Job - యోబు 1 - గ్రంథ విశ్లేషణ

1. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.
1 థెస్సలొనికయులకు 5:22

“ఊజు”– ఈ దేశం కనానుకు తూర్పు దిశగా ఉంది (3 వ) యిర్మీయా కాలంలో ఎదోం, ఊజు దేశాలు వేరువేరుగా ఉన్నాయి (యిర్మియా 25:20-21). కానీ ఎదోంవాళ్ళు ఊజులో ఉన్నారు (విలాపవాక్యములు 4:21). కాబట్టి ఊజు బహుశా ఎదోంకు సమీపంలోనే ఉండవచ్చు. ఎలీఫజు స్వస్థలమైన తేమాను (యోబు 2:11) ఎదోం సరిహద్దుల లోపల ఉంది. “నిర్దోషి”– అంటే యోబులో పాప స్వభావం లేదని కాదు. దీని అర్థం ఏమంటే యోబు దేవుని కృపవల్ల అన్ని సద్గుణాలూ గలవాడై, అన్ని విధాలా నిజాయితీ పవిత్రతలతో కూడిన జీవితం గడిపేవాడు. అతని స్వభావంలో ఉన్న పాపం మీద దేవుడతనికి విజయాన్ని ఇచ్చాడు. మన భ్రష్ట స్వభావాన్ని గురించి ఆదికాండము 8:21; కీర్తనలు 51:5; కీర్తనలు 58:3; రోమీయులకు 3:9-19; ఎఫెసీయులకు 2:1-3 నోట్స్ చూడండి. నిర్దోషత్వం గురించి ఆదికాండము 6:9; ఆదికాండము 17:1; మత్తయి 5:48; 2 కోరింథీయులకు 7:1; ఎఫెసీయులకు 4:13; ఫిలిప్పీయులకు 3:12; కొలస్సీయులకు 1:28; కొలస్సీయులకు 4:12; యాకోబు 1:4 చూడండి. “నిజాయితీ”– ఈ మాటకు అర్థమేమంటే తన వ్యవహారాలన్నిటిలో యోబు ముక్కు సూటిగా, యథార్థంగా, నీతిగా ఉండి వంకర త్రోవలు పట్టకుండా ఉన్నాడన్నమాట (కీర్తనలు 7:10; కీర్తనలు 11:2 కీర్తనలు 11:7; కీర్తనలు 25:8; కీర్తనలు 112:2 కీర్తనలు 112:4; కీర్తనలు 140:13; సామెతలు 15:8; సామెతలు 16:17). “భయభక్తులు”– దైవభయం గురించిన వివరం కోసం యోబు 28:28; ఆదికాండము 20:11; కీర్తనలు 34:11-14; కీర్తనలు 111:10; కీర్తనలు 130:3-4; సామెతలు 1:7 చూడండి. దైవభయం ఉన్నవారు దుర్మార్గతనుంచి తొలగిపోతారు. నిజమైన దైవభయంలో ఉన్న విశేషమిదే (యోబు 28:28; సామెతలు 3:7; సామెతలు 8:13; సామెతలు 16:6; 2 కోరింథీయులకు 7:1). ఇక్కడ వెల్లడైన యోబు లక్షణాలు, మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండగలడో అన్నదానికి ఆదర్శం. ఈ లక్షణాలు యోబుకున్న ఆస్తిపాస్తులన్నిటి కంటే అత్యంత విలువైనవి.

2. అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తె లును కలిగిరి.

3. అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.

తూర్పు అంటే కనానుకు తూర్పు దిశగా బహుశా యూఫ్రటీస్ నదివరకు ఉన్న ప్రదేశం కావచ్చు.

4. అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ యిండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి.

5. వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.

