Day 325 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము (కీర్తనలు 37:5).

నిన్ను ఇబ్బంది పెడుతున్నదేదైనా వెళ్ళి తండ్రికి చెప్పు. దాన్నంతటినీ తీసికెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు. అప్పుడే ప్రపంచమంతా పరుచుకుని ఉన్న కంగారు పెట్టే తత్తరపాటులనుండి విముక్తుడివివౌతావు. నువ్వు ఏదైనా చేయ్యవలసివస్తే, బాధను భరించవలసి వస్తే, ఏదైనా కార్యాన్ని తల పెడితే వెళ్ళి దానిగురించి ప్రభువుతో చెప్పు.

దాన్నంతటినీ ఆయనకి తగిలించు. ఇక నీక దిగుల్లేమి ఉండవు. ఆందోళన ఉండదు. తాపీగా ప్రశాంతంగా నీ పనిలో నమ్మకంగా ఉండు. నీ కార్యభారాన్ని ఆయనమీద పడెయ్యి. నీ దిగుళ్ళన్నిటినీ, నిన్ను కూడా చాపలాగా చుట్టి నీ దేవుని వీపు మీద వెయ్యి.

"నేడు" చుట్టూ
నమ్మకమనే కంచె కట్టు
ప్రేమతో దాన్ని పూర్తిచేసి
హాయిగా దాన్లో కాపురం పెట్టు
రేపు వైపు చూడకు కన్నెత్తి
రేపే ఇస్తాడు దేవుడు
రేపుని జయించే కత్తి

దేవుడు మనం నడిచే దారిని సమ్మతిస్తే దాన్ని ఆయన వశం చెయ్యడం వీలౌతుంది. తన మార్గాన్ని ప్రభువుకి అప్పగించడం విశ్వాసమున్న వాడికే సాధ్యం. మన దారీ మంచిదారి కాదని ఏ మాత్రం అనుమానం ఉన్నా, విశ్వాసం ఆ ఛాయలకే రాదు. ఆయన చేతుల్లో పెట్టడమన్నది ఒక్కసారి జరిగి చేతులు దులిపేసుకునేదికాదు. ఇది ఎప్పుడూ సాగే తతంగం. ఆయన నడిపింపు ఎంత వింతగా, ఊహించలేనిదిగా కనిపించినప్పటికీ కొండ అంచుకి ఎంత దగ్గరగా ఆయన నిన్ను తీసికెళ్ళినప్పటికీ, ఆయన చేతుల్లోంచి కళ్ళాన్ని లాగేసుకోకూడదు. మన మార్గాన్ని ఆయన ఎదుట పెట్టబోయేముందు దాన్ని గురించి ఆయన ఇచ్చే తీర్పుని స్వీకరించడానికి సిద్దపడి ఉన్నామా? అన్నిటికంటే ముఖ్యంగా ఒక క్రైస్తవుడు తన అలవాటుల్నీ, పాతుకుపోయిన తన అభిప్రాయాలను నిశితంగా పరిశీలించుకునే పరిస్థితిలో ఉండాలి. తమ అలవాట్ల గురించి క్రైస్తవులు దేవునికవి అంగీకారమేలే అన్న ధీమాతో ఉంటారు. కొందరు క్రైస్తవులు ఎందుకంత భయంభయంగా ఉంటారు? సమాధానం స్పష్టం. వాళ్ళు తమ మార్గాన్ని యెహోవాకు అప్పగించలేదు. దాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళారుగాని తిరిగి తమతో తెచ్చేసుకున్నారు.