విజయవంతమైన క్రైస్తవ జీవితం - Victorious Christian Living


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Christian Lifestyle Series
  • Reference: Victorious Christian Living Series in Telugu

Victorious Christian Living - Romans 5:17, Romans 8:37, 1 John 5:4

విజయవంతమైన క్రైస్తవ జీవితం. రోమా 5:17,8:37,1 యోహాను 5:4

"విజయవంతమైన క్రైస్తవ జీవితం" అనే మాట తరచుగా వింటుంటాము కాని మనలో అనేకులకు పూర్తి అవగాహన ఉండక పోవచ్చు. నేటి నుండి ఈ అంశాన్ని గూర్చిన లోతైన సంగతులను నేర్చుకుందాం.

నా అనుభవంలో నేను నేర్చుకున్న క్రైస్తవ విశ్వాసంలో గెలుపు ఓటముల మధ్య జరిగే సంఘర్షణలో ప్రతి క్రైస్తవుడు అనుదినం పోరాడుతూనే ఉంటాడు. గెలుపు కంటే అత్యధికంగా ఓటమి పాలయ్యే సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనం విజయం పొందిన సందర్భాలను పరీక్షించి చూసినప్పుడు వాటి వెనక ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి ... ఈ మాట వాస్తవమే కదా. శ్రమ, కష్టం, ఓర్పు, పట్టుదల ఇవన్నీ లేకుండా విజయం పొందడం అసాధ్యం.

మన జీవితంలో శక్తి మరియు తలాంతులతో పాటు మనకుండే పరిథిలో మనం విజయాలు పొందగలిగితే ఉత్తమమైనది అని నేనంటాను; ఎందుకంటే మన ప్రతి బలం మరియు మనలోని ప్రతి బలహీనత ఆయనకు పూర్తిగా తెలుసు కాబట్టి. యేసు క్రీస్తు కూడా మన నుండి ఆశించేది ఇదే.

మనం పుట్టిన దగరనుండి చివరి శ్వాస వరకు మనలోని సామర్ధ్యాలు మెరుగుపడుతూనే ఉంటాయి. ఈ రోజు నేను పొందిన విజయానుభవం రేపు ఉండకపోవచ్చు కదా. నేడు ఉన్న బాధ రేపు సంతోషంగా మారవచ్చును కదా. అయితే, వీటన్నిటి ద్వారా మనం పొందే అనుభవం మనలోని ఉత్సాహాన్ని కలుగజేయవు గాని; ఒకనాడు నిత్యత్వంలో క్రీస్తుతో నేను ఉంటాను అనే నిరీక్షణే మనలను ముందుకు నడిపిస్తుంది.

ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న అడిగాడు "దేవుడు ఎందుకు ఈ లోకంలో మనలను సృష్టించి అనేక శ్రమలగుండా నడిపించి చివరకు పరలోకానికి నడిపిస్తున్నాడు? పరలోకములోనే మనలను పుట్టించియుండవచ్చును కదా?"

శారీరికంగా మనం భూలోకంలో జీవిస్తున్నప్పుడు పరలోక శక్తి సామర్ధ్యాలను అనుభవిస్తూ లోక సంబంధమైన వాటిపై విజయాన్ని పొంది, తన వద్దకు చేరాలనేదే దేవుని చిత్తమై యున్నది. దేవుడు మానవుని తన రూపంలో సృష్టించి, సర్వ సృష్టిపై అధికారమిచ్చి, ఫలించి అభివృద్ధి పొందమనే స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మంచైనా చెడైనా దేవుని కంటే ఎక్కువ కాదని గ్రహించి, సంతోషకరమైన జీవితం కలిగియున్నందుకు ప్రభువును స్తుతించే వారంగా ఉండాలనేదే ఆయన ఉద్దేశం. ఈ అనుభవంలో మనలోని ఆత్మ బలపరచపడి; ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని ఆత్మకు మన అంతరాత్మను అనుసంధానం చేసుకోగలిగే శక్తివంతమైన సామర్ధ్యాన్ని పొంది...మహిమలో ఆయనను చేరుకున్నప్పుడు పరిశుద్ధమైనదిగా నిత్యత్వంలోనికి చేర్చబడుతుంది. ఇది దేవుడు మనకు నిర్ణయించిన ప్రక్రియ.

