కృతజ్ఞత


  • Author: Sreekanth Kola
  • Category: Articles
  • Reference: Best of Collections

బాబూ ! ప్రార్ధన చేసుకుని, దేవుని స్తుతించి భోజనం చేయి నాయనా !

అని ఎన్నిసార్లు చెప్పిన వినకుండా ఆహారం ముందుకు రాగానే ఆత్రుతగా తినేస్తున్నాడు జానీ.

అమ్మా! ఒక ముద్ద ఉంటే వెయ్యండమ్మ ! అన్న కేక వీధిలో నుండి వినబడింది. భోజనం బల్ల వద్ద నుండి లేచి వెళ్ళిన తల్లి ఆ బిచ్చగాడిని వెంట తీసుకొని వచ్చి, జానీ ప్రక్కన కూర్చుండబెట్టి, అతనికి కూడా భోజనం వడ్డించింది. ఆకలితో ఉన్న ఆ బిచ్చగాడు ఆవురావురుమంటూ తినసాగాడు. ముఖం చిట్లించిన జానీ ఆ బిచ్చగాడి వైపు చూసాడు. మాసిన గడ్డం, చినిగిన బట్టలు, దుమ్ము కొట్టుకొనిన ఒళ్ళు చూస్తుంటే జానీకి చాలా అసహ్యం వేసింది. దానికి తోడు బల్లమీద ఉన్న పదార్ధాలన్నీ గబగబా తిని ఖాళీ చేసిన బిచ్చగాడు చెయ్యి కడుగుకొని మారు మాట్లాడకుండా మూతి తుడుచుకొంటూ వెళ్ళిపోయాడు.

అమ్మా, ఇలాంటి కృతజ్ఞత లేనివాడిని లోపలికి తీసుకొని వచ్చి భోజనం పెట్టావేం ? అన్నాడు జానీ. మరి నువ్వేమి చేస్తున్నావు బాబూ ! ఆహారం లేక అనేకమంది ఆకలితో బాధపడుతున్న ఈ దినములలో కడుపునిండా ఆహరం ఇచ్చిన దేవునికి స్తుతులు చెల్లించి భోజనం చెయ్యమంటుంటే నీవు వినడం లేదు కదా; నీకు పాటం నేర్పించాలని నేనే ఆ బిచ్చగాడితో తిని వందనాలు చెప్పకుండా వెళ్ళిపొమ్మని చెప్పాను అని చెప్పింది ఆ తల్లి. సిగ్గుపడిపోయిన జానీ నాటి నుండి ప్రభువుకు స్తోత్రం చెల్లించకుండా ఏ ఆహారమూ తీసుకొనేవాడు కాదు.

మరి మీరు ప్రభువు ఇచ్చిన దాని కొరకు స్తుతించుచున్నారా ?

లేక దేవునికి ప్రార్ధన చేయక ఆహారం మ్రింగునట్లుగా వున్నారా ? (కీర్తన 53:4)

ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికీ సాధ్యము? (ప్రసంగి 2:25 ) దేవుడు ఒకనికి అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను.(ప్రసంగి 5:19)