Click to Donate & Support us or contact us for any Support 8898 318 318

Psalms - కీర్తనలు 94

1. యెహోవా, ప్రతికారముచేయు దేవా, ప్రతికారముచేయు దేవా, ప్రకాశింపుము
1 థెస్సలొనికయులకు 4:6

దీని రచయిత ఎవరో మనకు తెలియదు. ఇతడు అధికారంలో ఉన్న దుర్మార్గులు పెట్టే పీడనకు గురై బాధపడు తున్నాడు. దేశంలో న్యాయం వక్రమార్గం పడుతున్నందుకు అతడు కంగారు పడుతున్నాడు. ప్రజల పై పరిపాలన చేసే అధికారం దుర్మార్గుల చేతుల్లో ఉంది (వ 20). వారు దేవుని ప్రజలను నలగ్గొట్టారు (వ 5), బలహీనులను నిస్సహాయులను హత్య చేశారు (వ 6). అందువల్ల దేవుడు వారికి ప్రతీకారం చెయ్యాలని రచయిత ప్రార్థిస్తున్నాడు. వ్యక్తిగతమైన పగను బట్టి చేసిన ప్రార్థన కాదిది. న్యాయం గెలవాలనీ, హింసలకు గురైన వారికి సంరక్షణ కలగాలనీ కోరిక ఉన్నందువల్ల ఇలా ప్రార్థిస్తున్నాడు. మనం ప్రతీకారం దేవునికే వదిలెయ్యాలి. తన సమయంలో, తన పద్ధతిలో ఆయన దాన్ని జరిగిస్తాడు (నిర్గామకాండము 21:23-25; సంఖ్యాకాండము 31:2; నహూము 1:2 నహూము 1:7; రోమీయులకు 12:19; 2 థెస్సలొనికయులకు 1:6-7; హెబ్రీయులకు 10:30-31).

2. భూలోక న్యాయాధిపతీ లెమ్ము గర్విష్టులకు ప్రతిఫలమిమ్ము

ఇక్కడ దేవుని పేరు ఒకటి ఉంది. ఆయన లోకానికి తీర్పు తీరుస్తాడు (కీర్తనలు 58:11; ఆదికాండము 18:25; అపో. కార్యములు 17:31).

3. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?

4. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడు చున్నారు.

చెడు మార్గాలకూ డంబాలు చెప్పుకోవడానికీ ఉన్న సంబంధాన్ని గమనించండి (కీర్తనలు 10:3; కీర్తనలు 52:1).

5. యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని

విశ్వాసులు దేవుని ప్రజలు, దేవుని సొత్తు. వారిని ఆయన మరెప్పటికీ అలానే నలిగిపోనిస్తాడా? ఎంతమాత్రం కాదు.

6. యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు

దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఇస్రాయేల్ ప్రజలు విధవరాళ్ళపట్ల, పరదేశుల పట్ల, అనాథల పట్ల ప్రత్యేకమైన దయ చూపించాలి – నిర్గామకాండము 22:21-22; ద్వితియోపదేశకాండము 10:18-19; ద్వితియోపదేశకాండము 14:28-29; ద్వితియోపదేశకాండము 24:19-20; ద్వితియోపదేశకాండము 27:19. దానికి బదులు ఈ దుష్ట పాలకులు వారిని హత్య చేశారు.

7. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేనివారిని హతముచేయుచున్నారు.

కీర్తనలు 10:11; కీర్తనలు 14:1. దుర్మార్గులు బయటికి ఎంత భక్తిగా, మత సంబంధంగా కనిపించాలని ప్రయత్నించినా మనసులో మాత్రం నాస్తికులే. ఏకైక నిజ పవిత్ర దేవుని గురించిన సత్యాన్ని వారు అణచివేస్తారు.

8. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?

