దేవుడు సమస్తాన్ని సృష్టించాడు!


  • Author: Praveen Kumar G
  • Category: Children Stories
  • Reference: Sajeeva Vahini Jun - Jul 2011 Vol 1 - Issue 5

మనల్ని ఎవరు సృష్టించారు? బైబిల్లో దేవుని వాక్యం ఏ విధంగా ఈ మనుషులంతా వచ్చారు అని తెలియజేస్తుంది?. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు మొట్ట మొదటిగా ఒక మనిషిని సృష్టించి ఆదాము అని పేరు పెట్టాడు. ఆదామును దేవుడు మంటి నుండి సృష్టించి, జీవవాయువు ఊదగా ఆదాము జీవించగలిగాడు. అతనిని ఎంతో అందమైన ఏదేను తోటలో ఉంచి సమస్తాన్ని అనుగ్రహించాడు. ఆదామును సృష్టించక ముందే దేవుడు అన్ని సమకూర్చాడు. అంటే రకరకాల చెట్లను, పరిమళాన్ని ఇచ్చే పువ్వులను, అందమైన పక్షులను, పశువులను, చేపలను, ఇంకా ఎన్నో (ఇవి లేవు) అనేది లేకుండా సృష్టించాడు. ఇంకా వీటన్నిటిని సృష్టించక ముందే అంటే ప్రదేశాలు ప్రజలు, వెలుగు చీకటి, ఎత్తులు పల్లాలు, నిన్న రేపు లాంటివి లేకన్న మునుపే దేవుడు ఒక్కడే ఉండేవాడు ఆయనకు ఆది లేదు అంతము లేదు. అప్పుడు ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు “వెలుగు కలుగు గాక!” అనగానే వెలుగు కలిగింది. అప్పుడు దేవుడు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరులు పెట్టెను. ఆ అస్తమయము ఉదయము కలుగగా మొట్ట మొదటి దినమాయెను. రెండవ రోజున దేవుడు నదులను జల రాశులను సృష్టించాడు. మూడవ దినమున నేలపై రక రకాల అందమైన మొక్కలను చెట్లను సృష్టించి నాలుగవ దినమున సూర్యునిని చంద్రునిని సృష్టించాడు. అయిదవ దినమున చేపలను పక్షులను జంతువులను సృష్టించి ఆరవ దినమున మాత్రము ఒక ప్రత్యేకమైన పని చేసాడు. ఇందాకే చదివాము కదా ఆదామును సృష్టించాడు. అవును సమస్తాన్ని సిద్ధపరచి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదామును సృష్టించాడు. అయితే దేవుడు ఆదాముతో ఈ తోటలో ఉన్న అన్ని ఫలములను తినవచ్చును గాని ఆ ఒక్క మంచి చెడ్డల తెలివినిచ్చి పండును మాత్రం తినవద్దు అది తిను దినమున నిశ్చయముగా మరణించెదవు అని ఆజ్ఞాపించాడు. మరియదేవుడు నరుడు ఒంటరిగా ఉంటె మంచిది కాదు అని ఒక సాటియైన సహాయమును ఇవ్వాలని ఆలోచించాడు. ఆదాము సమస్త సృష్టికి పేరులు పెట్టాడు, ఎంత తెలివైన వాడు కదా ఆదాము!. అయితే సృష్టి అంతటిలో సాటియైనటువంటి సహాయం దొరకనప్పుడు, ఆదాము నిద్రించుచున్న సమయంలో అతని పక్కటెముకను తీసి హవ్వను సృష్టించాడు. దేవుడు సమస్త సృష్టిని ఆరు దినములో సృష్టించి ఆదాము హవ్వాలతో స్నేహితుడుగా ఉన్నాడు.

ప్రియమైన చిన్న బిడ్డలారా సమస్తాన్ని దేవుడు సృష్టించాడు అనే ఈ కథ చదివాము కదా! అయితే సమస్తము సృష్టించిన దేవుడు మనలను ఎన్నో తప్పులు చేస్తామని కూడా తెలుసు. అయితే పాపమునకు వచ్చే జీతం మరణం, కాని దేవుడు మనలను ఏంతో ప్రేమించి తన ఏకైన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన మనకొరకు అంటే మన పాపముల కొరకు సిలువపై శ్రమ పడి మరణించి మరలా తిరిగి లేచి పరలోకమునకు వెళ్లాడు. ఎవరైతే “దేవా నన్ను సృష్టించినందుకు వందనాలు, నా పాపములను క్షమించు” అని ప్రార్థిస్తారో వారిని తప్పకుండా క్షమిస్తాడు. అంతే కాకుండా నూతన జీవితాన్ని అనుగ్రహించి తన బిడ్డగా చేసుకుంటాడు తనతో నిత్య రాజ్యంలో ఉండే భాగ్యాన్ని కూడా ఉచితంగా అనుగ్రహిస్తాడు.