అనుభవ గీతాలు


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini Daily Devotions Telugu

అనుభవ గీతాలు

ఒక రోజు సాయంత్రం మేము మరియు మా సంఘంలోని మరి కొన్ని కుటుంబాలతో కలిసి చర్చించుకోవడం మొదలుపెట్టాము. చెన్నై పట్టణంలో నివసించే మాకు, ఎవరైనా తెలుగు వారు పరిచయం అయ్యారంటే ఆ ఆనందమే వేరు. మన వాళ్ళు కలిసారంటే ఎక్కడలేని తెలుగు వంటలు, ఆంధ్రా రాజకీయాల చర్చలు జరుగుతూనే ఉంటాయి కదా. అయితే ప్రత్యేకంగా ఆ రోజు సాయంత్రం వారి వారి అనుభవాలను వ్యక్తపరచుకుంటూ తెలుగు సంఘాలకు స్థంభంలా నిలబడి, పరిచర్యలో, విశ్వాసంలో, సంఘ క్రమంలో మాదిరి కరమైన క్రైస్తవ విశ్వాస వీరులను గూర్చి చర్చించడం మొదలు పెట్టాం. ఓక సహోదరుడు ఇలా అన్నాడు... ఈ రోజు మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఉజ్జీవ కీర్తనలు పాడుకుంటున్నాం అంటే ఆ పాటల రచయితల అనుభవం ఆ దినాల్లో ఎంత అద్భుతంగా ఉంది కదా! అవి వారి అనుభవ గీతాలు అన్నాడు.

ఎన్నో అనుభవాలను అందరు పంచుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన సంగతిని గ్రహించాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు అనేక విధములైన తెగుళ్ల నుండి వారిని విడిపించి, బానిసత్వం నుండి విడుదలజేసినప్పుడు విజయ సంతోషంలో పాటలు పాడి దేవుని కీర్తించడం మొదలుపెట్టారు. నిర్గమకాండము 15వ అధ్యాయంలో మోషే చేత రచించ బడిన బైబిల్ లోని మొదటి పాట గుర్తొచ్చింది. మోషే, దావీదు వంటి వారెందరో ఆనాటి దినాల్లో దేవుని కృపను కనికరాన్ని పాటలతో వివరించారు. నేటి దినాల్లో కూడా ఎన్నో అద్భుతమైన రచనా-గాన సామర్ధ్యాలతో దేవుని స్తుతించడం మనకెంతో ఆశీర్వాదకరం.

క్లుప్తంగా చెప్పాలంటే, నాడు-నేడు మార్పు చెందనిది ఒక్కటే “దేవుని కృప!”. మన ముందు తరంవారు చేసిన సేవా-పరిచర్య ఈ రోజుల్లో కుడా ప్రభావితం చేస్తుంది కదా!. వారు రచించిన పాటలను మనము ఇప్పటికి కుడా పాడుకుంటున్నాం అంటే దేవుని కొరకై వారు పడిన శ్రమ, వారి జీవితాల ఛాయలు మన జీవిన విధానాల్లో నీడలుగా ఉన్నాయని గ్రహించాలి. ఇప్పుడు మనం జీవించే విధానాలు లేదా తీరు మన తోటి వారికి... స్నేహితుడిగానో, ఉపాధ్యాయుడిగానో, తోటి సహపనివాడుగానో, తల్లిగానో, తండ్రిగానో రాబోయే తరానికి మేలుకరంగా జీవించ గలిగితే ఏంతో ఆశీర్వాదం. కీర్తన 100:5 “యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును” అను వాగ్దానం మన పూర్వీకుల తరంలో నెరవేరింది, నేడు మన జీవితంలో కుడా నెరవేరుతుంది. ఆమెన్.

Audio: https://youtu.be/Tsr0uBgWHYo