మానవుడు ఏ విధంగా ఈ ప్రక్రియలో పాలిభాగస్తుడు కావలయునో అట్టి సాదృశ్యాన్ని తన్ను తాను జగత్తు పునాది వేయబడకమునుపే సంకల్పించిన ప్రణాళికలో మనలను సృష్టించి, మన జీవన విధానాలను ధర్మశాస్త్రం ద్వారా బోధించాడు. అంతేకాకుండా, మనం అనుసరించవలసిన ప్రతి విధానాన్ని తన కుమారుడైన యేసు క్రీస్తులో మనకు సాదృశ్యంగా బయలుపరచి దృష్టాంతాలుగా ఋజువుచేసాడు. భూలోకంలో పరలోకాన్ని ఆనుభవించగలిగే మన జీవితాలు జయశీలుడైన క్రీస్తు ద్వారా సంపూర్ణమై, పరిశుద్ధాత్మ ద్వారా విజయవంతులను చేస్తుంది. నిత్యత్వంలో క్రీస్తును ఎదుర్కొన్నప్పుడు దేవుని చిత్తప్రకారమైన మన జీవితాలు పరిపూర్ణతను ధరించగలుగుతుంది.

1. ప్రభువులో బలమైన జీవితమే - విజయవంతమైన జీవితం

ఇశ్రాయేలీయుల వాగ్ధాన దేశ ప్రయాణంలో; మోషే తరువాత యెహోషువ నాయకత్వం వహించాడు. నాయకత్వ అనుభవం లేకపోయినప్పటికీ (యెహో 1:6,7) దేవుడు తన చిత్తాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ నిబ్బరముకలిగి ధైర్యముగా ఉండుము, నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగా ఉండుమని హెచ్చరిస్తూ, ఏ వాగ్ధాన ఉద్దేశాలను చేయ నిశ్చయించాడో వివరించాడు. అయితే, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదనే నియమాన్ని జతచేశాడు.

దావీదు తన కుమారుడైన సొలొమోనుతో "నీవు బలముపొంది ధైర్యము తెచ్చుకొని యీ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడ నుండును; యెహోవా మందిరపు సేవను గూర్చిన పనియంతయు నీవు ముగించువరకు ఆయన నిన్ను ఎంతమాత్రమును విడువక యుండును" (1 దిన 28:20) అనే నేర్పించాడు.

దేవుని చిత్తప్రకారమైన సంకల్పం మన జీవితాల్లో జరుగుతుందనే విశ్వాసమే విజయానికి రహస్యం. అయితే, దేవుని ఆజ్ఞలకు లోబడే నడవడి కలిగిన మన జీవితాలు భయపడక ధైర్యముగా ఉండాలనే ప్రభువు కోరుతున్నాడు. ప్రభువు యొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులమై జీవించాలి (ఎఫేసీ 6:10).

విజయం పొందగలము అనే విశ్వాసంలో సందేహాలు ఎందుకు? (2 కొరింథీ 12:10) నన్ను బలపరచే క్రీస్తుతో నేను ఏదైనా చేయగలననే ఖచ్చితమైన విశ్వాసమే నేను చేయగలనోలేదో అని కాకుండా, నేను చేయగలననే నమ్మకాన్ని కలుగజేస్తుంది. అది నాయకత్వమైన, పరిచర్యయైనా చివరికి మన దైనందిన జీవితమైన!. ఎప్పుడు మనం బలహీనులమో అప్పుడే బలవంతులం కదా!

నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలనననే (ఫిలిప్పీ 4:13) విశ్వాసం, ఎటువంటి శ్రమనైనా నేను ఎదుర్కోగలననే రెట్టింపు ధైర్యాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉంటాడో, బలమైన స్థానంలో మనం ఉండగలము, బలహీనతకు అసలు చోటే ఉండదు. యేసు క్రీస్తు ప్రభువులో ఇటువంటి బలమైన జీవితమే - విజయవంతమైన జీవితం.

2. క్రీస్తులో విజయోత్సవము - విజయవంతమైన జీవితం. 2 కొరింథీ 2:14-16

నిర్దోషమైనదానిని యాజకుడు బలిపీఠంపై అర్పించినప్పుడు, అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దహనబలి సువాసనను దేవుడు ఆఘ్రాణించి మనయెడల తన కనికరాన్నిచూపుతూ మనలను క్షమిస్తూఉన్నాడు. అదేరీతిగా, విరిగి నలిగిన మన హృదయాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు; మన జీవితాలు ఇంపైన సువాసనను కలుగజేసి దేవునిని సంతోషపెట్టేవిగా ఉంటాయని గ్రహించాలి. ఈ అనుభవం సజీవయాగంగా మనలను మనం సమర్పించుకున్నప్పుడే సాధ్యమవుతుంది.

