Day 20 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. (ప్రసంగి 7:3)

విచారం దేవుని కృప క్రిందికి వస్తే, అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది. ఆత్మలో ఎక్కడో మరుగు పడిపోయిన లోతుల్ని విచారం వెలికి తీస్తుంది. తెలియని సమర్దతలను, మరచిపోయిన అనుభవాలను వెలుగులోకి తెస్తుంది. నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండేవాళ్ళలో లోతు ఉండదు. తమలోని సంకుచితత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు. ఆత్మ అనే నేలను దున్ని పూడుకుపోయిన సారవంతమైన మట్టిని పైకి తీసే దేవుని నాగలే దుఃఖం. అందువల్ల పంటలు బాగా పండుతాయి. మనం పాపంలో పడకుండా మహిమ జీవితాలే గడుపుతూ ఉన్నట్లయితే దేవుని సంతోషం అనే మందమారుతమే మనలోని నిపుణతలను వెలికి తీసే సాధనమయ్యేది. కానీ ఈ పతనమైన లోకంలో మనలను మనకర్థమయ్యేలా చెయ్యడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం నిరాశతో కలుషితం కాని విచారమే. విచారంలోనే మనం దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తాం.

విచారం మనల్ని మెల్లగా, తరచితరచి మన హృదయాలను, అభిప్రాయాలను తలపోసుకుంటూ సాగేలా చేస్తుంది. పరలోకపు జీవితంలోని మాధుర్యాలను మనలో పుట్టించేది విచారమే. దేవుని కొరకు, తోటి మానవుల కొరకు సేవ చెయ్యడమనే మహా సముద్రంలో మన సమర్పణ నౌకని నడిపించడానికి మనల్ని ప్రోత్సహించేది విచారమే.

ఒక గొప్ప పర్వత శేణి దగ్గర కొందరు సోమరి జనం నివశిస్తున్నారు. ఆ పర్వతాల లోయలనూ దారులనూ వాళ్ళెప్పుడూ పరిశోధించడానికి పూనుకోలేదు. ఒక రోజు ఆ ప్రాంతాల్లో ఒక పెను తుఫాను వచ్చింది. వాళ్ళూన్న ప్రాంతం మునిగిపోయే ప్రమాదం వచ్చేసరికి తప్పనిసరై వాళ్ళంతా పర్వతాల్లోకి వెళ్ళి నివాస స్థలం కొసం వెదకసాగారు. ఆ గాలి వానలోనే వాళ్లకి ఆ పర్వతాల నిండా మంచి గుహలు, పండ్ల చెట్లు, నీటి వాగులు, మానవ నివాసానికి అన్ని సౌకర్యాలున్న ప్రదేశాలెన్నో కనిపించాయి. అప్పటి దాకా వాటిని వృధాగా పోనిచ్చినందుకు వాళ్ళు బాధపడ్డారు. మనం కూడా ఇంతే, మన వ్యక్తిత్వపు ఇవతలి అంచులో ఏ చలనమూ లేకుండా ఉంటుంటాము. దుఃఖపు గాలివానలు వచ్చి మనలో అంత శక్తి ఉందని అంతవరకూ మనం ఊహించనైనా ఊహించలేని వ్యక్తిత్వాన్ని మనకి చూపిస్తాయి.

దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా విరగ్గొడితే గాని ఏ గొప్ప పనికీ వాడుకోడు. యాకోబుకున్న అందరు కొడుకుల కంటే యోసేపు ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు. ఇదే అతణ్ణి అనేక జనాంగాలకి అన్నదాతగా నిలబెట్టింది. అందుకే పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా అతని గురించి ఇలా రచించాడు. "యోసేపు ఫలించెడి కొమ్మ. . . దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును" (ఆది 49:22). ఆత్మ విశాలం కావాలంటే దుఃఖం అవసరం.

నాగటి చాలు పైకి తెస్తుంది
సారవంతమైన సేంద్రియాన్ని
నేర్పింది ఇది నాకో సరికొత్త పాఠాన్ని

ఆకాశం కింద పరచుకున్న
అవనీతలం నా జీవితం
అందులో విరివిగా పండాలి ఫలసాయం

విశ్వాసం, దయవంటి
బంగారు పంట ఎక్కడ పండుతుంది
దుఃఖం అనే నాగలి దున్నిన గుండెపొలంలోనే

దేవుని కష్టాల బడిలో ప్రతి వ్యక్తి, ప్రతి జాతి పాఠాలు నేర్చుకోవాలి. "రాత్రి ఎంత బావుంటుంది! చుక్కలు రాత్రిళ్ళే కదా కనిపిస్తాయి" అంటాము. అలాగే "దుఃఖం ఎంత మంచిది. దుఃఖంలోనే దేవుని ఆదరణ మనకి దొరికేది" అనాలి. వరదలు వచ్చి ఒకతని ఇల్లు, అతని జీవనోపాది సర్వస్వం కొట్టుకుపోయింది. నీళ్ళన్నీ ఇంకిపోయిన తరువాత దిగాలుగా నిలబడి చూస్తున్నాడా వ్యక్తి. అంతలో నేలలో పాతుకొని ఏదో మెరుస్తూ కనిపించిందతనికి. వరద నీళ్ళు దానిపైనున్న మట్టిని కడిగేశాయి. "బంగారంలా ఉందే" అంటూ చూసాడతను. బంగారమే! అతన్ని దరిద్రుణ్ని చేసిన వరదలే అతన్ని ధనికుణ్ని చేసాయి. జీవితంలో చాలా సందర్భాలలో ఇలాగే జరుగుతుంది.