మిమ్మును అనాధలనుగా విడువను


  • Author: Anil Andrewz
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini Feb - Mar 2011 Vol 1 - Issue 3

నిర్గమ 3:8 “... పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను”. ఇది అద్వితీయ సత్యదేవుని మనసు. దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం, నాలుగు వందల ముప్పై సంవత్సరములు కఠిన బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులు పెట్టిన మూలుగులు ఆ నీతి స్వరూపుడగు తండ్రి విని, తాను ప్రేమించిన వారిని రక్షించుటకు తీసుకున్న నిర్ణయం. బానిసత్వమునుండి విడిపించి, రక్షించి వారిని విడిచిపెట్టలేదు, వాగ్ధాన భూమి వరకు వారికి తోడుగా నుండి నడిపించడానికి దిగి వచ్చాడు.

ఫరో ఎదుట ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు చేసిన కార్యములు చుస్తే, దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏమైనా చేయగలడు అని తెలుస్తుంది. మనిషి దేవునికి ఎంత ప్రియమైనవాడో ఇక్కడ మనము తెలుసుకొనగలము. ప్రేమించిన వారు దూరమైతే ఎంత బాధ అనుభవించాలో దేవునికి తెలుసు. తాను ప్రేమించినవారి కొరకు, తాను ప్రేమించిన కుమారునినే త్యాగము చేయుటకు సిద్ధపడినాడు అంటే, దేవునికి మనిషిపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకొనగలం. అందుకే ఆయనను ప్రేమా స్వరూపి అని పిలుస్తారు. ప్రేమించిన వారి కొరకు చేసిన కార్యములను బట్టి ఆయనను సృష్ఠికర్త అని కూడా పిలుస్తారు. ఎన్నో వందల పేర్లు కలిగిన దేవుడు-మన దేవుడు. ప్రపంచములో ఏ మూలనుండైనా, ఏ భాషలోనైనా తనను పిలుస్తే, ఏమి కావాలి అని ఆప్యాయంగా పలుకరించే దేవుడు మన దేవుడు. ఆయనకు సృష్టించడము మాత్రమే కాదు, ప్రేమించడము కూడా తెలుసు. ప్రేమించడము మాత్రమే కాదు, స్నేహము చేయడము కూడా తెలుసు. స్నేహము చేయడమే కాదు, మరణించడము తెలుసు, మరణించడమే కాదు, ఎవరికొరకు మరణించాడో వారి కొరకు జీవించడము కూడా తెలుసు. అందుకే ఎంతటి మహా రాజైనా ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తారు.

ఇంతటి మహాత్ముడైన దేవునికి కోపము కూడా వస్తుంది. ఏ దేవుని చేత ఇశ్రాయేలీయులు నడిపించబడుచున్నారో, ఆ దేవుని ఉగ్రతకు లోనై కొన్ని లక్షలమంది అరణ్యములో మరణించినట్లు బైబిల్ సెలవిస్తుంది. మూడు కారణాల చేత వీరు దేవుని ఉగ్రతకు లోనై మరణించినట్లు పౌలు 1కోరింథి 10-8-10 లో వివరిస్తున్నారు. 1. వ్యభిచారం 2. దేవుని శోధించుట 3. దేవునిపై సణుగుట. నాడు ఇశ్రాయేలీయులు ఈ మూడు కారణాలచేత నడిపిస్తున్న దేవునికి కోపము తెప్పించినారు. నేడు క్రైస్తవులు కూడా ఈ మూడు కారణాల చేతనే ఏ దేవుడైతే 2000 సం||ల. క్రితం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే పరిశుద్ధాత్మ అను వరమును ఉచితముగా ఇచ్చి నడిపించినాడో ఆ పరిశుద్ధ దేవునికే కోపం తెప్పిస్తున్నారు. ఈ మూడు స్వభావాలు ఎందుకు కోపం తెప్పిస్తున్నవో గమనిద్దాం.

