దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టం?

  • Author:
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini

దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టం?

ప్రార్థన ఎలా చెయ్యాలి?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కొరకు నేను అనేక నెలలు వెదకినప్పుడు మొట్టమొదట నాకు వచ్చిన సందేహం ఏమంటే,
నా గురించి నేనెందుకు ప్రార్థన చెయ్యాలి? అని. ఈ సందేహం మా తండ్రి గారిని చూసినప్పుడు కలిగింది.

నా చిన్ననాటి నుండి ఏది కొనమని నా తండ్రిని అడగలేదు. నేను లేమి అనేది ఎప్పుడు చూడలేదు, అనుభవించలేదు. నాకు ఏది అవసరమో, ఎలాంటి బట్టలు వేస్తే బాగుంటుందో నన్ను కన్న నా తలిదండ్రులే కొని తెచ్చేవారు. నాకు ఇది లేదు అనే స్థితి రాలేదు. నా తండ్రే కాదు ఏ తండ్రైనా తన పిల్లలు సంతోషముగా ఉండాలనే కోరుకుంటాడు.

ఈ లోకములో నేను కలిగిన తండ్రే ఇలా ఉన్నప్పుడు పరలోకపు తండ్రి ఎలా ఉండాలి? అబద్దమాడనేరని దేవుడు తనను ప్రేమించే ప్రతి ఒక్కరి అవసరములు తీరుస్తాడు.

దేవునికి యదార్ధముగా ప్రార్థించే వారు కావలి, నటించేవారు కాదు.

మత్తయి 6:5 లో...మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని చెప్పబదింది.
వేషధారి అంటె వంచకుడు. మత వంచకుడు. తనకు తెలియకుండ తననే మోసము చేసుకొనేవాడు. తనకు తెలిసి పరిశుద్ధాత్మను మోసము చేసేవాడు. దేవుని మెప్పును కాకుండా ఇహలోక మెప్పును కొరుకొనే వాడే వేషధారి.

మత్తయి 6:2లో వేషధారి మనుష్యుల వలన ఘనత పొందాలని ధర్మం చేస్తాడు.
మత్తయి 6:5లొ వేషధారి మనుషులకు కనబడవలెనని ప్రార్థన చేస్తాడు.

యేసు ప్రభువు వేషధారులవలె ప్రార్థన చేయవద్దు అని చెప్పి మత్తయి 6:9-14 లొ ప్రార్థన ఎలా చేయాలో, దేని గురించి చేయాలో నేర్పిస్తున్నాడు.

కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.

ఈ ఒక్క ప్రార్థననే జీవిత కాలమంతా చేయమని దేవుని ఉద్దేశం కాదు. ఇందులో ప్రార్థించేవారికి కావలసిన లక్షణాలు ఉన్నవని గ్రహించి మనఃపూర్వకముగా ప్రార్ధన చేయాలి.