ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

యేసు క్రీస్తు యొక్క అత్యధికమైన ఆత్మీయ స్వాస్థ్యములకు హక్కుదారులైనప్పటికిని ఆ స్వాస్థ్యములను గూర్చిన తెలివిలేక భిక్షకులవలె ఆత్మీయ జీవితమును జీవించుచున్న ఒక విశ్వాస సమూహమునకు వ్రాయబడిన పత్రిక యిది. స్వంతము చేసికొనవలసిన స్వాస్వములను వారు ప్రత్యేకపరచుటచే ఆత్మీయ క్షామమునందు జీవించవలసి వచ్చెను. వారి పరలోక ధనాగారమందు కనిపించుచున్న అత్యధిక స్వాస్థ్యమును గూర్చి వివరించి చెప్పుచూ పౌలు యీ పత్రికను వ్రాయుటకు ప్రారంభించెను. జగత్తు పునాది వేయబడకయునుపే ఏర్పరచబడుట, కుమారులుగా స్వీకరించుటకు అంగీకరించుట, పాప క్షమాపణ, విమోచన, సంపూర్ణమైన జ్ఞానము, ఆత్మీయ స్వాస్ధ్యములు, పరిశుద్ధాత్మ ముద్ర వంటి పరలోకపు ఆశీర్వాదములన్నియు వారికి చెందినవిగా యుండెను. ఈ గొప్ప స్వాస్థ్యమును స్వంతము చేసికొని దేవుని కృపా మహిమ కొరకు జీవించుట క్రైస్తవులకు తగును. (ఎఫెసీయులకు 1:5) 4 నుండి 6 వరకు గల అధ్యాయములలో యీ ఐశ్వర్యమునకు హక్కుదారులుగా అనుచరణ జీవితమందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్కరియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనియైయున్నాము.” (ఎఫెసీయులకు 2:10).

ఉద్దేశము:- ఎఫెసు మరియు యితర స్థలములలో గల విశ్వాసులను క్రైస్తవ విశ్వాసమందు స్థిరపరచుట, క్రీస్తు శరీరమైన సంఘము యొక్క ఉద్దేశము, గుణము వంటి వాటిని విశదీకరించుట.

గ్రంథ రచయిత:- పౌలు

ఎవరికి వ్రాసెను?:- ఎఫెసు మరియు ఇతర స్థలములందుగల విశ్వాసులకు.

వ్రాసిన కాలము:- దాదాపు క్రీ.శ. 60లో పౌలు రోమా చెరయందున్నప్పుడు.

ఆంతర్యము:- సంఘ సమస్యలను పరిష్కరించుటకు యిది వ్రాయబడలేదు. దానికి మారుగా సంఘములను బలము పొందునట్లు చేసి, ప్రోత్సాహావరచుటకు వ్రాయబడెను. తుకికు చేతికిచ్చి పంపెను. ఎఫెసీయులకు 1:1 లో ‘ఎఫెసులో అనుపదము కుండలీకరణములో వచ్చుటచే ప్రాచీన చేవ్రాత ప్రతులలో ఆ పదము లేదని తెలిసికొనవచ్చును. ఇది ఎఫెసునందున్న వారి కొరకు మాత్రము వ్రాయబడిన పత్రిక కాదనియు, అనేక సంఘములను మనస్సునందుంచుకొని వ్రాయబడినదనియు దీని ద్వారా ఊహించగలము. కొలొస్సయులకు 4:16 లో చెప్పబడు “ లవొదికయకు వ్రాయబడిన పత్రిక " యీ పత్రికయేనని పలువురు నమ్ముచున్నారు.

ముఖ్యపాత్రలు:- పౌలు, తుకికు.

గ్రంథ విశిష్టత:- సంఘమును శరీరముగను, దేవుని మందిరముగను, మర్మముగను, నూతన పురుషునిగను, కన్యకగను, సైన్యవీరుడుగను యీ పత్రికయందు పోల్చబడియున్నది.

