Day 95 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపు మూయవలెను (2 రాజులు 4:4).

వాళ్ళు ప్రకృతిసిద్ధమైన సూత్రాలకీ, మానవ ప్రభుత్వాలకీ, సంఘానికీ, యాజకత్వానికి, చివరకి ఎలీషా ప్రవక్తకి కూడా అతీతమైన అద్భుత కార్యంకోసం ఎదురుచూస్తున్నారు గనుక దేవునితో ఒంటరిగానే ఉండాలి. మరెవరూ వాళ్ళతో ఉండ కూడదు. మానవ అవగాహన శక్తినీ, విజ్ఞానశాస్త్ర సూత్రాలనూ వదిలి అంతరిక్షంలో దేవుని మహిమకి ఎదురై నిలిచి ఆ అలోక శక్తిని తేరిపార చూడాలి.

దేవునితో వ్యవహారాలు పెట్టుకోవాలంటే ఏ పద్దతి అనుసరించాలో ఇక్కడ మనకి కన్పిస్తున్నది. ఒంటరిగా రహస్య స్థలంలో ప్రార్థన విశ్వాసాలలో ప్రతి ఆత్మా ఆయనకోసం ఎదురుచూడాలి.

కొన్ని సమయాల్లో కొన్ని ప్రదేశాల్లో దేవుడు మనచుట్టూ ఒక అనిర్వచనీయమైన గోడ కడతాడు. మనకి ఉన్న ఆధారాలన్నింటినీ పడగొడతాడు. సాధారణంగా మనం పనులు చేసే పరిస్థితులనూ, విధానాలనూ, నిరర్థకం చేస్తాడు. మనకర్థం కాని దివ్య వాతావరణంలో బంధిస్తాడు. అది మనకి ఇంతకుముందు అనుభవం కానిది, క్రొత్తది. మనకి ఇంతవరకు అలవాటైన అనుభవాల చట్రంలో ఇమడనిది. ఈ కొత్త అనుభవంలో అయితే ముందేం జరగనున్నదో మనకి తెలియదు. మన జీవితం అనే వస్త్రాన్ని దేవుడు తన స్వరూపం వచ్చేలా కత్తిరిస్తాడు.

చాలామంది భక్తిగల మనుష్యులు కూడా ఒకరకమైన గానుగెద్దు జీవితం గడుపుతుంటారు. ప్రతిరోజూ అదే జీవితం. ముందు ఏమి జరుగనున్నదో అనే సందేహం ఉండదు. కాని దేవుడు నడిపించే ఆత్మలైతే ఎన్నెన్నో ప్రత్యేకమైన ఊహలకందని అనుభవాల్లోకి వెళుతూ ఉంటాయి. దేవుడు తమని నడిపిస్తున్నాడు అన్న విషయం తప్ప మరేదీ తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో ఆయన బంధిస్తాడు. వాళ్ళు దేవునిపై తప్ప మరిక దేనిమీదా ఏ విధంగానూ ఆధారపడడం వీలుకాదు.

పై వాక్యంలోని వీధవరాలిలాగా మనం కూడా బాహ్యమైన వాటిని వదిలి, లోపల కేవలం దేవునితో మాత్రమే కలుపబడితేనే తప్ప ఆయన చేసే అద్భుతాన్ని చూడలేము.

అతి కష్టకాలంలోనే దేవుడిని గురించిన అతి మధురమైన రహస్యాలు బయటపడుతుంటాయి.

మనల్ని లోపలుంచి తలుపుమూసి
మన బాధలో, దుఃఖంలో పలుకుతాడు దేవుడు
మనసు విప్పి మృదువుగా, ఏకాంతంలో
ముత్యాల్లాంటి మాటలు మన చెవిలో