ఈ మాటల్లో యోబుకు దేవునిపైన, తన పిల్లల పైన ఉన్న ప్రేమా, మానవ హృదయంలో సహజంగా ఉండే పాప స్వభావం గురించిన గ్రహింపూ తేటతెల్లమౌతున్నాయి. అంతేకాక కుటుంబ నాయకుడైన యాజిగా యోబు నిర్వహించే పనులను గురించి తెలుస్తున్నది. యాజి గురించి వివరణ నిర్గామకాండము 28:1. హోమబలి వివరణ లేవీ 1వ అధ్యాయం.

6. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగు వాడు వారితో కలిసి వచ్చెను.

“దేవుని కుమారులు”– యోబు 2:1; యోబు 38:7; ఆదికాండము 6:2. దేవుని కుమారులు అంటే దేవదూతలు (ఆదికాండము 16:7 లో నోట్‌). ఇక్కడ జరిగిన దాన్నిబట్టి చూస్తుంటే వారు తమ తమ చర్యల గురించి దేవునికి చెప్పి వాటికి సంబంధించిన ఆజ్ఞలను తీసుకొనేందుకు వచ్చారని అర్థమౌతున్నది. “రోజు”– మనుషులకు అగోచరమైన ఆత్మల లోకంలోకి తొంగి చూచే అవకాశం ఇక్కడ మనకు కలుగుతున్నది. యోబుకు సంభవించిన దానంతటికీ మూల కారణం ఆ లోకంలోనే ఉంది. “సైతాను”– 1 దినవృత్తాంతములు 21:1 నోట్. సైతాను కూడా దేవుని ఎదుట కనిపించవలసిందే. ఒక విధంగా చూస్తే సైతాను పనిపాటలు కూడా దేవుని సర్వాతీతమైన సంకల్పం పరిధిలోనే సాగుతాయని చెప్పాలి. అంటే సైతాను చెయ్యదలచుకున్నదంతా పూర్తిగా చేసేందుకు అతనికి అధికారం లేదు. దేవునికి జ్ఞానయుక్తంగా, న్యాయంగా అనిపిస్తే సైతాను లేక ఇతర దురాత్మలు మనుషులకు కీడు చేసేందుకూ దేవుని ప్రజలను పరీక్షించేందుకూ ఆయన అనుమతిస్తాడు.

7. యెహోవానీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాదిభూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను.

సైతాను ఎక్కడెక్కడికి వెళ్ళాడో దేవునికి తెలుసు. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమయ్యేదేమంటే సైతాను కూడా తన కార్యకలాపాల గురించి దేవునికి సంజాయిషీ ఇచ్చుకోవాలి. సైతాను భూలోకంలో తిరుగుతూ కీడు చేసే అవకాశాల కోసం చూస్తున్నాడు (1 పేతురు 5:8). దేవునిలాగా సైతాను ఒకే సమయంలో అన్ని చోట్లా ఉండలేడు.

8. అందుకు యెహోవా-నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.
1 థెస్సలొనికయులకు 5:22

“యోబు”– ఇది సైతాను అంతవరకు గమనించని ఒక వ్యక్తివైపుకు దేవుడు అతని దృష్టి మళ్ళించడం కాదు. తరువాతి రెండు వచనాలను బట్టి సైతాను యోబును జాగ్రత్తగా కనిపెట్టి చూస్తున్నాడని అర్థమౌతున్నది. “ఎవరూ లేరు”– సాక్ష్యాత్తూ దేవుని అభిప్రాయం ప్రకారం యోబు అతని తరంలో భూమిపై ఉన్న వారందరిలోకి మంచివాడు, ఉత్తముడు. ఈ గ్రంథంలోని సత్యం పూర్తిగా గ్రహించాలంటే ఈ విషయాన్ని గుర్తించాలి.

9. అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?
ప్రకటన గ్రంథం 12:10

దేవుడంటే భయభక్తులు కలిగి భూమి అంతటిపైనా మంచివాడైన ఒక వ్యక్తి విషయంలో సైతాను అభిప్రాయం ఇదే. దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, సేవించడం ద్వారా తమకు దక్కే లాభం కోసమే మనుషులంతా అలా చేస్తారు అంటున్నాడు. మానవ జాతి అంతటిలోనూ దేవుడంటే యథార్థమైన ప్రేమ, భయభక్తులు ఉండడమనేది వట్టి మాట అంటున్నాడు. ఈ లోకంలో కనిపించే మత సంబంధమైన ఆసక్తికి మూలం కేవలం స్వలాభాపేక్ష, స్వార్థం మాత్రమే అని సైతాను అభిప్రాయం. దురదృష్టవశాన సైతాను వెలిబుచ్చిన ఈ అభిప్రాయం చాలా మట్టుకు సత్యమే. పాపాత్ములైన మనుషులు కేవలం తమ గురించే ఆలోచిస్తూ ఉంటారు. దేవుని నుంచి తమకేమి లభిస్తుందో అనే చూస్తుంటారు గాని దేవుణ్ణి ప్రేమించరు. అయితే దేవుడు వ్యక్తుల మనస్సుల్లో పని చేసి వారిని మార్చగలడు. వారికి క్రొత్త స్వభావాన్ని ఇచ్చి తన ప్రేమను వారి హృదయాల్లో నింపగలడు. అలాంటివారు దేవునికి నిజంగా సేవ చేయగలుగుతారు. ఆయనకోసం తమకున్న సమస్తాన్నీ వదులుకునేందుకు వెనుకాడరు (మార్కు 10:28; లూకా 5:11 లూకా 5:27-28; లూకా 14:33; రోమీయులకు 5:5; ఫిలిప్పీయులకు 3:8; హెబ్రీయులకు 10:32-34; హెబ్రీయులకు 11:36-38). దీనికి ఒప్పుకునేందుకు సైతాను ఇష్టపడడు. దేవుని ప్రజలపై నేరాలు మోపుతూ వారిని వ్యతిరేకిస్తూనే ఉంటాడు. మనుషులు దేవునికి ఎదురు తిరిగి ఆయన్ను తూలనాడేలా చెయ్యడమే సైతాను ఆశయం. ఇలా చేసేవాళ్ళంతా అసలు సైతాను ఉన్నాడని తెలియకపోయినా సైతాను పక్షం చేరుతున్నారన్న మాట. సైతానుకు దేవుడంటే ద్వేషం. మనుషులందరూ కూడా ఆయన్ను ద్వేషించేలా చెయ్యడమే వాడి ఆశయం. సైతానుకు మనుషులంటే కూడా ద్వేషం. దేవుడు మనుషులకు తీర్పు తీర్చి శిక్షించి నాశనం చెయ్యడమే వాడి ఆశయం.

10. నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.

సైతాను యోబును గురించి (కాబట్టి భక్తిపరులైన మనుషులందరి గురించి) తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నాడు. దేవుని ద్వారా కలిగే సంరక్షణను బట్టీ, ఇహలోక సంబంధమైన దీవెనలను బట్టీ మాత్రమే యోబు ఆయన్ను సేవించి ఆరాధిస్తున్నాడని అంటున్నాడు సైతాను. ఆ దీవెనలను, సంరక్షణను తీసేస్తే చాలు – యోబుకున్న భక్తి వాటితోనే పోతుంది. ఈ పుస్తకంలో మనం చూచేదేమంటే యోబు విషయంలో ఇది నిజం కాదు. అయితే ఒక వేళ ఇది మన విషయంలో నిజమేనా? ఆయన మన ఆస్తిమీదికీ మన పిల్లలమీదికీ విపత్తును రానిస్తే ఆయన మంచితనం మీద మనకున్న నమ్మకాన్నీ భక్తిభావాన్నీ పోగొట్టుకుంటామా?

11. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

12. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.