ముఖ్య వచనములు:- ఎఫెసీయులకు 2:8-10; ఎఫెసీయులకు 4:1-3

ముఖ్య అధ్యాయములు: - ఎఫెసీ 6. క్రైస్తవుడు పరలోకపు ప్రతి ఆశీర్వాదము చేతను ఆశీర్వదించబడినవాడైనను (ఎఫెసీయులకు 1:3) యీ లోకమందు జీవించునంత వరకు ఆత్మీయ పోరాటమనునది అతని ప్రతిదిన అనుభవమగును. ప్రభువునందును ఆయన మహాశక్తి యందును బలపడుట ఎట్లు అను దానిని గూర్చిన అతి స్పష్టమైన ఉపదేశమును గూర్చి 6వ అధ్యాయమందు చదువగలము.

గ్రంథ విభజన:- క్రీస్తునందు గల తమ స్థానమును గూర్చి క్రైస్తవులను స్మరింపజేసి ప్రతిదిన జీవితమందు శక్తితో నిండిన జీవితమును జీవించుటకు ప్రోత్సాహమునిచ్చుటకే యీ పత్రిక వ్రాయబడెను. గ్రంథము యొక్క రెండు గొప్ప విభజనలును, వాటిలోని విభజనలును క్రింద ఇవ్వబడెను.

(1) క్రైస్తవుని పదవి అధ్యా. 1-3 వరకు.  (అ) విమోచన కొరకై స్తోత్రము ఎఫెసీయులకు 1:1-14.   (ఆ) ప్రత్యక్షత కొరకైన ప్రార్థన ఎఫెసీయులకు 1:15-23;  (ఇ) క్రైస్తవుని స్థితి Eph,1,24-3,13;  (ఈ) స్థిరపరచుటకైన ప్రార్థన ఎఫెసీయులకు 3:14-21.

(2) క్రైస్తవుని అనుచరణ జీవితము అధ్యా.3-6 వరకు (అ) సంమమందు ఐకమత్యము ఎఫెసీయులకు 4:1-16;  (ఆ) జీవితమందు పరిశుద్ధత. Eph,4,17-5,21 ; (ఇ) గృహమందును ఉద్యోగ స్థలమందును గల బాధ్యతలు. Eph,5,22-6,9; (ఈ) యుద్ధమందు స్థిరముగా నిలచియుండుట. ఎఫెసీయులకు 6:10-24.

సమకాలిక చరిత్ర:- ఆసియా మైనరులోనే అందమైనదియు, సమృద్ధికరమైనదియునైన భూభాగమే ఈ ఈయోనియా భాగము మిక్కిలి ప్రఖ్యాతి గాంచిన పట్టణముగా ఎఫెసు పేరు గాంచెను. స్ముర్నకు 40 మైళ్ళు దక్షిణముననున్నదే ఎఫెసు మిక్కిలి సౌఖ్యమైన శీతోష్ణస్థితి గలది. సంగీతము, నాట్యము వంటి వాటిలో ఆపేక్ష గల ప్రజలు, ఐశ్వర్య మనతలు గల ప్రజలును, అలంకరించుకొని బారులు తీరు స్త్రీలును ఎఫెసు యొక్క గర్వమునకు ఉదాహరణగా నుండెను.

     డయానా అను అర్తెమి దేవి యొక్క దేవాలయము ఎఫెసునందుండెను. ప్రాచీన కాల ప్రపంచ ఏడు వింతలలో ఇది ఒకటి. దేవాలయము 425 అడుగుల పొడవును 82 అడుగుల వెడల్పును గలది. దీనికి 60 అడుగుల ఎత్తు గల 120 స్తంభములు ఉండెను. ఒక్కొక్క స్తంభమును ఒక్కొక్క రాజు యొక్క బహుమానమగును. వాటిలో 36 స్తంభములు బంగారపు రేకులచే మూయబడియుండెను. ప్రాచీన కాల దేవాలయములు మధ్య భాగము మాత్రము పైన గుడిసె ఆకారముగను మిగిలిన భాగములు తెరువబడినట్లును వుండును. ఈ దేవాలయపు పైన గల గుడిసె కుప్ర దీవి నుండి తేబడిన మ్రానులచే కట్టబడినది. అర్జెమి యొక్క ఆరాధానను గూర్చి మాత్రము కాదు గాని రోమా రాజుల ఆరాధన కొరకై కట్టబడిన దేవాలయములను గూర్చియు ఎఫెసు ప్రఖ్యాతి గాంచెను. నీరో, క్లవుదియ, జేవియరు మొదలగు రాజుల పేరున పలు దేవాలయములు కనిపించెను. విగ్రహారాధన ఇచ్చట బహు బలముగనుండెను.

