేక ఉపమానములలో చెవిగలవాడు వినునుగాక అని చెప్పెను. మత్తయి 11:15; 13:9; మార్కు 4:9; లూకా 8:8; 14:35లలో చూడగలము. అనేక మార్లు ఈ మాట వాడుటకు ముఖ్యకారణం ఏమనగా చెవులు గలిగినవారు వినుటలేదు గనుకనే ప్రభువు ఈ మాట చెప్పవలసి వచ్చింది. ఎందుకు వినటంలేదని ఆలోచించినప్పుడు ప్రజలు ఏ స్థితిలో వున్నారో జాగ్రత్తగా ఆలోచిస్తాం. మత్తయి 13:15లో యేసు చెప్పిన మాటలు గమనిస్తే ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొనియున్నారని చూస్తాము.

మనస్సు త్రిప్పబడిన ప్రజలు :

     మనిషిలో మనస్సు లేక హృదయం అనేది ముఖ్యభాగము. ఈ మనస్సులో దేవునికి చోటివ్వనప్పుడు మనిషి లోకములో పాపముతో నింపబడియుండును. అప్పుడు దేవుని స్వరము వినబడినా వినలేని అధ్వానస్థితిలో వుండును. కావున మనిషిలో ఉండే భయంకరమైన బలహీనత మనస్సు త్రిప్పబడడం. దీని గూర్చ ఎఫెస్సీ 4:18లో మనము గమనిస్తాము. “వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.” ఈ భాగములో మనుష్యుల స్వభావమును గూర్చి మనము చూచినట్లయితే
1) అంధకారమైన మనస్సును కలిగినవారు. (చీకటిలో జీవించుచున్నవారు).
2) తమ హృదయ కాఠిన్యమువలన మరియు తమలో ఉన్న అజ్ఞానము (వారి హృదయములు మోడుబారి దేవుని జ్ఞానము లేనివారు).
3) దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారు. (లోకముతో కలిసిపోయి దేవునివలన కలుగు ఆత్మసంబంధమైన జ్ఞానముచేత నింపబడనివారు).
4) తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునువారు. (పనికిరాని లోకసంబంధమైన మార్గములో వెళ్తూవుంటారు. కారణం చెడిపోయిన వీరి మనస్సే).
ఇలాంటి స్థితిలో ఉండుటవలన మానవుడు దేవుని మాట వినలేకపోతున్నాడు. దేవుని యెరిగినవారిలో కూడా కొందరు ఇలా జీవిస్తుంటారు.

హృదయములో దేవునికి స్థానం లేకపోవుటవలన కలుగు నష్టాలు :

1) హృదయము క్రొవ్వినది.
2) చెవులు మందములైనవి.
3) కన్నులు మూయబడియున్నవి.
     ఇలాంటి స్థితిలో జీవిస్తున్న మనం దేవుని మాట వినాలి అంటే, మనం చెడిపోయి చీకటిలో జీవిస్తున్న మన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి, నూతన స్వభావమును ధరించుకోవాలి. అంతేకాక మానసికముగా, ఆధ్యాత్మికముగా, శరీరకముగా చెడిపోయిన స్థితిలోనుండి బయటపడాలి. అంతేకాక అపవాదికి స్థానమిచ్చినవాడవై సేనా అనే దయ్యము పట్టినవానివలె చెడిన స్థితిలో వున్నావు. నీవు దేవుని ఆలయమైయున్నావని మరిచిపోవద్దు. కావున ఈలాంటి స్థితినుంచి బయటపడి అపవాది వైపు త్రిప్పబడిన నీ మనస్సును దేవుని వైపునకు త్రిప్పబడి ఆయన స్వరమును, మాటను వినాలని కోరుచున్నాడు.

     చెవిగలవాడు విని దాని ఇతరులకు తెలియజెప్పాలి. మొదట ఈ పనిని దైవసేవకులు, సువార్తికులకు తెలియజేయబడింది. వీరు విని ఇతరులకు తెలియజెప్పాలి. మన బాధ్యత వినాలి, తెలియజెప్పాలి. ఆయన రాకడ సమీపముగా ఉంది గనుక వినిన సత్యములను నశించిపోతున్నవారికి తెలియజేయుదుము గాక.

ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట :

     పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించునని యోహాను 14:26లో చూస్తాము. “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును”. కావున మనకు బోధించువాడు పరిశుద్ధాత్మ తండ్రియే. ఆయన తన సేవకులతో, సువార్తికులతో మరియు బోధకులందరికి బోధించును. ఎట్లనగా తలంపుల ద్వారా, దర్శనము ద్వారా, దేవుని స్వరము ద్వారా వినిపించబడును. తన సేవకులతో మాట్లాడుటకు దేవుడు యెషయా గ్రంథము 11:2వ వచనము ప్రకారము దేవుడిచ్చే శ్రేష్టమైన వరములను పొందుదుము. గనుక సేవకులైనవారందరు దేవుని బలమైన ఆత్మతో నింపబడి శక్తివంతమైన సందేశములను విని అనేకులకు బోధించి నూతన ఆత్మలను ప్రభువు దగ్గరికి తీసుకుని వత్తురుగాక.

సంఘములతో చెప్పుచున్నమాట :

     ఈనాడు సంఘములన్నియుకూడా దేవుని మాటలు వినకపోవడానికి కారణం.
1) పరిశుద్ధాత్మ దేవునికి లోపడకపోవడం.
2) సంఘ అధ్యక్షుడైన సంఘకాపరి మాట వినకపోవడం.
     సంఘము దేవుని నాయకత్వములో ఉండాలంటే పై ఇద్దరికి లోబడాలి. ఎఫెస్సీలో ఉన్న సంఘములన్ని కూడా అపవిత్రపరచబడి దేవుని ప్రేమించకుండా వుండటంచేత ఆ సంఘములకు మరియు సార్వత్రిక సంఘమునకు బలమైన హెచ్చరిక దేవుడిచ్చాడు. ఎందుకనగా సార్వత్రిక సంఘమును పరిశుద్ధపరచుటకు ఆయన రాకడ సమయములో ఎత్తబడే గుంపులో ఉండుటకు ఈ సంఘమును దేవుడు ప్రేమించి తన్ను తాను అప్పగించుకొని ఏ కళంకము, ఏ ముడత లేకుండా నిర్దోషులుగా, నిష్కపటముగా ఆయన దినమునందు ప్రతి సంఘము సిద్ధపడాలని ప్రభువు ఆశయైయున్నది.

చెప్పుచున్నమాట వినునుగాక :

     బైబిల్ గ్రంథములో మొదట ఈ మాటలు పలికింది యేసుప్రభులవారు మాత్రమే. మత్తయి సువార్త 6వ అధ్యాయములో నేను మీతో చెప్పునదేమనగా అనే మాట 22, 28, 32, 34, 39 వచనములలో ఈ మాట చూస్తాం. కాబట్టి దేవుడొక్కడు ఈ మాట పలుకగలడు. ఈ మాట చెప్పె అధికారం ఎవరికి లేదు. తర్వాత ఈ అధికారం తన శిష్యులకిచ్చాడు. ఎంతగొప్ప ఆధిక్యత అందుకే ప్రకటన 2:7లో చెవులు కలిగినవారందరు వినాలి అని ఆజ్ఞ యిచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి ప్రకటన 1:3లో ఇలా వ్రాయబడి ఉంది. “సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులని” చెప్పెను. మనకంటే కూడా అంగవైకల్యముతో వుండేవారు ఎక్కువ మంది సేవలో వాడబడుతున్నారు. అలాంటప్పుడు అన్ని అవయవములు సరిగావున్న మనం ఎందుకు బోధించలేకపోతున్నాం? ఎందుకు పాటించలేకుంన్నాం? జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. వాక్యభాగానికి లోబడితే ఆశీర్వాదము పొందినవారమవుతాం.

*గాక :*

     ఈ మాట యొక్క అర్థం ఆలాగు జరుగునుగాక అని అర్థం. మరొక మాటలో ఆమెన్ అనికూడా అంటారు. అనగా చెప్పేవారి మాటలను వినేమనం అంగీకరించినప్పుడు ఆమెన్ అని పలుకుతాం. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి సందేశమును వినిన నీవు ఆమెన్ అని పలకాలి. అప్పుడు నీవు ఆ సందేశమునకు అంగీకారము తెలిపినవాడవవుతావు. దేవుడు నిన్ను దీవించి కాపాడునుగాక.