వ 5. ఇక్కడ బలప్రభావాలు అంటే దేవుడిచ్చే శక్తిసామర్థ్యాలు. ఇవి అస్వాభావికమైనవి, అమానుషమైనవి, మానవాతీతమైనవి. వారిని ఎదిరించే లోకంలో క్రీస్తు సాక్షులుగా ఉండేందుకూ, తగిన రీతిగా జీవించేందుకూ మాట్లాడేందుకూ సేవ చేసేందుకూ వారికి స్వభావసిద్ధంగా ఉన్న శక్తికంటే ఎక్కువ శక్తి అవసరం. కొత్త జన్మ మూలంగా (యోహాను 3:3, యోహాను 3:5 యోహాను 3:8) వారికి కలిగిన శక్తి కంటే కూడా ఎక్కువ శక్తి అవసరం. ఇప్పటికీ ఇది నిజం.
“సాక్షులై”– అపో. కార్యములు 2:32; అపో. కార్యములు 3:15; అపో. కార్యములు 5:32; అపో. కార్యములు 10:39; అపో. కార్యములు 13:31; లూకా 24:48; యోహాను 15:27. ఈ గ్రంథంలో దీని వేరువేరు రూపాలలో ఈ మాట 39 సార్లు కనబడుతున్నది. తాను చూచినది, లేక విన్నది, లేక అనుభవపూర్వకంగా తెలుసుకొన్నది ఇతరులకు చెప్పేవాడే సాక్షి. క్రీస్తు రాయబారులు యేసు భూమిమీద బతికి, చనిపోయి, లేచి, శరీరంతో పరలోకానికి వెళ్ళాడనే సత్యాలను ప్రకటించారు. ఆ విషయాలను వారు తమ సొంత కళ్ళతో చూశారు (1 యోహాను 1:1-2). యేసు ఉపదేశించినప్పుడు వారు విని అవే సంగతులను ఉపదేశించారు. ఈ వచనం తీసుకొని ఈ గ్రంథాన్ని మూడు భాగాలుగా చేయవచ్చు – జెరుసలంలో సాక్ష్యం (1-7 అధ్యాయాలు), యూదయ, సమరయలలో సాక్ష్యం (8–12 అధ్యాయాలు), లోకంలోని ఇతర ప్రాంతాలలో సాక్ష్యం (13–28 అధ్యాయాలు). ఈ సాక్ష్యం ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పుడు లోకంలో అంతటా ఉన్న దేవుని సేవకులు యేసుకు చెందిన మొదటి శిష్యులు చెప్పిన సాక్ష్యం మూలంగా నేర్చుకొన్న సత్యాలను ప్రకటిస్తూ ఉన్నారు. అంతేగాక క్రీస్తుతో తమ సొంత అనుభవాన్ని గురించి సాక్ష్యం చెప్పగలరు.