     మూఢ నమ్మకములందును ఎఫెసు దుష్కీర్తి పొందెను. రేకులు, తాయతులు అను రీతిలో మంత్రములును, మాయా జాల ప్రార్థనలును గల అర్తెమి దేవి యొక్క పేరుగల “ఎఫెసు అక్షరములు " ప్రఖ్యాతి గాంచినవి. వ్యాధి స్వస్థపడుట, సంతాన భాగ్యము, వృత్తి విజయము వంటి వాటికి శుభములని నమ్మి వాటిని కొనుటకు భూదిగంతముల నుండి ప్రజలు పోగైవచ్చిరి. .

     ఒక రకమైన కలయిక ప్రజలు అచ్చట జీవించిరి. వారిలో ఆరు విధములైన వ్యత్యాస ప్రజల సమూహములు వుండెను. వాటిలో ఒకటి గ్రీకుల రాకడకు ముందు అచ్చట జీవించిన ప్రాచీన ప్రజల వెనుకటి తరమువారు. మరియొక సమూహము ఏథెన్సు నుండి వలస వచ్చిన వారు. మూడవ సమూహము గ్రీకులు. యూదుల నుండి విభజింపబడి వచ్చిన వారు అని అభిప్రాయపడు నాల్గవ ఒక సమూహమును అచ్చట కనిపించెను. అర్తెమి దేవాలయము మతమునకు ప్రఖ్యాతిగాంచినట్లు, నేరక్రియలకును, హీన ప్రవర్తనలకును కేంద్రముగా బయలుపడెను. ఎటువంటి నేరస్థుడును అర్తెమి దేవాలయపు ఎదుటికి చేరగనే తప్పించబడును. అచ్చట నుండి అతనిని నిర్బంధముగ బంధించి తీసికొని వెళ్ళుటగాని, అచ్చట శిక్షించుట కాని కుదరదు. దేవాలయమందు నివశించిన వెయ్యి మంది దేవాలయపు నాట్యకత్తెలు చేయు హీనమైన సేవయే దేవాలయపు పవిత్రతయని వారు స్తుతించునది విచిత్రమైన కార్యముగ నుండెను. కలయిక ప్రజలు, నేరస్థుల ఆశ్రయము, దేవాలయపు దుష్టత్వము మొదలగునవన్నియు ఏకముగ ఎఫెసును చెడిపోయిన ఒక పట్టణముగా మార్చెను.

     అటువంటి ఒక స్థలమందే సువార్త విత్తనము విత్తుటకు మహా గొప్ప విజయమును పొందగలిగిరి. పౌలు ఇతర పట్టణముల యందు వున్న దాని కంటెను అధిక కాలము ఎఫెసు నందుండెను. (అపో. కార్యములు 20:31) ఆ సంఘము యొక్క మొదటి అధ్యక్షుడు తిమోతి అగును. (1 తిమోతికి 1:3) ఆకుల, ప్రిస్కిల్లలు పౌలుతో కూడ యీ పట్టణమునకు వెళ్ళిరి. (అపో. కార్యములు 18:19; అపో. కార్యములు 18:24-26). పౌలు అత్యధికముగా ప్రేమించిన సంఘముగా యిది పేరుగాంచెను. (అపో. కార్యములు 20:17-38) తరువాత యెహోను యిచ్చట మిగుల యిష్టుడుగ బయలుపడెను.

ఎఫెసు నేడు:- ఈ ప్రాచీన పట్టణమున్న స్థలమున నేడు “ఐసాలుక్ " అను పేరుగల ఒక చిన్న పరిశుభ్రత లేని ఒక గ్రామము కనిపించుచున్నది. ప్రాచీన కాల శ్రేష్ఠత యొక్క పాడు పడిన స్మారక చిహ్నములను నేటికిని అచ్చట చూడగలము. వ్యవసాయ వృత్తి చేసి జీవించు అచ్చటి ప్రజలు యిప్పుడు మిగుల క్లిష్ట పరిస్థితిలో జీవించుచున్నారు.

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 49వ పుస్తకము: అధ్యాయములు 6; వచనములు 155; ప్రశ్నలు 1; చారిత్రక వచనములు 146; నెరవేర్చబడిన ప్రవచనములు 1; నెరవేర్చబడని ప్రవచనములు 8.