యోబు విషయంలో సైతాను చేసిన సవాలును దేవుడు స్వీకరించాడు. తాను స్వయంగా యోబుకు విరోధంగా చెయ్యి ఎత్తడు గాని సైతాను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని పరీక్షించేందుకు అనుమతించాడు. దేవుడు తరచుగా తన ప్రజలను పరీక్షలకు గురి కానిస్తాడు (ఆదికాండము 22:1 నోట్‌). ఇలాంటి పరీక్షల ద్వారా కలిగే ఫలితాలేవంటే దేవునికి మహిమ, ఆ పరీక్షలనుంచి విజయవంతంగా బయటపడిన వారికి బహు గౌరవమూ, ఆధ్యాత్మిక శ్రేయస్సూ. వేరే విధంగా చెప్పాలంటే దేవుడు సైతాను వేసే అపనిందలనూ, తనకూ తన ప్రజలకూ విరోధంగా సైతాను జరిపే కార్యక్రమాలన్నిటినీ మంచికే జరిగేలా చేస్తాడు (ఆదికాండము 50:20; సంఖ్యాకాండము 24:25; రోమీయులకు 8:28 నోట్స్ చూడండి). ఆత్మ సంబంధమైన విషయం చూస్తే ఆ తరంలో దేవుని సర్వ శ్రేష్ఠమైన చేతి పని యోబు (ఎఫెసీయులకు 2:10 పోల్చిచూడండి). పరీక్షకు గురి కానివ్వకుండా యోబును దాచిపెట్టే ప్రయత్నం దేవుడు చేయనిష్టపడలేదు.

13. ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి

తన చేతిలో పడిన ఆస్తిపాస్తులకూ మనుషులకూ ఏ గతి పడుతుందో సైతాను ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. వాడు నాశనకారి, హంతకుడు (యోహాను 8:44). దేవుడే గనుక అనుమతి ఇస్తే దేవుని ప్రజల్లో ప్రతి ఒక్కరికీ ఇలానే చేస్తాడు. వాడలా చెయ్యడం లేదంటే దానికి కారణం దేవుడు తన ప్రజల చుట్టూ కంచెను నిలిపి ఉంచుతున్నాడు (కీర్తనలు 3:3; కీర్తనలు 5:12; కీర్తనలు 32:7; ద్వితియోపదేశకాండము 33:27; యోహాను 17:15; 1 పేతురు 1:5). సైతాను తన పక్షాన చేరినవారికి, సంపదల కోసం, హోదాల కోసం వాడి ప్రలోభాలకు లొంగిపోయిన వారికీ వాటిని అభివృద్ధి చేయవచ్చు. అయితే అవి వారి అంతిమ నాశనానికి దారి తీస్తాయని వాడిక్కూడా తెలుసు.

14. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొని పోయి

షెబావాళ్ళంటే ఉత్తర అరేబియా ప్రాంతాల్లో సంచార జీవనం గడిపే తెగ.

15. ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి యున్నాననెను.

16. అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చిదేవుని అగ్ని ఆకా శమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

“దేవుని అగ్ని”అంటే మెరుపులు, పిడుగులు అని కొందరు పండితుల అభిప్రాయం. అయితే ఇది సైతాను ఆకాశం నుంచి వారిమీద కురిపించిన అగ్ని కావచ్చు (ప్రకటన గ్రంథం 13:13 చూడండి. అక్కడ సైతాను అనుచరుడొకడు సరిగ్గా ఇదే పని చేసినట్టుగా ఉంది). ఏది ఏమైనా ఈ వార్తను యోబుకు వినిపించినవాడు మాత్రం ఆ అగ్ని కురిపించింది దేవుడే అనుకొంటే అతడు పొరపాటుగా అర్థం చేసుకున్నాడని తెలుస్తున్నది.

17. అతడు ఇంక మాట లాడుచుండగా మరియొకడు వచ్చికల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను.

“మాట్లాడుతూనే”– ఒక విపత్తు గురించి విన్న దెబ్బ నుంచి యోబు తేరుకోక ముందే మరో విపత్తును గురించిన వార్త వినిపిస్తున్నారు. ఒకదాని వెంట ఒకటి వేగంగా వచ్చే దుర్వార్తల మూలంగా యోబును పడద్రోసి నేలరాసి నలిపివేద్దామని సైతాను ప్రయత్నం. ఊజు దేశానికి తూర్పుగా లేక ఉత్తర తూర్పు దిశగా ఈ కల్దీయవారు నివసించేవారు.

18. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చినీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయు చుండగా

నాశనం కలిగించే సుడిగాలులను సైతాను పంపించగలడన్న మాట. ఇప్పుడు యోబు హృదయంపై, దెబ్బ తిని ఉన్న అతని మనసుపై అన్నిటికంటే విపరీతమైన దెబ్బపడింది. 500 జతల ఎద్దులు, 500 గాడిదలు, 7000 గొర్రెలు, 3000 ఒంటెలు వీటన్నిటినీ పోగొట్టుకోవడం కంటే తన పదిమంది సంతానాన్ని కోల్పోవడం యోబు పాలిట అతి దుఃఖకరం.

19. గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది ¸యవనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియ జేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నా ననెను.

20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను
మత్తయి 26:65

ఈ వాక్యం, తరువాతి వాక్యంలో బైబిల్లోని ఉత్తమోత్తమమైన క్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి మనలో యోబు పట్ల గౌరవ భావాన్ని కలిగించాలి. యోబు విశ్వాసం అతనికి కలిగిన నష్టాలు, దుఃఖం వీటన్నిటికంటే ఉన్నతంగా ఉంది. సైతాను అబద్ధికుడన్న విషయం రుజువైంది. మానవ హృదయాల్లో దేవుని కృపా పరిచర్య శక్తివంతమైనదీ నిజమైనదీ అన్న విషయం నిరూపించబడింది. సైతాను ఊహించినట్టు దేవుణ్ణి దూషించేందుకు బదులు యోబు ఆయనను స్తుతించాడు. యోబు తనకు కలిగిన నష్టాల విషయం షెబావారిని గానీ కల్దీయవారిని గానీ సుడిగాలిని అగ్నిని గానీ చివరికి సైతానునూ కూడా నిందించలేదు. జరిగినవన్నీ ప్రమాదవశానో, మనుషుల దౌర్జన్యం వల్లనో, ప్రకృతి వైపరీత్యం వల్లనో జరిగాయని అతడు భావించలేదు. ఇచ్చినది దేవుడే, తీసివేసినది దేవుడే అన్నాడు. అంతటిలో దేవుని సర్వాధిపత్యాన్ని గుర్తించాడు. దేవుడు జరగనిస్తే తప్ప అక్కడ జరిగినవన్నీ సంభవించవని యోబుకు తెలుసు. “బట్ట...క్షౌరం”– పట్టరాని సంతాపానికి గుర్తుగా.

21. నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.
1 తిమోతికి 6:7

“దిగంబరి”– కీర్తనలు 49:17; ప్రసంగి 5:15; 1 తిమోతికి 6:7. “తీసివేశాడు”– మనందరం దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసినవాళ్ళమే. ఆయననుంచి మంచిది ఏదైనా పొందేందుకు యోగ్యులం కాము. మనకేదైనా ఉందీ అంటే అది దేవుని ఉచిత కృపవల్లే. కొంత కాలంపాటు మనకిచ్చినదాన్ని ఆయన తీసేసుకుంటే అందులో అన్యాయమేమీ లేదు. అయితే ఇలాంటి విపత్తు తనకెందుకు వచ్చిందో ఆ కారణం తెలియకపోయినా యోబు ఈ సంగతిని గ్రహించి అంగీకరిస్తున్నాడు. “స్తుతి”– కీర్తనలు 22:22-23; కీర్తనలు 33:1-3; కీర్తనలు 34:1; కీర్తనలు 44:8; కీర్తనలు 50:23; కీర్తనలు 52:9; కీర్తనలు 63:3-4; ఎఫెసీయులకు 5:20; 1 థెస్సలొనికయులకు 5:18.

22. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.

యోబుకు కలిగిన నష్టం కంటే అతి తక్కువ నష్టం వచ్చినా దేవుడు తమకు అన్యాయం చేశాడని బుద్ధిమాలి ఆలోచించేవారు ఈ ప్రపంచంలో ఎంతమంది లేరు?