తిరిగి నిర్మించుకుందాం


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini Daily Devotions Telugu

తిరిగి నిర్మించుకుందాం

నేను 10వ తగతి చదువుకునే రోజుల్లో ఒక టౌన్ లో ఉండేవాళ్ళం. నాన్నగారికి బదిలీ అవ్వడం మా పైచదువులకోసం హైదరాబాదు చేరుకున్నాం. దాదాపు 20సంవత్సరాలు ఆ టౌన్ లో గడిపిన నాకు ఎన్నో జ్ఞాపకాలు ఆ ప్రదేశంలో ఉండేవి. అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి. తిరిగి మరలా ఆ టౌన్ ఎలా ఉందొ చూద్దాం అని వెళ్లినప్పుడు గత పదేళ్ళ కాలంలో ఎన్నో మార్పలను గమనించాను. నేను గడిపిన ప్రదేశాలు పూర్తిగా మారిపోయాయి . ఇటువంటి అనుభవం మనలో అనేక మంది ఎదుర్కొనే ఉండవచ్చు కదా.

మనం ఒకప్పుడు ప్రేమించిన ప్రదేశానికి తిరిగి రావడమనే ప్రతిపాదన కావచ్చు...కాకపోవచ్చు. ఆ ప్రదేశాల మార్పులను చూసి భంగపడిపోవచ్చు. గతంలో ఆ ప్రదేశాల్లో మనం గడిపిన సమయం ప్రస్తుత పరిస్తితుల్లో జరిగిన మార్పులు మనలోని భావాలను ఆశ్చర్యమో, దుఃఖమో లేదా నష్టంతో కూడిన భావాలను కలిగించవచ్చు. మనం అప్పుడున్నట్టుగా ఉండము, ఇప్పుడున్న పరిస్తితుల్లో మన జీవితాల్లో అంత ప్రాముఖ్యమైన స్థలం కూడా అప్పుడున్నట్టుగా ఉండదు.

నెహెమ్యా ఇశ్రాయేలు దేశం నుండి అనేక సంవత్సరాలు చేరగొనబడి, అనేక సంవత్సరాలు గడిపిన తరువాత తన జనులు దయనీయమైన స్థితిలో, యెరూషలేము నగరం నాశనమై పోవడం గురించి తెలుసుకున్నాడు. తన దేశానికి తిరిగి వెళ్లి పడిపోయిన గోడలను తిరిగి నిర్మించడానికి అతనికి పెర్షియా రాజైన అర్తహషస్తూ నుండి అనుమతి దొరికింది. పరిస్థితిని పరిశీలించడానికి ఒక రాత్రి పోయి నేల స్వభావమును పరిశీలించి ఆ నగర వాసులతో ఇలా అన్నాడు “యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేముయొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి” ( నెహెమ్యా 2:17)

నెహెమ్యా గతం గురించి ఆలోచించడానికి యెరూషలేము వెళ్ళలేదు కాని, తిరిగి నిర్మించడానికి వెళ్ళాడు. మన జీవితంలో పాడైపోయినవాటన్నిటిని బాగుచేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ సంగతులు మనకొక పాఠాన్ని నేర్పిస్తాయి. క్రీస్తులో మనకున్న పరిపూర్ణ విశ్వాసం, ఆయన శక్తిని మనం గ్రహించడానికి, మన జీవితాన్ని తిరిగి నిర్మించుకోడానికి సహాయపడుతుందని గమనించాలి.

Audio: https://youtu.be/6l19IDn2rbc