Psalms - కీర్తనలు 76

1. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.

నిజ దేవుణ్ణి ఎరిగి ఉండడమే ఒక వ్యక్తికి గానీ ఒక ప్రజకు గానీ ఉండగలిగిన అతి శ్రేష్ఠమైన ధన్యత. ఆ రోజుల్లో ఇస్రాయేల్ వారి ధన్యత ఇదే. ఇప్పుడు ఈ ఏకైక నిజ దేవుడు లోకమంతా వ్యాపించి ఉన్న క్రీస్తు విశ్వాసులందరికీ తెలిసి ఉన్నవాడే. యోహాను 17:3 చూడండి.

2. షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.

“షాలేం”– జెరుసలం. “సీయోను”– కీర్తనలు 74:2.

3. అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను.(సెలా.)

తన ప్రజల పక్షంగా దేవుడు పోరాడి శత్రువును లొంగదీసిన అనంతరం రాసిన విజయగీతం ఈ కీర్తన (5-9 వ). 2 దిన 32, యెషయా 37 అధ్యాయాల్లో సన్‌హెరీబు ఓటమి ఈ కీర్తనలో కనిపించే సంఘటన అని కొందరు పండితుల అభిప్రాయం. కానీ ఈ కీర్తనను రాసినది ఆసాపు అయితే సన్‌హెరీబు ఇస్రాయేల్ పై దాడి చేయటం ఆసాపు మరణం తరువాత చాలా కాలానికి జరిగింది. ఇక్కడ ఉన్నది ఆ సంఘటన వర్ణనే అని తేల్చి చెప్పలేము. అదే గనుక అయితే ఆసాపు భవిష్యత్తులో జరగబోయే దాన్ని జరిగిపోయినట్టుగానే రాస్తున్నాడు. 74వ కీర్తన శీర్షికపై రాసిన నోట్ చూడండి.

4. దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు.

5. కఠినహృదయులు దోచుకొనబడి యున్నారు వారు నిద్రనొంది యున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను.

6. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.

7. నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?

8. నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి

9. దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను.(సెలా.)

దుర్మార్గులైన శత్రువుల పై దేవుడు తన కోపాన్ని ఎందుకు కుమ్మరిస్తాడో చూడండి. న్యాయం జరగాలంటే వినయవంతులకు రక్షణ కలగాలంటే ఇది అవసరం.

10. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.

మనుషులు జరిగించేవి, వారు దేవుని ప్రజలపై చూపే కోపం వీటన్నిటినీ దేవుడు తనకు మహిమ, తన ప్రజలకు మేలు కలిగేందుకు సాధనాలుగా వాడుకోగల సమర్థుడు. అలా వాడుకుంటాడు (ఆదికాండము 50:20; నిర్గామకాండము 9:16; అపో. కార్యములు 2:22-24; రోమీయులకు 9:17). అలానే తనకు వ్యతిరేకంగా ఉన్న మనుషుల కోపాన్ని తిరిగి వారిపైననే ఆయుధంగా దేవుడు ప్రయోగించగలడు, ప్రయోగిస్తాడు. నిర్గామకాండము 14:5-28; ఎస్తేరు 7:10 పోల్చిచూడండి.

11. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.

“మ్రొక్కుబడులు”– కీర్తనలు 50:14. “కానుకలు”– కీర్తనలు 68:29; 2 దినవృత్తాంతములు 32:22-23.

12. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు.

కీర్తనలు 47:2 చూడండి.