క్రైస్తవులమైన మనం దేవుని కొరకు మరియు మన చుట్టూ ఉండే వారికొరకు ప్రత్యేకమైన సువాసన కలిగియున్నాము. ఎట్లనగా క్రీస్తును గూర్చిన అనుభవాలను నేర్చుకొన్న మన జీవితాలు మన ద్వారా అనేకులను క్రీస్తువైపు నడిపించే సామర్ధ్యాన్ని తన పరలోక జ్ఞానంతో నింపి - మనకు తన ఆత్మతో భోధిస్తున్నాడు. దేవాది దేవుడైయుండి - నిత్యత్వంలో ఆయన ఉన్నప్పటికీ - దేవుడు మనలను ఏర్పరచుకొని, ఎన్నుకొని మన ద్వారా ఆ పరలోక రాజ్య సువార్తను ప్రకటించాలని కోరుతున్నాడు.

మనం నేర్చుకున్న సంగతులనే కాకుండా, పరలోక సంబంధమైన మర్మాలను దేవుడు మనకు బయలుపరచి రక్షించబడిన వారికొరకును, నశించిపోయే ఆత్మలకొరకును మన జీవితాలు క్రీస్తు సువాసనయై... జీవార్థమైన జీవపు వాసనగా ఉండగలమని గ్రహించాలి. సువాసనలు వెదజల్లే దేవుని జ్ఞానము పొందిన మన అనుభవం విజయోత్సవముతో మన జీవితాలను విజయవంతులనుచేస్తుంది.

దేవుడు ఎల్లప్పుడూ క్రీస్తులో మనం విజయం పొందాలనే ఆశిస్తున్నాడు. నేనంటాను, ఇంత గొప్ప పరిచర్యను గూర్చిన సామర్ధ్యం మనలో లేకపోయినప్పటికీ, మనం సమర్థులమని తాను నియమించి, మనలోని తలాంతుల ద్వారా పరలోరాజ్య సరిహద్దులను విశాలపరచే పనిముట్టుగా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయ!

క్రీస్తు జ్ఞానము యొక్క సువాసన వెదజల్లే మన జీవితమే... జీవన పరిమళం. ఇదే విజయవంతమైన క్రైస్తవ జీవితం.

3. క్రీస్తు ప్రేమయందు అత్యధిక విజయము - విజయవంతమైన జీవితం

అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమా 8:37

క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపునవి ఏవైనా ఉన్నాయా అని ఆలోచన చేసినప్పుడు; దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయగల శక్తి లేనే లేదు. దేవుడు తన ప్రేమను మన యెడల బయలు పరచడానికి తన అపారమైన ప్రేమను అనుదినం చూపిస్తూనే ఉన్నాడు. తండ్రితో మనకొరకు విజ్ఞాపన చేస్తూ మనలను సజీవులనుగా జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఈ మాటలో ఎట్టి సందేహమే లేదు. అయితే, రోజువారి జీవితంలో అనేక సందర్భాల్లో మనం విఫలం అయ్యే పరిస్థితులు ఎదురైనప్పుడు..అవి తాత్కాలిక బలహీనతలు మాత్రమే అని గ్రహించాలి. మన అవిధేయతలు మరియు మనలోని బలహీనతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా క్రీస్తు మన యెడల తన అపారమైన కనికర ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు.

దేవుడు మన పట్ల చూపించే ప్రేమ, మన ఆలోచనలు, తలంపులను, మన జీవన శైలి వల్లనైన ఆచరణలను బట్టి ఆధారపడక. ఎన్నడూ మారని మార్పుచెందని ఆ ప్రేమ... షరతులు లేనిదిగా, ఎల్లప్పుడూ నిలకడగా ఉండేదిగా ఉంటుంది. అనాదిలో మన యెడల ఎటువంటి సంకల్పం కలిగిఉన్నాడో దానిని బట్టే మనలను అనుదినం ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ ప్రేమ తన సొంత కుమారుని మనకొరకు అర్పించుటకు వెనకాడనిక, క్రీస్తుతో పాటు సమస్తమును సమకూర్చిన దేవుడు, వీటన్నిటిని మనకు దయజేయగల సమర్ధుడు అని గ్రహించాలి.

