దేవుని ప్రేమ


  • Author: Sreekanth Kola
  • Category: Articles
  • Reference: Best of Collections

ఒక పట్టణమందు ఒక రాజు ఉండెను. ఆయన దగ్గర ఉన్న మంత్రి యేసుక్రీస్తు ప్రేమను గురించి విని, యేసు ప్రభువును నమ్ముకొని క్రైస్తవుడాయెను. అప్పటినుండి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చెనని అందరికి సాక్ష్యమిచ్చుచుండెను. రాజుగారికి కూడా క్రీస్తు ప్రేమను గూర్చి చెప్పగా రాజు, మంత్రీ ! యేసుప్రభువు అంత గొప్ప దేవుడైతే, ఆయన పాపులను రక్షించాలంటే ఒక్క మాటతో అందరిని రక్షించవచ్చు గదా ..? ఆయనే ఈ లోకమునకు దిగిరావలసిన అవసరం ఏమున్నది ? నేనొక పనివానికి ఆజ్ఞ ఇచ్చినయెడల వెంటనే పని జరుగును. అలాగే దేవుడు చేయొచ్చు గదా.. ! అనెను.

ఎంత చెప్పిననూ గ్రహించుకొనని రాజుకి దేవుని ప్రేమ అర్ధం అయ్యేలా చేయాలని తలంచిన మంత్రి; ఒక నేర్పరియైన వడ్రంగిని పిలిచి ఒక సంవత్సరం ఈడుగల రాజకుమారుని పోలిన ఒక చెక్క బొమ్మను చేయించి, రాజకుమారుని వస్త్రములను, ఆభరణములను తొడిగి అలంకరించెను. మరుసటి దినమున రాజు, ఒక ఏటిలో దోనే ఎక్కి విహారం చేయుటకు వెళ్ళుచుండగా, రాజకుమారుని రూపంలో ఉన్న చెక్క బొమ్మను ఏటి ఒడ్డుకు తెచ్చిన మంత్రి మహారాజా ! అని పిలువగా, ఆ చెక్కబొమ్మ తన కుమారుడనుకొన్న రాజుకి తన బిడ్డను అందించినట్టే అందించి నీటిలో విడిచెను. అది చూసిన రాజు కంగారుగా నీళ్ళలోకి దుమికెను.

ఆ బొమ్మను పట్టుకొని పైకెత్తిన రాజు కోపముతో ఏమిటిది ? అనగా, ధీనతతో మంత్రి ఇట్లనెను.. ఓ రాజా.. ! మీ కుమారుడు నీళ్ళలో పడినప్పటికీ, మీరు నీళ్ళలో దూకవలసిన పని ఏముంది..! ఒక మాట సెలవిస్తే మీ రక్షకభటులు దూకి మీ కుమారుని రక్షించేవారు గదా..! నేనైననూ ఆ పని చేసియుందును గదా..! అని అనగా రాజు, అతడు నా ముద్దుల బిడ్డ గనుక, నా బిడ్డ మీద ఉన్న ప్రేమ నన్ను నీళ్ళలో దుముకునట్లు చేసింది. అని సమాధానం ఇచ్చెను. అందుకు మంత్రి మహారాజా..! ఇప్పుడర్ధమైనదా? సర్వశక్తిగలదేవుడు ఒక్క మాటచేత ఈ ప్రపంచమును రక్షింపక తానే మానవ అవతారం ఎత్తి, ఈ లోకంలోనికి వచ్చి బహుధీనుడుగా పశువులసాలలో జన్మించుటకు కారణం కూడా ప్రేమయే అనెను.