Day 148 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను... అందుకాయన... అక్కడ అతని నాశీర్వదించెను (ఆది 32: 26,29).

కుస్తీపట్ల వలన యాకోబుకి ఆశీర్వాదం, విజయం దొరకలేదు గాని, వదలకుండా పట్టుకొని వేలాదినందువలన దొరికినాయి. అతని తొడ ఎముక పట్టు తప్పింది. అతనింకా పోరాడలేడు. కాని తన పట్టుమాత్రం వదలలేదు. పోరాడడానికి శక్తి లేకపోయినా తనతో పోరాడుతున్న వ్యక్తి మెడచుట్టూ చేతులువేసి వ్రేలాడబడ్డాడు. తనకి అతడు లొంగేదాకా వదలలేదు.

మనంకూడా పెనుగులాడడం మాని, మన ఇష్టాన్ని మరచి, మన చేతుల్ని తండ్రి మెడచుట్టూ వేసి అంటిపెట్టుకునే విశ్వాసంతో వేలాడితేనేగాని మన ప్రార్థనలో కూడా విజయం దొరకదు.

సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లోనుండి ఆశీర్వాదాలను గుంజుకోవడానికి మన బలం ఏపాటిది? బలవంతంగా దేవుని నుండి దీవెనలను లాక్కోగలమా? మన ఇష్టానుసారమయిన తీవ్ర ప్రార్ధనలు దేవుణ్ణి కదిలించలేవు. ఆయన్ని అంటిపెట్టుకుని వేలాడే విశ్వాసమే విజయాలను సాధించే విశ్వాసం. మనం కోరుకున్న దాన్ని గురించి వత్తిడిచేసి ప్రార్దించడం వల్ల ప్రయోజనంలేదు. నమ్రతగా తగ్గింపు స్వభావంతో "దేవా, నా ఇష్టం కాదు, నీ ఇష్టం" అన్నప్పుడే, మనలోని అహం లేక స్వలాభాపేక్ష చనిపోయినప్పుడే దేవుని సముఖంలో మన అభ్యర్థనలకేమన్నా విలువ ఉంటుంది. కుస్తీపట్ల వల్లకాదు, పట్టుకుని వేలాడితే మనకి దీవెనలు దక్కుతాయి.

మనకి కావలసిన విషయం గురించి బంకలాగా పట్టుకొని అదే పనిగా దేవుణ్ణి అడగడం మంచిపని కాదని చెప్తూ ఒక భక్తుడు తన ప్రార్థన అనుభవాన్ని ఇలా చెప్పాడు, "మా అబ్బాయికి ఓ సారి చాలా జబ్బు చేసింది. డాక్టర్లు పరీక్షచేసి పెదవి విరిచారు. నాలో ఉన్న ప్రార్ధనా శక్తి అంతటినీ ఉపయోగించి వాడి గురించి ప్రార్ధించాను. చాలా వారాలు ఇలా గడిచాయి. రోజురోజుకి కుర్రవాడి స్థితి దిగజారుతూనే ఉంది.

"వాడు అలా మంచంమీద పడి ఉండగా ఒకరోజు అక్కడ నిలబడి వాడివంక తదేకంగా చూశాను. ఇలానే సాగితే ఇంకెంతోకాలం బ్రతకడు. వెంటనే మోకరించే దేవుడితో చెప్పాను. "దేవా నా కొడుకు కోసం ఎంతో సమయం ప్రార్థనలో గడిపాను, లాభం కనిపించడంలేదు. ఇక వాడిని నీ చిత్తానికి వదిలేసే సమయం వచ్చింది. ఇక నా ప్రార్థనలో ఇతరుల అవసరాలను నీ ముందు ఉంచడం మొదలుపెడతాను. ఈ పిల్లవాడిని తీసుకోవడం నీకిష్టమైతే అలానే చెయ్యి. నన్ను నేను పూర్తిగా నీవశం చేసుకుంటున్నాను."

"నా భార్యను పిలిచాను, నేను చేసిన పనిని ఆమెకి చెప్పాను. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది కానీ పిల్లవాడిని దేవుని చేతులకి అప్పగించింది. రెండు రోజుల తర్వాత ఒక దైవజనుడు మమ్మల్ని చూడడానికి వచ్చాడు. మా పిల్లవాడిని గురించి ఆయన చాలా శ్రద్ధలతో ప్రార్థిస్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు "మీ అబ్బాయి బ్రతుకుతాడన్న విశ్వాసాన్ని దేవుడు మీ మధ్య నాకు ఇచ్చాడు. మీకు విశ్వాసం ఉందా?"

"నేనన్నాను, "నేనైతే వాడిని దేవుని చేతులకి అప్పగించేసాను. కానీ మరోసారి వెళ్లి ఆయనకి మొరపెడతాను" అలానే చేశాను. ఆ ప్రార్థనలోనే నాలో విశ్వాసం చిగురేసింది. మా అబ్బాయి బ్రతుకుతాడని, ఆ రోజు నుండి వాడు బాగుపడసాగాడు. నేను పట్టువదలకుండా దేవుణ్ణి అడుగుతూ ఉండడం వల్లే దేవుని నుండి జవాబు రాలేదు. నేనలాగ మొండిగా ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి నన్ను నేను లోబర్చుకోకుండా ఉన్నట్టయితే మా అబ్బాయి ఈ రోజున బ్రతికి ఉండేవాడే లేదో అనుమానమే."

దేవుని పిల్లలారా! మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే మన తండ్రి అబ్రహాముని అనుసరించి ప్రవర్తించాలి. ఎంత త్యాగానికైనా వెనుదీయనంతగా ఆయన ఇష్టానికి మనం లోబడిగలగాలి (రోమా 4: 12 చూడండి).