Day 86 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను (రోమా 8:18).

ఇంగ్లాండ్ దేశంలో ఈ మధ్య ఒక పెళ్ళిలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. పెళ్ళికొడుకు ధనవంతుడు, ఉన్నత కుటుంబీకుడు, పదేళ్ళప్రాయంలో ఒక ప్రమాదంలో కళ్ళు రెండూ పోగొట్టుకున్నాడు. గుడ్డివాడైనప్పటికీ చదువులో అందరి మన్ననలూ పొందాడు. పెళ్ళికూతురిది వర్ణించలేనంత అందం. కాని ఏం లాభం, ఆమే ముఖారవిందాన్ని చూడడానికి నోచుకోలేదు. కాని పెళ్ళికి కొన్ని రోజులముందే నిపుణులైన కంటి డాక్టర్లు అతనికి చికిత్స చేస్తారు. పెళ్ళిరోజున దాని ఫలితం తెలియనున్నది.

ఆ రోజు రానే వచ్చింది. అతిధులు, బహుమతులతో చర్చి నిండింది. మంత్రులు, ఉన్నత సైన్యాధికారులు, బిషప్పులు, ఎందరో కీర్తి ప్రతిష్టలున్న వాళ్ళు వచ్చారు. పెళ్ళికొడుకు పెళ్ళి బట్టలు వేసుకుని కళ్ళకి ఇంకా కట్టుతోనే తన తండ్రితో కలిసి కారులో చర్చికి చేరుకున్నాడు. చర్చి దగ్గర కంటి వైద్యుడు అతన్ని కలిసాడు.

పెండ్లికుమార్తె తండ్రి ఆమెను సుతారంగా నడిపిస్తూ తీసుకొచ్చాడు. రకరకాల భావాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందరూ అంతలా ప్రశంసిస్తున్న తన అందాన్ని తన ప్రియుడు వేళ్ళతో తడిమి చూడడమేనా, లేక కళ్ళారా చూసి మురిసిపోయే ప్రాప్తం ఉందా.

ఆమె ప్రవేశిస్తుండగా మధురమైన సంగీతం చర్చిలో నిండింది. పుల్ పిటని సమీపిస్తుంటే ఆమె కళ్ళు ఒక వింత దృశ్యంపై పడినాయి.

వరుని ప్రక్కన అతని తండ్రి ఉన్నాడు. వరుని ఎదుట ఆ కంటి వైద్యుడు కంటికి ఉన్న కట్లు విప్పుతూ ఉన్నాడు. చివరికట్టు కూడా తొలగించబడింది. రెప్పలు రెపరెపలాడించి తడబడుతూ ఒక అడుగు ముందుకి వేసాడు. నిద్రమేల్కొన్నవాళ్ళు పరిసరాలను నిదానించి చూసినట్టు కళ్ళు చికిలించి ముందుకు చూసాడు. పైనుండి గులాబిరంగు అద్దంలోగుండా సూర్యకాంతి అతని ముఖంపై పడుతున్నది. అయితే అతను దానివంక చూడలేదు.

మరేం కనిపించింది అతనికి? ఒక్క క్షణంపాటు తన తత్తరపాటును అణుచుకుని వదనంలో ఇదివరకెన్నడూ లేని హుందాతనం, ఆనందం ఉట్టిపడుతుండగా తన వధువును ఎదుర్కోవడానికి ముందుకి అడుగేసాడు. వాళ్ళిద్దరి చూపులు పెనవేసుకున్నాయి. కలిసిన ఆ యిద్దరి కళ్ళు మరెన్నటికీ విడిపోవన్నట్టుగా అనిపించింది.

"ఎన్నాళ్ళకి!" ఆమె పెదీమలు విచ్చుకున్నాయి. "ఎన్నాళ్ళకి!" అతను బదులు పలికాడు. ఆ దృశ్యం అక్కడ చేరియున్న వాళ్ళ హృదయాల మీద హత్తుకుపోయింది. సంతోష సంభ్రమాలకు అంతులేదు.

బాధలు, విచారాలు నిండిన ఈ లోకంలో తన యాత్రను ముగించుకుని క్రైస్తవుడు పరలోకంలో చేరి తన ప్రభువును ముఖాముఖిగా చూసినప్పుడు జరిగే సన్నివేశానికి ఈ దృశ్యం ఒక మచ్చుతునక.

నా ప్రియతమా! యేసు ప్రభూ! నీతినిలయా!

నీపైని ఆశతో, నీ రాకకై,
దాపుచేరే వేళకై నిరీక్షించేను
నా కన్నులు కాయలు కాసేను

ఆ రోజు రావాలి ఎదురు తెన్నులిక పోవాలి
కడకు చేరేవు నన్ను నీ స్వరం వింటాను.
కన్నులారా కనుగొంటాను నీతో ఉంటాను
ఎంత రమ్యమీ ఊహల మేడలు.