ఇక్కడ స్నేహితులు మాట్లాడుతూ ఉన్నట్టు అనుకోవాలి. ఈ పుస్తకంలోని పరమ సత్యాలకు సూచనగా ఉన్న సొలొమోను రాజునూ అతని పెండ్లి కూతురునూ గురించి మాట్లాడుతున్నారు. సొలొమోను తన రాజ ఠీవి, వైభవమంతటితో తన వధువును తీసుకువెళ్ళడానికి వచ్చినట్టుంది (పరమగీతము 8:5 పోల్చిచూడండి). ఇందులో విశ్వాసుల విషయంలో ఆధ్యాత్మిక భావం లేకపోలేదు. ఈ పుస్తకంలోని ప్రత్యేకమైన గుణాల్లో ఒకటి ఏమిటంటే దృశ్యాలు హఠాత్తుగా మారిపోతూ ఉంటాయి. వధువు గొర్రెల కాపరుల పొలాల్లో తన ప్రియుని కోసం వెదుకుతూ ఉంది (పరమగీతము 1:7-8); వరుడు దగ్గరలో ఉన్నాడు (పరమగీతము 1:9-11); వారిద్దరూ రాజనగరులో జంటగా ఉన్నారు (పరమగీతము 1:12-17); హఠాత్తుగా వరుడు కొండల్లో ఉన్నాడు గాని ప్రియసఖి కోసం ఆమె ఇంటికి త్వరత్వరగా వచ్చి పిలుస్తున్నాడు (పరమగీతము 2:8-15); మళ్ళీ అతను కొండల్లో ఉన్నాడు, ఆమె ఒంటరిదైపోయింది (పరమగీతము 2:16-17} పరమగీతము 3:1-3); వారిద్దరూ ఆమె తల్లి ఇంట్లో ఒకటిగా ఉన్నారు (పరమగీతము 3:4-5); ఇప్పుడు వరుడు ఎడారి మార్గాన ఆర్భాటంతో వైభవంతో వస్తున్నాడు. ముందు కూడా ఈ పుస్తకం తీరు ఇలానే ఉంటుంది. అంటే, దీన్లో క్రమబద్ధమైన కథ ఆరంభం, మధ్యం, అంతం అంటూ సాఫీగా సాగదు. వధూవరుల మధ్య ఉన్న సంబంధాన్ని చిత్రీకరించే వివిధమైన సన్నివేశాలు చిన్నచిన్నవి కనిపిస్తాయి. ఇలా రాయడంలో ఉన్న ఆధ్యాత్మిక ఉద్దేశం ఏమిటంటే విశ్వాసులు క్రీస్తులో తమ జీవితంలో చవి చూడవలసిన వివిధమైన అనుభవాలను వివరించడం, క్రీస్తు సౌంధర్యాన్ని, వైభవాన్ని, తన సంఘం కోసం ఆయనకున్న లలితమైన ప్రేమను వెల్లడి చేయడం. ఈ భాగంలో ఆయన మహిమ, బలప్రభావాలను కొంతమట్టుకు చూడగలం (కీర్తనల గ్రంథము 45:3-5 పోల్చిచూడండి). విశ్వాసులు (వారికిది తెలిసివున్నా తెలియకపోయినా) ఈ లోకంలో మహిమ రాజు ప్రక్కన కూర్చునివుండి పరలోక సంబంధమైన పల్లకీలో సాగిపోతున్నారు. రాత్రివేళల్లో అపాయం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ (వ 8) రాజుతో కలిసి వెళ్తున్న ఆయన వధువుకు కట్టుదిట్టమైన భద్రత ఉంది.