Nehemiah - నెహెమ్యా 1

1. హకల్యా కుమారుడైన నెహెమ్యాయొక్క చర్యలు. ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా

1. హకల్యా కుమారుడైన నెహెమ్య మాటలు ఇవి: “నెహెమ్యా అనే నేను కిస్లేవు నెలలో రాజధాని నగరమైన షూషనులో ఉన్నాను. అర్తహషస్త రాజ్య పాలన ఇరవయ్యవ ఏట ఇది జరిగింది.

2. నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు, యెరూషలేమును గూర్చియు నేను వారి నడుగగా

2. నేను షూషనులో వుండగా, నా సోదరుల్లో ఒకడైన హనానీయ, మరి కొందరు యూదా నుంచి వచ్చారు. అక్కడ నివసిస్తున్న యూదులను గురించి నేను వాళ్లని అడిగాను. వాళ్లు చెరనుంచి తప్పించుకొని, ఇంకా యూదాలోనే నివసిస్తున్న యూదులు. నేను వాళ్లని యెరూషలేము నగరం గురించి కూడా అడిగాను.

3. వారుచెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు; మరియు యెరూ షలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చ బడినవని నాతో చెప్పిరి.

3. హనానీయ, అతనితో ఉన్న వాళ్లూ ఇలా చెప్పారు: “నెహెమ్యా, చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లకి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. ఎందుకంటే, యెరూషలేము ప్రాకారం కూల్చబడింది. దాని ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి.”

4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.

4. యెరూషలేము ప్రజలను గురించి, ప్రాకారం గురించీ ఈ విషయూలు విన్నాక, నేను చాలా కలత చెందాను. నేను కూర్చుండి విలపించాను. నా విచారానికి అవధి లేకపోయింది. నేను కొన్ని రోజులపాటు ఉపవాసం వుండి, పరలోక దేవునికి ప్రార్థనలు చేశాను.

5. ఎట్లనగాఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,

5. తర్వాత ఈ కింది ప్రార్థన చేశాను: పరలోక దేవా, యెహోవా ప్రభూ, నీవు అత్యంత శక్తిశాలివైన మహా దేవుడివి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు పాటించే మనుష్యులను నువ్యు కటాక్షించి వారితో ప్రేమ ఒడంబడికను అమలుపరుస్తావు.

6. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీ కరించుము. నీకు విరోధముగ పాపముచేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి యింటివారును పాపము చేసియున్నాము.

6. దయచేసి నీవు కళ్లు తెరిచి, చెవులొగ్గి ఈ నీ సేవకుడు రాత్రింబగళ్లు నీ సన్నిధియందు చేస్తున్న ప్రార్థనలను విను. నేను నీ సేవకులైన ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థిస్తున్నాను. మేము నీకు వ్యతిరేకంగా పాపాలు చేశామన్న విషయాన్ని నేను ఒప్పుకొంటున్నాను నేనూ, నా తండ్రి కుటుంబంలోని ఇతరులూ నీకు వ్యతిరేకంగా పాపం చేశామని ఒప్పుకొంటున్నాను.

7. నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివిు, నీ సేవకు డైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడల నైనను విధులనైనను మేము గైకొనక పోతివిు.

7. ఇశ్రాయేలు ప్రజలమైన మేము నీపట్ల చాలా చెడుగా వ్యవహరించాము. నువ్వు నీ సేవకుడైన మోషే ద్వారా యిచ్చిన ఆజ్ఞలనూ, బోధనలనూ, విధులనూ మేము తృణికరించాము.

8. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చినమాటను జ్ఞాపకము తెచ్చు కొనుము; అదేదనగామీరు అపరాధము చేసినయెడల జనులలోనికి మిమ్మును చెదర గొట్టుదును.

8. నువ్వు నీ సేవకుడైన మోషేకి ఇచ్చిన ఉపదేశాన్ని దయచేసి గుర్తుచేనుకో. దేవా, నువ్వు ఆయనకి “మీ ఇశ్రాయేలు ప్రజలు విశ్వసనీయంగా వ్యవహరించక పోయినట్లయితే, మిమ్మల్ని యితర దేశాల మధ్యకు చెదరగొడ్తాను.

9. అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినయెడల, భూదిగంతములవరకు మీరు తోలివేయబడినను అక్కడనుండి సహా మిమ్మునుకూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పిం చెదనని నీవు సెలవిచ్చితివి గదా.

9. అలాకాక, మీ ఇశ్రాయేలీయులు నా వద్దకు తిరిగి వచ్చి, నా ఆదేశాలను పాటించి నట్లయితే, అప్పుడు నేనిలా చేస్తాను: మీ ప్రజలు తమ ఇళ్లు వాకిళ్లు వదలటానికి బలవంతం చేయబడినా, భూలోకపు అంచులదాకా పోయినా సరే, నేను వాళ్లని అక్కడనుంచి తిరిగి ఒక్కచోట చేరుస్తాను. ఎక్కడైతే నా నామాన్ని ఉంచుటకు ఏర్పాటు చేసుకున్నానో అక్కడికి తిరిగి వాళ్లని నేను తీసుకొస్తాను” అని చెప్పావు.

10. చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావమును చూపి, నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే.

10. ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు, నీ ప్రజలు. నువ్వు నీ గొప్ప శక్తిని వినియోగించి, వాళ్లని విడిపించావు.

11. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆల కించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అను గ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.

11. కాబట్టి ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. నేను నీ దాసుడను. నీ నామం పట్ల గౌరవం ప్రదర్శించాలని ఇష్టపడే నీ సేవకుల ప్రార్థనలు దయచేసి ఆలకించు. ప్రభూ, నేను రాజుకి ద్రాక్షారసం అందించే సేవకుణ్ణి . ఈ విషయం నీకు తెలుసు. అందుకని దేవా, నాకు ఈ నాడు సహాయం చెయ్యి. నేను రాజు సహాయాన్ని అర్థిస్తున్నాను. ఈ నా ప్రయత్నంలో నాకు విజయం చేకూర్చు. రాజుకి నా పట్ల అభిమానం కలిగేలా చెయ్యి.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.