దేవుణ్ణి లెక్కచెయ్యని అవిశ్వాసుల కటిక మూర్ఖత్వాన్ని రచయిత చూపిస్తున్నాడు. వారు గొప్ప విద్యావంతులై ఉండి సామాన్యులైన విశ్వాసులను చిన్నచూపు చూడవచ్చు. అయితే వారు మూర్ఖులు, జ్ఞానాన్ని విడిచిపెట్టినవారు. విశ్వాసులే వారిని చిన్నచూపు చూడవలసిన కారణం ఉంది (కాని వారలా చెయ్యకూడదు). ఈ అవిశ్వాసులు మనిషి చెవిని, శబ్దాలను వినే ఆ అద్భుత పరికరాన్ని చూచి దాన్ని సృష్టించిన వాడెవరూ లేరనుకోగలరా, లేక ఆయనకు చెవుడు అనుకోగలరా? దృష్టి కారకమైన ఆ అద్భుత అవయవం కన్నును తీసుకోండి. దానికి సృష్టికర్త ఎవరూ లేరని లేక ఆ సృష్టికర్త చూడలేడని జ్ఞానాన్ని విడిచిపెట్టిన మూర్ఖులు మాత్రమే అనుకోగలరు. మనిషి తనకున్న కొద్దిపాటి స్వల్ప జ్ఞానాన్ని గురించి మిడిసిపడుతూ దేవునికేమీ జ్ఞానం లేదని అనుకోగలడా ఏమిటి! దేవుడు మొత్తం జాతులనే శిక్షిస్తాడు. అలాంటివాడు కేవలం కొందరు దుర్మార్గుల సంగతి చూడలేడా? మనిషి ఆలోచనలు ఎంత వ్యర్థం, ఎంత దుర్మార్గం! దేవుడు వట్టివాడని ఒక మనిషి అనుకుంటే అతడే వట్టివాడైపోతాడు.

9. చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా?

10. అన్యుజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?

11. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.
1 కోరింథీయులకు 3:20

12. యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.

ఇక్కడనుంచి ఈ కీర్తన శ్రుతి మారుతుంది. దేవునిలో తనకున్న దృఢమైన నిబ్బరాన్ని, నమ్మకాన్ని రచయిత బయట పెడుతున్నాడు. దుర్మార్గుల మూలంగా కలిగిన కష్టాల వెనుక దేవుని ప్రేమతో కూడిన ఉద్దేశం ఉందని అతని గట్టి నమ్మకం. తనకు బుద్ధి చెప్పేందుకు, సరిదిద్దేందుకు దేవుడు ఆ కష్టాలకు వాడుకుంటాడు (12 వ). అవన్నీ ఉన్నప్పటికీ హృదయానికి నెమ్మది ఇస్తాడు (13 వ). ప్రజలలో న్యాయమైన తీర్పును తిరిగి స్థాపిస్తాడు. ఇక్కడొక అద్భుత సత్యాన్ని చూస్తున్నాం (ద్వితియోపదేశకాండము 8:5; యోబు 5:17; కీర్తనలు 119:71 కీర్తనలు 119:171; సామెతలు 3:11-12; హెబ్రీయులకు 12:5-6). దేవుని క్రమశిక్షణ బాధకరమే గాని అది మనకు చేసే గొప్ప మేలుకోసం దాన్ని ఆహ్వానించాలి.

13. భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు.

అడవి మృగాలను పట్టుకునేందుకు మనుషులు గుంటలు తవ్వుతారు. దుర్మార్గులు క్రూర మృగాల్లాగానే దేవుని గొర్రెలను చీల్చి వేయడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వారు పడాలని దుర్మార్గుల కోసం గుంటలు తవ్వడం జరుగుతుంది.

14. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.
రోమీయులకు 11:1-2

15. నీతిని స్థాపించుటకై న్యాయపుతీర్పు జరుగును యథార్థహృదయులందరు దాని ననుసరించెదరు.

16. దుష్టులమీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును?

17. యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును.

దేవుడు అతనికి సహాయం చెయ్యకపోతే మరణించి ఉండేవాడని అతని భావం.

18. నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.

19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.
2 కోరింథీయులకు 1:5

బాధలు, అన్యాయం ఉంటున్న సమయంలో ఆందోళనతో కూడిన తలంపులు సహజంగానే మనకు కలుగుతాయి. అయితే వారి వల్ల మనం ఉక్కిరిబిక్కిరి అయిపోనవసరం లేదు. పరీక్షల్లో, బాధల్లో మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యాకోబు 1:2 చూడండి.

20. కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా?

పరిపాలకులు ప్రజలను అణగద్రొక్కేలా, తాము దుర్మార్గం చేసేలా కొన్ని సార్లు శాసనాలు చేస్తారు. ఇలాంటి పరిపాలనల్లో దేవునికేమి భాగం లేదు.

21. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారిమీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు.

22. యెహోవా నాకు ఎత్తయిన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము.

23. ఆయన వారిదోషము వారిమీదికి రప్పించును వారి చెడుతనమునుబట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును.