Ecclesiastes - ప్రసంగి 1

1. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై యుండిన ప్రసంగి పలికిన మాటలు.

1. ఇవి దావీదు కుమారుడును, యెరూషలేము రాజు అయిన ప్రసంగి చెప్పిన ప్రవచనాలు.

2. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే.
రోమీయులకు 8:20

2. అన్నీ పరమ అర్థరహితాలు. ‘సమస్తం వృధా కాలయాపన!’ అంటాడు ప్రసంగి.

3. సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి?

3. ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా ? (లేదు!)

4. తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.

4. ఒక తరం మారి మరొకతరం వస్తుంది.కాని, ఈ భూమి శాశ్వతంగా ఉంటుంది.

5. సూర్యుడుద యించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును.

5. సూర్యుడు ఉదయించును మరియు అస్తమించును. మరల ఉదయించే చోటుకు త్వరగా వెళతాడు.

6. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.

6. గాలి దక్షిణ దిశకి వీస్తుంది, తి రిగి ఉత్తర దిశకి వీస్తుంది. గాలి చుట్టూ తిరిగి తిరిగి చివరకు తాను బయల్దేరిన చోటుకే రివ్వున వస్తుంది.

7. నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును

7. నదులన్నీ మరల మరల ఒక్క చోటుకే ప్రవహిస్తాయి. అవన్నీ సముద్రంలోకే పోయి పడినా సముద్రం నిండదు.

8. ఎడతెరిపి లేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు.

8. ఆయా విషయాలను మాటలు పూర్తిగా వివరించలేవు . అయితేనేమి, మనుష్యులు మాట్లాడు తూనే వుంటారు . మాటలు మళ్లీ మళ్లీ మన చెవుల్లో పడుతునే వుంటాయి. అయినా, మన చెవులకి తృప్తి తీరదు. మన కళ్లు ఎన్నింటినో చూస్తూ ఉంటాయి. అయినా మనకి తనివి తీరదు.

9. మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది; మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.

9. అన్నీ ఆదినుంచి ఉన్నట్లే కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు జరిగినవే ఇక ముందూ ఎల్లప్పుడూ జరుగుతాయి. ఆ జీవితంలో కొత్తదంటూ ఏదీ లేదు.

10. ఇది నూతనమైనదని యొకదానిగూర్చి యొకడు చెప్పును; అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే.

10. ఎవరైనా, “చూడండి, ఇదిగో ఇది కొత్తది” అని చెప్పవచ్చుగాక. కాని, అది ఎప్పుడూ ఇక్కడ ఉన్నదే. మనం పుట్టక ముందు అది ఇక్కడ ఉన్నదే!

11. పూర్వులు జ్ఞాపక మునకు రారు; పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండ బోవువారికి కలుగదు.

11. పూర్వం ఎప్పుడో జరిగిన విషయాలు మనుష్యులకి గుర్తుండవు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు భవిష్యత్తులో జనానికి గుర్తుండవు. దానికి తర్వాత, అప్పటివాళ్లకి, తమ పూర్వపు వాళ్లు చేసిన పనులు గుర్తుండవు.

12. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీ యులమీద రాజునై యుంటిని.

12. ప్రసంగి అనే ఉపదేశకుడినైన నేను యెరూషలేములోని ఇశ్రాయేలు రాజును.

13. ఆకాశముక్రింద జరుగు నది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలె నని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది.

13. నేను విద్యను అభ్యసించి, దానివల్ల లభ్యమైన జ్ఞానాన్ని ఈ జీవితంలో జరిగే అన్ని విషయాలనూ అవగాహన చేసుకొనేందుకు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలో, ఇది దేవుడు మనకి అప్పగించిన చాలా కఠినమైన పని అని నేను గ్రహించాను.

14. సూర్యునిక్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి.

14. ఈ భూమి మీద జరిగేవాటన్నింటినీ నేను పరిశీలనగా చూశాను. అవన్నీ వ్యర్థమని గ్రహించాను. అది గాలిని మూటగట్ట ప్రయత్నించడం వంటిది.

15. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు, లోపముగలది లెక్కకు రాదు.

15. (వీటిని వేటినీ మనం మార్చలేము.) వంకరగా వున్నదాన్ని అది తిన్నగా వుందని మనం చెప్పలేము. ఏదైనా ఒకటి అక్కడ లేనప్పుడు అది అక్కడ వుందని మనం చెప్పలేము.

16. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాల ఎక్కువగా జ్ఞానము సంపాదించితి ననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితి ననియు నా మనస్సులో నేననుకొంటిని.

16. “నేను చాలా తెలివైనవాడిని. నాకంటె ముందు యెరూషలేమును పాలించిన రాజులందరికంటె నేను వివేకవంతుడిని. వివేకం, జ్ఞానం వీటి గూర్చి నాకు తెలుసు!” అని నాలో నేను అనుకున్నాను.

17. నా మనస్సు నిలిపి, జ్ఞానాభ్యాసమును వెఱ్ఱితనమును మతిహీనతను తెలిసికొనుటకు ప్రయత్నించితిని; అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలిసికొంటిని.

17. వివేకం, జ్ఞానం వెర్రితనం మరియు బుద్ధి తక్కువ ఆలోచనలు చెయ్యడంకంటె ఎలా మెరుగైనవో తెలుసుకోవాలని తీర్మానించుకున్నాను. కాని, ఆ క్రమంలో వివేకం సంపాదించ ప్రయత్నించడం గాలిని పోగుచేసి, మూటగట్ట ప్రయత్నించడం వంటిదేనని నేను గ్రహించాను.

18. విస్తార మైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును; అధిక విద్య సంపాదించినవానికి అధిక శోకము కలుగును.

18. వివేకం పెరిగే కొద్ది మనిషికి నిరాశా నిస్పృహలు పెరుగుతాయి. వివేకం పెరిగిన మనిషి మరింత దుఃఖాన్ని కూడగట్టుకుంటాడు.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.