సమూయేలు రెండవ గ్రంథము


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

 సౌలుకు భయపడి మొదట యూదాలో, తరువాత ఫిలిప్తీయుల దేశములో దాగుకొని జీవించిన దావీదు, సౌలు మరణము తరువాత దేవుని ఆలోచన చొప్పున యూదాకు, తదుపరి ఇశ్రాయేలు దేశమంతటికి రాజై పరిపాలన చేసిన చరిత్రే సమూయేలు రెండవ పుస్తకము. దావీదు జీవిత చరిత్ర 1 రాజుల గ్రంథము మొదటి రెండు అధ్యాయముల వరకు కనబడినప్పటికీ, దావీదు యొక్క పరిపాలన గురించి ఎక్కువగా చెప్పిన గ్రంథము రెండవ సమూయేలు. దావీదు సింహాసనమును ఎక్కుట, చుట్టువున్న శత్రువుల మీద జయము పొందుట, చెదరిపోయే స్థితి నుండి ఇశ్రాయేలును స్థిరమైన దేశముగా రూపించుటకు ఆయన నాయకత్వము వహించుట మొదలగువాటిని గురించి ఈ గ్రంథము చెప్పుచున్నది. దావీదు యొక్క విజయాలను తెలుపుటతో పాటు, దిగజారిన స్థితిని కూడా నిజాయితీగా చిత్రించుటలో ఈ పుస్తకము ప్రత్యేకతను సంతరించుకొనినది. ఆయన జీవితమును పుట్టుకురుపు బాధించిన వ్యభిచారము, నరహత్య మొదలగు వాటి భయంకరమైన ప్రతిఫలములు ఆయన కుటుంబమును, దేశమును ఏలాగు కలవరపరచినవో ఈ గ్రంథములో చూడవచ్చును. గ్రంథము యొక్క పేరు, దానికి సంబంధించిన సమాచారము గురించి 1 సమూయేలు పరిచయములో చూడగలము. ఆ పుస్తకములో వ్రాయబడిన రాజ్య చరిత్ర కొనసాగింపే ఈ రెండవ పుస్తకములో చూచుచున్నాము.

ఉద్దేశము : 1. దావీదు పరిపాలనా కాలచరిత్రను చెప్పుటకు. 2. దేవుని పరిపాలన క్రింద ఎంత ఉన్నతముగా పాలన జరిగినదో చూపించుటకు. 3. ఒక వ్యక్తి ద్వారా మార్పులను తీసుకురాగలము అని చూపించుటకు. 4. దేవుని సంతోషపరచుటకు అవసరమైన గుణశీలములు ఏమిటి అని చూపించుటకు. 5. ఎన్నో కొరతలు ఉన్నా ఒక దేశములో మహా గొప్ప రాజుగా దావీదును చిత్రించి క్రొత్తది మరియు సంపూర్ణమైన ఒక దేశము

యొక్క మాదిరి గల నాయకుని రాబోయే క్రీస్తుని దావీదు మూలంగా ప్రతిబింబింపచేయుట (అధ్యాయము 7).

గ్రంథకర్త : యూదా పారంపర్యమునుబట్టి సమూయేలు, కానీ 1 దినవృత్తాంతములు 29:29 ప్రకారము నాతాను, గాదు అని కొందరు భావించుచున్నారు.

నేపథ్యము : దావీదు పరిపాలన క్రింద ఉన్న ఇశ్రాయేలు రాజ్యము.

ముఖ్యవచనములు : 2 సమూయేలు 5:12

గ్రంథ విశిష్టత : దావీదును అభిషేకించి దేవుని కొరకు జీవించ సలహానిచ్చిన సమూయేలు ప్రవక్త పేరు, ఈ పుస్తకమునకు ఇవ్వడినది.

సౌలు - దావీదు : సాధారణ గొర్రెలకాపరి స్థితి నుండి ఇశ్రాయేలీయుల శ్రేష్ఠుడైన రాజపదవికి దేవుడు తనను హెచ్చించెను అనునది దావీదు ఎప్పుడూ మరువలేదు. సౌలుకు, దావీదుకు మధ్య పోల్చి చూచి పరిశోధన జరిపితే ముఖ్యమైన వ్యత్యాసము బహిరంగపరచబడుట చూడగలము. ఇశ్రాయేలీయుల అతిచిన్న గోత్రము యొక్క సాధారణ కుటుంబములో నుండి దేవుడు తనను ఎన్నుకొన్నాడు అనే గహింపు ప్రారంభములో

సౌలుకు ఉండినది. కానీ కాలము గడిచే కొలది తన పూర్వస్థితిని సౌలు మరచిపోయెను. దేవుని ఆజ్ఞలను విడచి అవిధేయత అనే పాపంలో దావీదు, సౌలు దాదాపుగా ఒకే విధముగా పడిపోయినప్పటికీ వారిద్దరూ తప్పు ఒప్పుకొనే స్థితిలో చాలా గొప్ప వ్యత్యాసమున్నది. సౌలు పాపములను ఒప్పుకొన్నప్పటికి ఒక నిజమైన పశ్చాత్తాపము ఆయనలో ఎన్నడూ ఏర్పడలేదు. దావీదైతే విరిగిన హృదయముతో దేవునికి మొఱ్ఱ పెట్టి, నిజమైన హృదయ మార్పుకు తనను తాను అప్పగించుకొనెను. అందువలన దావీదు దేవుని కృపను సంపాదించుకొనెను. వృద్ధాప్యంలో ఘనత, ఐశ్వరము కలిగి దావీదు మరణించగా, (1 దినవృత్తాంతములు 29:28) సౌలు సొంత ఖడ్గము మీదపడి భయంకరమైన మరణమును ఎదుర్కొనెను. (1 సమూయేలు 31:4)

గ్రంథ విభజన : ఈ గ్రంథమును మూడు పెద్ద భాగములుగా విభజింపవచ్చును. I. దావీదు పొందిన జయములు (1 - 10 అధ్యాయములు). 2. దావీదు యొక్క పాపం (11 అధ్యాయము). 3. పాప ఫలితము వలన దావీదు అనుభవించవలసిన శ్రమలు (12 - 24 అధ్యాయములు)

కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములోని 10వ పుస్తకము : అధ్యాయములు 24; వచనములు 695; ప్రశ్నలు 125; చరిత్రకు సంబంధించిన వచనములు 679; నెరవేరిన ప్రవచనము 9; నెరవేరనివి 7; దేవుని సందేశములు 11; ఆజ్ఞలు 70; వాగ్దానములు 13; హెచ్చరికలు 25.