విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత - క్రీస్తు మన ప్రధాన యాజకుడు

  • Author: Rev Anil Andrewz
  • Category: Devotions
  • Reference: విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత - Sajeeva Vahini - Faith Sermon Series

Episode 2: విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత - క్రీస్తు మన ప్రధాన యాజకుడు
Audio: https://youtu.be/g_DiFxiU7lI

Episode 1: Link Here 

విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.(హెబ్రీ 10:19-23). విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి జీవించాలంటే క్రీస్తు మన ప్రధాన యాజకుడని తెలుసుకోవాలి. మనం ఈ లోకం నుండి, పాపపు బానిసత్వము నుండి విడుదల పొంది నూతనమైన, జీవముగల మార్గము అదే రక్షణ మార్గంలోనికి వచ్చాము. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత లేకుండ యధార్ధముగా దేవుని దగ్గరకు రాలేము.

ఈ రోజులలో ఉన్న పెద్ద సమస్య ఒంటరితనం. అందరు ఉన్నా సమస్యలు ఎదురైనప్పుడు సమస్యలో ఉన్నప్పుడు ఒంటరితనం అనుభవిస్తువుంటారు. ఇదే విధముగా దేవుడు కూడా మనకు సహాయము చేయలేడని భావిస్తుంటారు. దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడని మర్చిపోవద్దు.

పాత నిబంధన కాలములో యాజకులు ప్రజల మధ్యలో ఉండేవారు. యాజకులు దేవునికి ప్రజలకు మధ్యలో ఉండి ప్రజలను బలపరుస్తూ, ప్రజల కొరకు సేవ చేస్తూ ఉండేవారు. ఈ యాజకులు ధనాశ, శరీరాశలకు బానిసలై ప్రజలను బాధించుటవలన క్రీస్తు తానే ప్రధాన యాజకునిగా వచ్చి ఈ లోకపు యాజకత్వాన్ని కొట్టివేసి, మన కొరకు నిరంతర యాజకత్వం చేస్తున్నాడు.

పరిశుద్ధ గ్రంథములో యాజకుని పని ఎమిచేయాలో చూద్దాము:

1. బోధించువాడు: (లేవి. 10:8-11) ...ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడ. దేవుని యింటిపైన ఉన్న మన గొప్ప యాజకుడు మన బోధకుడు
2. దీవించువాడు: సంఖ్యా 6:22-24 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము. మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవుని యింటిపైన ఉన్న మన గొప్ప యాజకుడైన క్రీస్తు మనకు ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
3. ప్రాయశ్చిత్తము చేయువాడు : (లేవి 16:17) పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవు నప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు. దేవుని యింటిపైన ఉన్న మన గొప్ప యాజకుడైన క్రీస్తు మన కొరకు తననే ప్రాయశ్చిత్తార్థబలిగా చేసుకొని మనకు సంపూర్ణ రక్షణ అనుగ్రహించాడు.
4. మధ్యవర్తి: పాత నిబంధన కాలంలో మనుష్యులు ఏ బలి అర్పించాలన్నా, ఏ సమస్య వచ్చినా యాజకుడు మనుష్యులకు దేవునికి మధ్యవర్తిగా ఉండి సేవ జరిగించేవారు.

కాని క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువే మధ్యవర్తి.
(1 తిమోతి 2:5) దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఇంత గొప్ప యాజకుడు మన కొరకు ఉండగా మన సమస్యలలో, శ్రమలలో, ఇబ్బందులలో ఎలా ఒంటరివారమైతాము. (హెబ్రీ 7:25) ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. నీవు విశ్వాసములో ఒకవేళ బలహీనముగా ఉంటే మన కొరకు ప్రాణం పెట్టి నేడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ దేవుని యింటిపైన ఉన్న మన గొప్ప యాజకుడుని జ్ఞాపకము చేసుకొని విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.