నేను క్రీస్తులో అత్యధికమైన విజయం పొందగలను అనే ఆలోచన కలిగిన జీవితాల్లో ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని బాధలు కలిగినా, అది నష్టమైనా, కష్టమైనా, రోగమైనా, కరువైనా క్రీస్తునుండి మనలను వేరు చేయలేదు అనే మన ధృఢ విశ్వాసమే మనలను విజయవంతులను చేస్తుంది. నా చేయి పట్టుకొని నన్ను నడిపించే దేవుడు నా జీవితంలో ఈ లోక సంబంధమైన ఒడిదుడుకులను సరాళము చేసి విజయపథం వైపు నడిపించగల సమర్ధుడు.. ఆయనకే మహిమ కలుగును గాక. పరలోకంలో ఆయనను ఎదుర్కొన్నప్పుడు మహిమా కిరీటమును తప్పక పొందగలం. ఇదే విజయవంతమైన జయజీవితం.

4. లోకమును జయించిన విజయము - విజయవంతమైన జీవితం

1 యోహాను 5:4-5
దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?

తిరిగి జన్మించిన క్రైస్తవ విశ్వాస జీవితాలు జీవించే మనము దేవుని మూలంగా పుట్టిన వారమని గ్రహించాలి. దేవుని మూలముగా పుట్టిన మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయనను ప్రేమించే వారముగా జీవిస్తూ, ఈ లోకములో ఎదురయ్యే ప్రతి ఒడుదుడుకులను ఎదుర్కొని, శోధనలకు లొంగిపోకుండా ముందుకు సాగాలి. ఒకనాడు ఆయనతో కూడా లేపబడి మధ్యాకాశంలో క్రీస్తును ఎదుర్కొనినప్పుడు పొందుకునే మహిమా కిరీట అనుభవమే విజయవంతమైన జీవితం.

దేవుని విశ్వసించిన జీవితాలు ఈ లోకంలో శ్రమను ఎదుర్కోవడం తప్పనిసరి అని యేసుక్రీస్తు వివరిస్తూ, శ్రమ కలిగినప్పటికీ ధైర్యము కలిగినవారమై , క్రీస్తు ఏవిధంగా సిలువ మరణమును జయించాడో అట్టి విజయమును మనము కూడా పొందగలం అని చెబుతున్నాడు.
అపొ.పౌలు కూడా తన జయజీవిత సాక్ష్య అనుభవాన్ని వివరిస్తూ : "లోకమునకు నేనును, నాకు లోకమును సిలువవేయబడితిమని" అంటున్నాడు.

దేవుడు పరిశుద్ధులకు అనుగ్రహించిన ఇట్టి గొప్ప శక్తిసాధనాలను పరిపూర్ణమైన క్రైస్తవ జీవితంలో ప్రార్ధన ద్వారానే పొందగలము. కలిగియున్న ఈ విజయానుభవంలో... దేవుని ద్వారానే పొందుతున్నామనే భావన కలిగిన వారమై ప్రభువును మహిమ పరచ బద్ధులమై ఉన్నాము.

అపొ.పౌలు కూఅనుదినం ప్రార్ధనలో మెలుకువ కలిగి జీవిస్తూ, అనుదినం పరిక్షించబడే విశ్వాసంలో నిలకడ కలిగినవారమై, ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని జయము వెంబడి జయమును పొందుచూ, పౌరుషముగల క్రైస్తవ వీరులమై, దిన దినమూ ప్రభువుకు దగ్గరవుతూ దేవుని చిత్తాన్ని ప్రణాళికలను నెరవేర్చే బలమైనవారంగా ఉండాలనేదే దేవుని ఉద్దేశ్యమై ఉంది. 

5. పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చుండే జీవితమే - విజయవంతమైన జీవితం
ఎఫెసీ 2:5-6, రోమా 5:17, 6:4

అపో పౌలు విశ్వాసికి క్రీస్తుకు గల ఐక్యత గూర్చి తెలియజేస్తూ...విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితానికి మరియయేసు క్రీస్తు పునరుత్థానంలో గల సంబంధం క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమని వివరించారు.

పాపము వలన వచ్చు జీవితం మరణం కాబట్టి, క్రీస్తు మన పాప భారాన్ని కలువరి సిలువలో మోసి తన మరణం ద్వారా మన జీవితాలకు విడుదల కలుగజేసాడు. అదే విధంగా రక్షించబడిన మన జీవితాలు నీటి బాప్తిస్మము ద్వారా క్రీస్తుతో మరణ భూస్థాపన అనుభవాన్ని పొంది, పరిశుద్ధాత్మ బాప్తీస్మము ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే క్రీస్తులో చేర్చబడ్డాము. విశ్వాసము ద్వారానే క్రీస్తులో ఐక్యత పొందగలమని గ్రహించాలి.

