థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రిక


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

పౌలు యొక్క మొదటి పత్రికకు తరువాత థెస్సలొనీకయుల మధ్య తప్పుడు బోధనల యొక్క గురుగులు అభివృద్ధి చెందుటకు ప్రారంభించి వారు విశ్వాసమందు ఊగిసలాడుటలు ఏర్పడుటకు అది కారణమాయెను. ఈ నాశనపు గురుగులను తీసివేసిన తరువాత పౌలు మరలా ఈ పత్రిక ద్వారా మంచి విత్తనములు విత్తెను. అచ్చట గల విశ్వాసుల శ్రమల మధ్య చూపిన యధార్థతను ఘనపరిచియు ప్రస్తుత కాల శ్రమలు రాబోవు కాల మహిమ యొక్క నిరీక్షణ అని జ్ఞాపకము చేసి ధైర్యపరచి పత్రికను వ్రాయుటకు ప్రారంభించెను. శ్రమల మధ్య పరమ నమ్మకము కలిగియుండుటకు ఉత్సాహపరిచెను.

     తరువాత పత్రిక యొక్క ముఖ్య స్థానమునకు నేరుగా పౌలు వచ్చుచున్నాడు. రాబోవు ప్రభువు దినమును గూర్చి అబద్ద బోధకులు చెప్పినటువంటి తప్పుడు భావములను గూర్చి మాట్లాడుచున్నాడు. ఆ దినము నేటికినీ రాలేదు; ఆ దినమునందు సంభవించవలసినవి ఏవని అతడు బయలుపరచెను. కనుక అజాగ్రత్త గల సోమరితనము విడిచిపెట్టి లేచి సువార్తకొరకు కఠినముగా సేవ చేయుటయే వారు చేయవలసినది.

ఉద్దేశము:- క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చిన సందేహములకు జవాబును చెప్పుట.

గ్రంథ రచయిత:- పౌలు

ఎవరికి వ్రాసెను?:- థెస్సలొనీకయ సంఘమునకు, విశ్వాసులు యావన్మందికిని

వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ. 51లో థెస్సలొనీకయులకు వ్రాసిన కొన్ని నెలలకు తరువాత కొరింథు నుండి వ్రాసెను.

ఆంతర్యము:-  క్రీస్తు తిరిగి వచ్చు రాకడ సమయమును గూర్చి సంఘమందు పలువురికి ఈ అసత్య అభిప్రాయములుండెను. క్రైస్తవ విశ్వాసుల శ్రమలు అధికరించుటచే ప్రభువు యొక్క దినము త్వరగా వచ్చునని వారు ఎదురుచూచిరి. మరియు మొదటి థెస్సలొనీకయ పత్రిక యొక్క ఆంతర్యమున ప్రభువు రాకడ యే ఘడియ యందైనను సంభవించవచ్చునని అభిప్రాయ పడిరి. ఈ వివరణ యొక్క ఆంతర్యమున పలువురు సోమరులుగా మారి ఏ పనియూ చేయక క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టియుండిరి.

ముఖ్య పాత్రలు:- పౌలు, సీల, తిమోతి.

ముఖ్య పదజాలము:- ప్రభువు దినమును ఎరుగుట.

ముఖ్య వచనములు:- 2 థెస్సలొనీకయులకు 2:3; 2 థెస్సలొనీకయులకు 3:5-6.

ముఖ్య స్థలము:- థెస్సలొనీకయ

గ్రంథ విశిష్టత:- మొదటి థెస్సలొనీకయుల పత్రిక యొక్క కొనసాగింపుగా వ్రాయబడిన పత్రిక. క్రీస్తు రెండవ రాకడ యందు సంభవించవలసిన పలు కార్యములను పౌలు ఇచ్చట గుర్తించుచున్నాడు.

ముఖ్య అధ్యాయము:- అధ్యాయము 2. ప్రభువు దినము వచ్చి ముగించెనను ఒక తప్పుడు బోధనను ఎదురించుటకే ఈ పత్రికను పౌలు వ్రాసెను. అతడు సహించిన శ్రమల మధ్య ఈ బోధ వారిని కలత పరచి, ఎప్పుడు ప్రభువు యొద్ద చేర్చబడుదుము అనుటలో తారుమారు చేసెను. ప్రభువు ప్రత్యక్షతకు ముందు కొన్ని తేటయైన సంభవములు జరుగుననియు, ఆ ప్రసన్నమగుట అంతవరకు జరుగలేదనియు బయలుపరచుచున్నాడు.

గ్రంథ విభజన:- రాబోవు ప్రభువు దినమును గూర్చి వారికి బోధించిన మొదటి పత్రిక యొక్క కొనసాగింపే ఇది. (1 థెస్సలొనీకయులకు 5:1-11) ఇది కలత చెందిన థెస్సలొనీక విశ్వాసులను ధైర్యపరచి పని చేయుటకు సిగ్గుపడిన వారిని ఆ సోమరితనము నుండి విడిపించెను. మూడు ముఖ్య భాగములుగా ఈ పత్రికను చూడగలము.

(1) శ్రమల మధ్యను ధైర్యముగా నుండుటకై పిలువబడుట అధ్యా.1.

(2) ప్రభువు దినమును గూర్చిన వివరణ అధ్యా.2.

(3) సంఘమునకు ఉపదేశమును చెప్పుట అధ్యా.3.

కొన్ని ముఖ్య వివరణలు: - పరిశుద్ధ గ్రంథములోని 53వ పుస్తకము; అధ్యాములు 3; వచనములు 47; ప్రశ్నలు 1; చారిత్రక వచనముల 31; నెరవేర్చబడని ప్రవచనములు 16.