Day 321 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? (లూకా 18:6,7).

దేవుడు ఏర్పరచిన సమయం నీ ఇష్టానుసారంగా ఉండదు. కాబట్టి చెకుముకి రాయిని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పు రవ్వలు రాకపోతే మళ్ళీ కొట్టాలి. దేవుడు ప్రార్థనలను వింటాడు. అయితే మనం ఊహించుకున్న సమయంలో ఆయననుండి జవాబు రాకపోవచ్చు. వెదికే మన హృదయాలకు ఆయన తన్ను తాను కనబరచుకుంటాడు. అయితే మనం ఎదురుచూసిన సమయంలో, అనుకున్న ప్రదేశంలో కాకపోవచ్చు. అందుకే పట్టు వదలక ప్రార్ధనలో గోజాడాలి.

వెనుకటికి చెకుముకి రాతితో నిప్పు రప్పించడం, ఆ తరువాత గంధకంతో చేసిన అగ్గిపుల్లతో నిప్పు పుట్టించడం చాలా కష్టమయ్యేది. పదే పదే గీసి చేతులు నొప్పి పుట్టేవి. చివరికి నిప్పు రాజుకున్నప్పుడు హమ్మయ్య అనిపించేది. పరలోకానికి సంబంధించిన ఈవుల విషయంలో కూడా మనం ఇంత పట్టుదలగా ఉండవద్దా. చెకుముకి రాతితో నిప్పు పుట్టించడంకంటే ప్రార్ధనా విజయాలను సాధించడమే తేలిక. ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆ మేరకు ముందే ఉన్నాయి.

నిరాశ చెందవద్దు. దేవుడు దయచూపే సమయం తప్పకుండా వస్తుంది. మనం నమ్మకముంచగలిగిన సమయం వచ్చిందంటే మన మనవులు నెరవేరే సమయం కూడా వచ్చేసిందన్నమాటే. విశ్వాసంతో అడగండి. తొట్రుపడవద్దు. నీ రాజు జవాబివ్వడం ఆలస్యం చేస్తున్నాడని విన్నవించుకోవడం చాలించవద్దు. చెకుముకి రాతిని తీసి మళ్ళీ మళ్ళీ గీస్తూ ఉండండి. నిప్పు రవ్వలు రేగినప్పుడు బోగ్గుల్ని సిద్ధంగా ఉంచుకోండి. మంట రావడానికి ఇక ఆలస్యం లేదు.

దేవుని రాజ్య చరిత్రలో సరియైన ప్రార్ధనను సరియైన సమయంలో చేసినట్టయితే దానికి ఎప్పటికీ జవాబు రాకపోవడం అన్నది కేవలం అసంభవం అని నా సమ్మకం.