Day 273 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ??????? ?????????

పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైనీ అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానీని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించేను. అన్యులయొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు (ద్వితీ 32:11,12).

మన పరలోకపు తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న మనలను కొండ అంచులకు తీసుకువెళ్తాడు. ఒక్కొక్కసారి మనలను అక్కడినుండి అగాథంలోకి నెట్టివేస్తాడు కూడా. తద్వారా ఇంతవరకు మనం గ్రహించలేని ఎగిరే శక్తి మనకు ఉన్నదని గ్రహించాలి. ఈ శక్తిని మనం గ్రహించినప్పుడు ఇక జీవితాంతం హాయిగా దీనిని ఉపయోగించుకుంటాం. అయితే ఈ ప్రయత్నంలో మనకేదైనా ప్రమాదం జరిగే పరిస్థితి కనిపిస్తే ఆయన పక్షిరాజులాగా మన క్రిందికి ఎగిరివచ్చి తన బలిష్టమైన రెక్కలమీద మనలను మోసుకుని పైకి తీసుకెళ్లాడు. దేవుడు తనవాళ్ళను కనీవినీ ఎరుగని కష్టాల్లోకి నడిపించినప్పుడు ఆయనే తమను వాటినుండి విడిపిస్తాడన్న నమ్మకంతో నిశ్చింతగా ఉండవచ్చు.

దేవుడు నీ మీద ఏదన్నా బరువు పెడితే దాని క్రింద ఆయన చెయ్యి ఉంటుంది.

ఒక బ్రహ్మాండమైన మర్రిచెట్టు క్రింద ఒక చిన్న మొక్క ఉంది. దాని పైన పరుచుకుని ఉన్న మర్రిచెట్టు నీడ గురించి ఆ మొక్క ఎంతో సంతోషిస్తూ ఉండేది. బలిష్ఠుడైన తన స్నేహితుడైన మర్రిచెట్టు తనకు ఇస్తున్న సంరక్షణ గురించి ఆ మొక్క మర్రిచెట్టు పట్ల కృతజ్ఞతతో ఉండేది.

ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి గొడ్డలితో ఆ గొప్ప మర్రి చెట్టును నరికేశాడు. ఆ చిన్న మొక్క విచారానికి అంతులేదు. "ఆయ్యో, నా నీడ పోయిందే, ఇప్పుడిక పెనుగాలులు నా మీద బలంగా వీస్తాయి. తుపానులు నన్ను పెళ్ళగిస్తాయి" అంటూ అది రోదించింది.

ఆ మొక్కను అంటి పెట్టుకుని ఉన్న దేవదూత అన్నాడు, "కాదు, కాదు, ఇప్పుడు సూర్యరశ్మి నీ పైన ప్రసరిస్తుంది. వర్షపు చినుకులు నేరుగా, ధారాళంగా కురుస్తాయి. మొక్కగానే ఉండిపోయిన నీ దేహం సౌష్టవాన్ని పుంజుకుని విరబూస్తుంది. నీ పూలు ఎండలో చిరునవ్వులు చిందిస్తాయి. నిన్ను చూసినవాళ్ళంతా అంటారు "ఈ చిన్న మొక్క ఎంతలా ఎదిగిపోయింది! ఇప్పటిదాకా దానికి ఉన్న ఆశ్రయం, నీడ తొలగిపోగానే ఇది ఎంత అందంగా నవనవలాడుతూ ఉంది!"

ఈ విధంగానే దేవుడు నీ సౌకర్యాలనూ, నీకిష్టమైన కొన్నింటిని నీనుండి దూరం చెయ్యడంద్వారా నిన్ను మరింత మెరుగైన క్రైస్తవునిగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. దేవుడు తన సైనికులను యుద్ధరంగంలోకి, కష్టసాధ్యమైన పనుల్లోకి పంపించడం ద్వారా శిక్షణ ఇస్తుంటాడు. మెత్తని పరుపులపై పడుకోబెట్టడం ద్వారా కాదు. ఆయన వారిని సెలయేర్లు దాటిస్తాడు. నదుల్ని ఈదిస్తాడు, పర్వతాలెక్కిస్తాడు. విచారమైన, బరువైన సంచుల్ని వారి వీపులకు కట్టి దూరప్రదేశాలకు నడిపిస్తూ ఉంటాడు. అంతేగాని వారికి తళతళలాడే యూనిఫారంలు వేసి క్యాంపు గేటు దగ్గరే చతికిలబడమని చెప్పడు. సైనికులు అంటే యుద్దరంగంలో తమ వీరత్వాన్ని ప్రదర్శించవలసినవాళ్ళు. శాంతికరమైన సమయాల్లో సైనికులు అవసరం లేదు. తుపాకి మందు వాసనలో, ఫిరంగి మోతల్లో, పొగల్లో, తుపాకీ గుండ్లు దూసుకుపోతున్న స్థలాల్లో మాత్రమే సైనికుడు శౌర్యాన్ని నేర్చుకుంటాడు.

క్రైస్తవుడా, నీ కష్టాలన్నిటికీ ఈ ఉదాహరణ చాలుకదా, నీలోని శ్రేష్ఠతను దేవుడు బయటకు తెస్తున్నాడు. నిన్ను యుద్దరంగంలోకి నడిపించడం ద్వారా నీలోని సైనిక లక్షణాలను అభివృద్ధి చేస్తున్నాడు. దానిలో విజయం సాధించడం కోసం నీ మనసంతా లగ్నం చేసి పోరాడు.