ఆదాము ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. అయితే, ఆదాము యోక్క పాపము వలన మరణం ఏ విధంగా విస్తరించబడినదో అదే విధంగా యేసు క్రీస్తు ద్వారా కృప కూడా విస్తరించబడి మనలను రక్షించి మనలను నీతిమంతులుగా తీర్చుటకు కారణమైనది.

యేసు క్రీస్తు ద్వారా కృపాబాహుళ్యమును నీతి దానమును పొందిన మన జీవితాలు పాపమునుండి విడుదల చేయబడి, మరణము నుండి జీవములోనికి దాటింపజేశాయి. ఇది కేవలం యేసు క్రీస్తుని ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము లో జయ జీవితమును పొందియున్నాము. ఈ లోకములో మనం మరణించినా ఒకనాడు క్రీస్తుతో కూడా లేపబడి, ఆయన ద్వారా పొందిన పునరుత్థాన విజయం పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండే అధికారాన్ని పొందగలం. ఇదే విజయవంతమైన జీవితం.

విజయవంతమైన జీవితం పొందియున్నామనే నిర్ధారణ ఎలా?

క్రీస్తుతో ఐక్యత కలిగిన జీవితాలు పొందే విజయాలు...
1. మన పాపములు క్షమించబడ్డాయనే విశ్వాసం ఆ పాపంపై విజయం క్రీస్తు సిలువ ద్వారా పొందగలం.
2. భయం, ఆందోళన మరియు అసమాధాన సందర్భాల్లో మన హృదయాల్లో కలిగే ప్రతి గాయాన్ని "యెహోవా నిస్సీ" మనతో ఉన్నాడంటూ విజయం పొందగలం.
3. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు" అంటూ ఆ ప్రరిస్థితులపై విజయం పొందగలం.
4. కష్టతరమైన వ్యక్తులపై విజయం అంతే కాదు మన జీవితంలో ఎదురయ్యే ఎటువంటి సమస్యపైన "యుద్ధం యెహోవాదే" అంటూ విజయం పొందగలం.

విజయవంతమైన జీవితం జీవించగలమనే విశ్వాసం మనకుంటే..!

దేవునికి అసాధ్యమైనది యేదైనా ఉన్నదా? మనలను విజయవంతులను చేయాలనే ఎల్లప్పుడూ ఆశపడుతూ ఉంటాడు. ఏ సమయంలో మనకు సహాయం కావాలో ఆయనకు బాగా తెలుసు. ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తి దయజేసేది దేవుడే ఆ శక్తిని అధికమించే ఆలోచనలను కూడా దయజేసేది ఆయనే. ఇక విశ్వాసంలో సందేహమెందుకు?

కాలంతో సంబంధం లేదు వయసుతో సంబంధం అసలే లేదు. దేవుడు తన ప్రణాళికలో మనలను నడిపిస్తాడనే ధైర్యం పట్టుదల విశ్వాసం మనకుంటే సమయమందైనా అసమయమందైనా క్రీస్తులో ఇప్పుడూ ఎల్లప్పుడూ విజయం సాధించగలం. ఇదే విజయవంతమైన క్రైస్తవ జీవితం కలిగియుండడం. హల్లెలూయా!

మనలోని సొంత ఆలోచలనతో శక్తితో తలంపులతో ఆధారపడక, విజయాన్ని దయజేసే ప్రభువులో మన జీవితాలు పూర్తిగా అప్పగించుకొని, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని గడుపుదాం. అట్టి కృప ప్రభువు మనందరికీ దయజేయును గాక.

 

Available on Youtube:  

https://www.youtube.com/playlist?list=PLeddg8-6BBJPdf8uqM1jaI9WPc6YXWPDh

Episode 1 :  https://youtu.be/ySg4U4VSAe0

Episode 2: https://youtu.be/V2tqrfv2SvA

Episode 3: https://youtu.be/H8qYMShWxWc

Episode 4: https://youtu.be/H8qYMShWxWc

Episode 5: https://youtu.be/H8qYMShWxWc

Episode 6: https://youtu.be/H8qYMShWxWc