Day 105 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నీ మాట నమ్ముకొనియున్నాను (కీర్తన 119:42).

దేవుడు తాను చేస్తానన్నదానిని చేసి తీరుతాడనీ మనం ఎంతవరకు నమ్ముతామో మన విశ్వాసం అంత బలంగా ఉంది అనుకోవాలి. విశ్వాసానికి మన ఆలోచనలతోగాని, అభిప్రాయాలతోగాని, ఒక విషయం జరగడానికి అవకాశం ఉందా లేదా అన్న మీమాంసతో గాని నిమిత్తం లేదు. బయటికి కనిపించే దానితో పనిలేదు. వీటన్నిటినీ విశ్వాసానికి ముడి పెట్టాలని చూస్తే మనం దేవుని మాటని నమ్మడం లేదన్నమాట. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడూ అంటే ఇక మనకి చీకటిలో పనిలేదు. విశ్వాసం అనేది కేవలం దేవుని మాట మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయన మాటను మనం ఉన్నదున్నట్టుగా నమ్మితే మన మనస్సుకి శాంతి ఉంటుంది.

మనలోని విశ్వాసాన్ని వాడుకోవడం దేవుడికెంతో సంతోషదాయకం. మొదటగా మన ఆత్మల్ని దీవించడానికి, రెండవదిగా సంఘాన్ని, సంఘంలో చేరని వాళ్ళని కూడా ఆశీర్వదించడానికి, కాని ఇలా ఉపయోగపడే స్థితినుంచి మనం మొహం చాటుచేసు కుంటాం.

శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనాలంటే "నా పరలోకపు తండ్రి ఈ శ్రమల గిన్నెని నా చేతుల్లో ఉంచాడు. ఇది గడిచిన తరువాత ఆయనే నాకు రుచికరమైన దాన్ని తాగడానికిస్తాడు." శ్రమలనేవి విశ్వాసానికి ఆహారం. మన పరలోకపు తండ్రి చేతుల్లో ఉండిపోదాం. తన పిల్లలకి మంచి చెయ్యడమే ఆయన మనసుకి ఆనందం..
విశ్వాసం ఉపయోగపడడానికీ, అభివృద్ధి పొందడానికీ సాధనాలు కేవలం కష్టాలూ, శ్రమలే కావు. వాక్యాన్ని చదవడం, తద్వారా దేవుడు తన గురించి తాను చెప్పుకున్నదాన్ని ఆకళింపు చేసుకోవడం కూడా విశ్వాసం పెంపొందించుకునే మార్గాలే.

నీకు దేవుని వాక్యంతో ఉన్న పరిచయం వల్ల నువ్వు చెప్పగలగాలి "దేవుడెంత ప్రేయామయుడు!" అని. అలా కాని పక్షంలో నేను అపేక్షగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇలాటి స్థితికి తీసుకురమ్మని దేవుణ్ణి అడగండి. ఆయన దయనూ, మృదుమధురమైన లాలననూ మీరు పూర్తిగా అనుభవించాలనీ, ఆయన ఎంత మంచివాడో తెలుసు కోవాలనీ, తన పిల్లలకి క్షేమం జరగడం ఆయనకెంత ఇష్టమో మీకు తెలియాలని అర్థించండి.

ఇలాటి మానసిక స్థితికి మనం ఎంత దగ్గరగా రాగలిగితే అంత నిశ్చింతగా మనల్ని మనం ఆయన చేతులకి అప్పగించుకుంటాం. మన బ్రతుకులో ఆయన ఏమి చేసినప్పటికీ తృప్తిగానే ఉంటాము. అప్పుడు శ్రమలు వస్తే మనం చెప్పగలం.

"వీటి ద్వారా దేవుడు నాకేమి చేయనున్నాడో ఓపికగా కనిపెట్టి చూస్తాను. ఆయన ఏదో ఒక మేలు చేస్తాడని నా నిశ్చయం." ఈ విధంగా ఒక హుందాతనంతో లోకం ఎదుట సాక్ష్యమిస్తాము. ఈ విధంగా ఇతరులను మనం బలపరుస్తాము.