Day 145 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను (2 తిమోతి 2: 10).

యోబు బూడిదలో కూర్చుని, తనకి వాటిల్లిన శ్రమ గురించి హృదయాన్ని క్షిణింపచేసుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం ఆయనకి తెలిసినట్లయితే ఎంతో ధైర్యం తెచ్చుకునేవాడు - ఈ లోకానికి సంబంధించిన ఒక సమస్యను పరిష్కరించడంలో ఏ మనిషైనా నా దేవుడికి సహాయపడుతున్నాడూ అంటే, తానే ఆ మనిషి అని. కేవలం తన కోసమే ఏ మనిషి బ్రతకడు. యోబు బ్రతుకు కూడా నీ, నా బ్రతుకులాంటిదే. కాకపోతే అది పెద్ద అచ్చులో రాయబడింది. కాబట్టి మన కోసం కాచుకుని ఉన్న శ్రమలేమిటో మనకి తెలియకపోయినా మనకి ఒక నమ్మకం ఉండాలి. యోబు తనను చుట్టుముట్టిన నికృష్టస్థితిలో పోరాడిన రోజులే ఆయనని మనం మాటిమాటికీ గుర్తుచేసుకొనేలా చేసినాయి. ఆ శ్రమలు యోబుకి రాకపోయినట్లయితే ఆయన పేరు జీవగ్రంధంలో రాయబడేది కాదేమో. అలాని మనం పెనుగులాడుతూ గడిపిన రోజులు, దారితెన్ను తెలియక కొట్టుమిట్టాడిన రోజులే మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన రోజులు అని గుర్తుంచుకోండి.

మనకు అతి విచారకరంగా అనిపించిన రోజులే అతి శ్రేష్టమైన రోజులు. మనం మొహం నిండా చిరునవ్వుతో వసంతకాలపు పుష్పాలు నిండిన మైదానాల్లో గంతులేస్తూ పరిగేత్తే రోజుల్లో హృదయానికి మాత్రం ఏమి మేలు జరగదు.

ఎప్పుడూ ఉల్లాసంతో ఉత్సాహంతో ఉండే ఆత్మ జీవపు లోతుల్ని తరచి చూడదు. అలాంటి స్థితిలో ఉండాల్సిన ఆనందం సంతృప్తి ఉన్నాయి కానీ హృదయం మాత్రం ఎదగదు. ఔన్నత్యాన్ని, లోతైన అనుభవాలను తరచి చూడవలసిన మన ప్రవృత్తి మాత్రం ఏ అభివృద్ధి లేకుండా అలానే ఉండిపోతుంది. జీవితం కోవ్వోత్తిలాగా గుడ్డిగా వెలిగి చివరికంటా కాలిపోతుంది. దానికి నిజమైన సంతోషపు ధగధగలు ఉండవు.

"దుఃఖపడువారు ధన్యులు." చలికాలపు సుదీర్ఘమైన రాత్రిళ్లు అంధకారంలోనే చుక్కలు కాంతివంతంగా ప్రకాశిస్తాయి. కొన్ని కొండపూలు మనం ఎక్కలేని ఉన్నత శిఖరాలపైనే వింతరంగులతో విరబూస్తాయి. బాధనే గానుగలోనే దేవుని వాగ్దానాలనే చిక్కటి ద్రాక్షరసం బయటికి వస్తుంది. చింతాక్రాంతుడైన యేసు తత్వం ఎలాంటిదో దుఃఖాలను రుచిచూసిన వాడికే అర్థమవుతుంది.

నీ జీవితంలో సూర్యకాంతి ప్రకాశించడం లేదు. కానీ ఇప్పుడున్న మబ్బు పట్టిన స్థితిలోకూడా నీకు తెలియని మేలుఉంది. ఎందుకంటే కొంతకాలం ఎండలు కాస్తే నేలంతా ఎండిపోయి ఎడారిలా తయారవుతుందేమో. దేవుడికి అంతా తెలుసు. సూర్యుడు, మబ్బులు ఆయన చేతుల్లోనే ఉన్నాయి.