Philemon - ఫిలేమోనుకు 1

1. క్రీస్తుయేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలే మోనుకును

1. యేసు క్రీస్తు కోసం ఖైదీనైన పౌలును మరియు మన సోదరుడైన తిమోతియు, మా ప్రియ తపనివాడైన ఫిలేమోనుకు,

2. మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది.

2. మరియు మన సోదరి అప్పియకు, మనతో సహా పోరాటం సాగిస్తున్న అర్ఖిప్పుకు, మీ యింట్లో సమావేశమయ్యే సంఘానికి వ్రాస్తున్న సంగతులు:

3. మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

3. మన తండ్రియైన దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని అనుగ్రహించి మీకు శాంతి ప్రసాదించు గాక!

4. నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని

4. కాబట్టి నేను ప్రార్థలను చేసినప్పుడెల్లా నిన్ను జ్ఞాపకం పెట్టుకొని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను.

5. నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనముచేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు,

5. యేసు ప్రభువు పట్ల నీకున్న భక్తిని గురించి, భక్తులపట్ల నీకున్న ప్రేమను గురించి నేను విన్నాను.

6. క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను.

6. క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలనీ, తద్వారా మన విశ్వాసాన్ని నీవు యితరులతో ఉత్సాహంగా పంచుకోగల్గాలనీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

7. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను.

7. సోదరా! నీవు భక్తులకు సహాయం చేసి వాళ్ళను ఆనందపరిచావు. కనుక నీ ప్రేమ నాకు చాలా ఆనందమును, తృప్తిని కల్గించింది.

8. కావున యుక్తమైనదానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను,

8. క్రీస్తు పేరిట నీవు చేయవలసిన కర్తవ్యాలను ఆజ్ఞాపించగల అధికారం నాకున్నా,

9. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరి మంచిదను కొని,

9. [This verse may not be a part of this translation]

10. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు2 ఒనేసిము3 కోసరము నిన్ను వేడుకొనుచున్నాను.

10. నా కుమారునితో సమానమైన ఒనేసిము విషయంలో నిన్ను ఒకటి వేడుకొంటున్నాను. నేను ఖైదీగా ఉన్నప్పుడు అతడు నా కుమారుడయ్యాడు.

11. అతడు మునుపు నీకు నిష్‌ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను.

11. గతంలో అతనివలన నీకు ఉపయోగం లేదు. కాని యిప్పుడు అతనివలన నీకూ, నాకూ, యిద్దరికీ ఉపయోగం ఉంది.

12. నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను.

12. నా గుండెలాంటివాడైన అతణ్ణి తిరిగి నీ దగ్గరకు పంపుతున్నాను.

13. నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని

13. నేను సువార్త కారణంగా ఖైదీగా ఉన్నాను. ఈ సమయంలో నీ స్థానంలో అతడు నాకు సహాయం చేయాలని నా అభిలాష, కనుక అతణ్ణి నా దగ్గరే ఉంచుకోవాలనుకొన్నాను.

14. నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు.

14. కాని నీ అనుమతి లేకుండా నేనిది చేయదలచుకోలేదు. నీవు చేసే ఈ సహాయం నా ఒత్తిడివల్ల కాకుండా నీ యిష్టం ప్రకారం చెయ్యాలని నా ఉద్దేశ్యం.

15. అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడు

15. ఒనేసిము నీ నుండి కొంతకాలం దూరం అయ్యాడు. చిరకాలం నీ దగ్గర ఉండాలని యిలా జరిగిందేమో.

16. గాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహో దరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను.

16. అతడు యిప్పుడు దాసుడు మాత్రమే కాదు. క్రీస్తును నమ్మిన మన ప్రియ సోదరుడు. అతడు నాకు చాలా దగ్గరి వాడు. తోటి మనిషిగా, ప్రభువువల్ల కలిగిన బంధంలో ఒక సోదరునిగా, అతన్ని నీవు యింకా దగ్గరివానిగా భావిస్తావు.

17. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చు కొన్నట్టు అతనిని చేర్చుకొనుము.

17. నీవు నన్ను నీ భాగస్వామిగా భావిస్తూన్నట్లయితే నాకు స్వాగతం చెప్పినట్లే, అతనికి కూడా స్వాగతం చెప్పు.

18. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను, అది నా లెక్కలో చేర్చుము;

18. అతడు నీ పట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేక అతడు నీకు ఏదైనా అప్పు ఉంటే అది నా లెక్కలో వ్రాయి.

19. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల?

19. నేను ఆ అప్పును తీరుస్తానని పౌలు అను నేను నా స్వహస్తంతో వ్రాస్తున్నాను. కాని నీవు నీ జీవితంతో సహా నాకు బాకీ ఉన్నావని చెప్పనవసరం లేదు.

20. అవును సహోదరుడా, ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము.

20. కనుక నా సోదరా! ప్రభువు కోసం దయచేసి నాకీ సహాయం చేయుము. క్రీస్తు కారణంగా మనం సోదరులం కనుక నాకీ తృప్తి కలిగించు.

21. నేను చెప్పినదానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను.

21. నీ విధేయతపై నాకు నమ్మకం ఉంది. నేను అడిగిన దానికన్నా ఎక్కువే చేస్తావని నాకు తెలుసు. అందుకే నీకు వ్రాస్తున్నాను.

22. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము.

22. మరొక విషయం. అతిథుల కోసం ఉంచిన గదిని నా కోసం సిద్ధంగా ఉంచు. నీ ప్రార్థలను విని దేవుడు నన్ను నీ దగ్గరకు పంపుతాడని ఆశిస్తున్నాను.

23. క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా,

23. యేసు క్రీస్తు నిమిత్తం నాతో సహా కారాగారంలో ఉన్న ఎపఫ్రా నీకు వందనాలు తెలుపమన్నాడు.

24. నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు.

24. నాతో పని చేస్తున్న మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా కూడా నీకు వందనాలు తెలుపుతున్నారు.

25. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. అమేన్‌.

25. యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీ ఆత్మకు తోడుగా ఉండుగాక!


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.