పౌలు ఇక్కడ మాట్లాడుతున్న బాప్తిసం ఏమిటి? బాప్తిసం అనేది గ్రీకు భాషలోనుంచి వచ్చిన పదం. ఇక్కడ “బాప్తిసం పొందడం” అని కాకుండా ఆ గ్రీకు పదాన్ని తెలుగులోకి అనువదిస్తే ఇలా ఉంటుంది – “క్రీస్తులోకి ముంచబడిన”, లేక “క్రీస్తులోకి ప్రవేశించిన”, లేక “యేసుక్రీస్తులోకి తీసుకురాబడిన”. మనం “ఆయన మరణంలో ముంచబడ్డామని”, లేక “ఆయన మరణంలో ప్రవేశించామని”, లేక “ఆయన మరణంలోకి తీసుకురాబడ్డామని” అనవచ్చు. ఆ విధంగా ముంచబడడమంటే క్రీస్తులోకి మునగడమని అర్థం గానీ నీటిలోకి కాదు. అలాంటప్పుడు బాప్తిసం క్రీస్తుతో ఐక్యతను సూచిస్తుంది, ఆయనతో ఒక ప్రత్యేక సంబంధంలోకి ప్రవేశించడం, పవిత్రాత్మ మూలంగా ఆయన ఆధ్యాత్మికదేహంలో ఒక అవయవంగా మారడం అని దీని అర్థం (1 కోరింథీయులకు 12:12-13; యోహాను 17:21, యోహాను 17:23). బాప్తిసం అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదం క్రొత్త ఒడంబడికలో ఇతర చోట్ల చిహ్నంగా సాదృశ్య రూపకంగా వాడడం కనిపిస్తుంది. లూకా 12:50; 1 కోరింథీయులకు 10:2 చూడండి.
నీటి బాప్తిసం పౌలు ఇక్కడ చెప్తున్న ఆధ్యాత్మిక వాస్తవ విషయాలకు ఒక చిహ్నంగా సూచనగా మాత్రమే ఉండగలదు. నీటిలోకి వెళ్ళడం క్రీస్తుతో మరణానికీ పాతిపెట్టబడడానికీ సూచన. నీటినుంచి బయటికి రావడం క్రీస్తుతో సజీవంగా తిరిగి లేవడానికి సూచన. నీటి బాప్తిసం గురించిన నోట్స్ కోసం మత్తయి 3:6; మత్తయి 28:19; మార్కు 16:16; అపో. కార్యములు 2:38 చూడండి. పవిత్రాత్మ బాప్తిసం గురించి అపో. కార్యములు 1:5 మొదలైనవి చూడండి.
క్రీస్తులో దేవుడు మనకోసం చేసినదానంతటి ఉద్దేశం మనమొక కొత్త రకం జీవితం గడపాలనే, పాపం మరణాలు అనే బంధకాలనుంచి విడుదల అయిన పునర్జీవిత సంబంధమైన జీవితం మనకు కలగాలనే. 2 కోరింథీయులకు 5:17; తీతుకు 2:11-14 చూడండి.