వ్యభిచారం: పాత నిబంధన కాలంలో అన్య విగ్రహములను పూజించుటను తండ్రియైన దేవుడు వ్యభిచారంతో పోలుస్తున్నాడు. ఏ దేవుడైతే ఇస్రాయేలీయులను రక్షించెనో ఆ దేవుని మరచి, ఒక దూడను చేసుకొని వారు “ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. నిర్గమ 32:4”. ఇట్టి వ్యభిచారం దేవునికి ఎంతగానో కోపం తెప్పించింది. యిర్మియా 18:13 లో – “అన్యజనులను అడిగి తెలిసికొనుడి; ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైన వినెనా?” పాపం అనగా దేవుని విడిచిపెట్టి లేక దేవుని మరచిపోయి చేసే ప్రతి పని పాపమే. క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువు – ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవారగును (మత్తయి 5:28). ఇలాంటి మోహపు చూపుతో నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల, నీ కన్ను పెరికి పారవేయుమని కూడా సలహా ఇస్తున్నారు. కన్ను లేకపోయినా పరవాలేదు కాని, వ్యభిచారం చేయకు అని భావం. దేవునిని శోధించుట: కీర్తనలు 78:18 – వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములో దేవుని శోధించిరి. (40వ) ...ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. (41వ) మాటిమాటికి వారు దేవుని శోధించిరి. (56వ)వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. దేవునిని శోధించుట అనగా, అతిగా ఆశపడుట, లేక దేవునిపై తిరుగుబాటు చేయడం. వారు ఎందుకు ఆశపడినారు? ఎందుకు తిరుగుబాటు చేసారు? కలిగియున్న దానితో తృప్తిపడకుండా, ఇంకా కావాలని ఆశపడి, అది దొరకనందుకు దేవునిపై తిరుగుబాటు చేసారు. లేని దానిని కలిగియుండాలని కోరుకొనే వాడు, కష్టపడి పొందుకొన-గలడేమోగాని, కలిగియున్న దానితో తృప్తిపడకుండా ఇంకా ఎక్కువ కావాలని అత్యాశ పడేవాడు దేవునిపై తిరుగుబాటు చేస్తాడు.దేవునిపై సణుగుట: సంఖ్యా 11:11లో జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా... ఇక్కడ వీరు ఎందుకు సణుగుచున్నారు? ఏ దేవుడు ఐగుప్తునుండి విడిపించినాడో, ఏ దేవుడు ఎఱ్ఱ సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలను నడిపించినాడో, ఏ దేవుడు ఆకాశమునుండి ఆహారము పంపించినాడో ఆ దేవుని మరచిపోయి, ఆ రక్షించిన దేవుడు ఇప్పుడు కూడా వారితో ఉండి, వారిని నడిపిస్తున్నాడు అని గ్రహించలేకపోయారు. దేవుడు సహాయం చేసేంతవరకు ఓర్పు లేకపోవడం వలననే వీరు సణుగుచున్నారు. రోమా 5:3లో – శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ జేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఇక్కడ వీరికి కలిగిన శ్రమ ద్వారా నిరీక్షణ కలుగలేదు గాని, వీరిలో సణుగుపుట్టింది. దేవునికి కోపం రగిలింది. పాళెములో ఒక కొన కాళింది. సణుగుట అనగా తొందరపాటు. అందుకే తొందరపాటు నిర్ణయాలు జీవితమును కాల్చివేస్తాయి.

దేవుడు నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. ఆది నుండి నేటి వరకు ఆయన మనసు మారలేదు ఆయన ప్రేమ మారలేదు, ఆయన శక్తి మారలేదు. సిలువ మరణం పొందునంతగా తగ్గించుకొనినను ఆయన ఉగ్రతలో కూడా మార్పేలేదు కాని, ఆయన ప్రజలలో మార్పు. 2తిమోతి 2:13 – మనము నమ్మదగనివారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. ఆనాడు ఐగుప్తు బానిసత్వమునుండి ఇశ్రాయేలీయులను వాగ్ధాన భూమికి నడిపించడానికి పరమును విడచివచ్చిన దేవుడు, కుమారునిగా పాపపు బానిసత్వం నుండి మానవాళిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చి మరణించి, సమాధిచేయబడి, తిరిగి లేచి మనలను అనాధలనుగా విడిచి వెళ్ళలేదు కాని, ఎందరు ఆయనను అంగీకరించిరో వారిని సర్వ సత్యములోనికి నడిపించడానికి సత్యస్వరూపియైన ఆత్మను మన యొద్దకు పంపినాడు (యోహాను 16:13).

యోహాను 17:12 – నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని... (15వ) నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడు మని ప్రార్థించుచున్నాను. ఇది యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు తన వారి కొరకు చేసిన ప్రార్ధన. ఆయన మనలను అనాధలనుగా విడువలేదు. అనేకులు ప్రస్తుత దినాలలో సుళువుగా చెప్పే సాకు – మమ్మును నడిపించేవారు లేరు. ఇది సరియైన సమాధానమేనా ప్రియ చదువరీ? ఇంకా కొంతమంది కాలం మారిపోతుంది, కాలంతో పాటు మనం కూడా మారాలి అంటారు. సృష్టిమొదలుకొని నేటి వరకు ఏమి మార్పు జరిగింది? వేప చెట్టుకు వేప కాయలే కాస్తున్నాయి. తాటి చెట్టుకు తాటికాయలె వస్తున్నాయి. మామిడి చెట్టుకు చింతకాయలు, జామ చెట్టుకు మునగ కాయలు రావడం లేదు కదా? సూర్యుడు నేటి వరకు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తున్నాడు. రొటీన్ కి భిన్నంగా దక్షిణాన ఉదయించడంలేదు కదా? సృష్టిలో సమస్తమూ దేవుడు ఆదిలో ఏమి చేయమని చెప్పారో అవే పనులు క్రమం తప్పకుండా నేటి వరకు పని చేస్తున్నాయి. కాని, మనిషిలోనే మార్పు. ఒకప్పుడు తలిదండ్రులను చూసి పిల్లలు భయపడేవారు. ఇప్పుడు పిల్లలను చూసి తలిదండ్రులు భయపడుతున్నారు. ఒకప్పుడు పిల్లల మాట వినకపోతే తలిదండ్రులు కొట్టేవారు, ఇప్పుడు తలిదండ్రులు ఆస్తిని పంచకపోతే పిల్లలు కొడుతున్నారు.

టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా, ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా, మనిషిలో ఎంత మార్పు వచ్చినా, దేవుడు మాత్రం మారలేదు. ఆయన ప్రేమలో మార్పులేదు. భాషను బట్టి, సంస్కృతిని బట్టి బైబిల్ మారలేదు. ప్రపంచములో ఏ భాషలో బైబిల్ చదివినా ఒక్కటే బోధిస్తుంది – పాపం చేయవద్దు అని. దేవుని శక్తి సామర్ధ్యాలు తెలుసుకున్నారు కాబట్టి అబ్రహాము దేవునితో స్నేహం చేసాడు, మోషే దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. దావీదు దేవుని హృదయాను-సారునిగా జీవించాడు.

రోమా 8:14 – దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు, ఆనాడు దేవునితో నడువని వారికి శిక్షపడింది. ఈనాడు ఆత్మ చేత నడిపించబడనివారికి శిక్షపడుతుంది. నీవు ఏ కష్టములో ఉన్నా, ప్రపంచములో ఏ మూలనున్నా, యేసయ్యా! అని పిలువు నిన్ను నడిపించడానికి నీ చేయి పట్టుకుంటాడు.

rigevidon reddit rigevidon tabletki rigevidon quantity
methotrexat grapefruit methotrexat 30 mg methotrexat 7 5


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.