John I - 1 యోహాను 1

1. జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.

1. ఏది మొదటినుండి ఉన్నదో, దాన్ని మేము విన్నాము మా కళ్ళారా చూసాము. చూసి మా చేతుల్తో తాకాము. అదే జీవం కలిగించే వాక్యం. దాన్ని గురించే మీకు ప్రకటిస్తున్నాము.

2. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవ మునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.

2. జీవం కనిపించింది. మేము దాన్ని చూసాము. చూసినట్టు సాక్ష్యం కూడా చెపుతున్నాము. ఆ జీవాన్ని గురించి మీకు ప్రకటిస్తున్నాము. ఆ జీవం తండ్రితో ఉంది. అది మాకు కనిపించింది.

3. మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది.

3. తండ్రితో ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు సహవాసం ఉంది కనుక, మీరు కూడా మాతో సహవాసం చెయ్యాలనే ఉద్దేశ్యంతో మేము చూసినదాన్ని, విన్నదాన్ని మీకు ప్రకటిస్తున్నాము.

4. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము.

4. మన ఆనందం సంపూర్ణంగా ఉండాలని యిది మీకు వ్రాస్తున్నాను.

5. మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగాదేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.

5. దేవుడు వెలుగై వున్నాడు. ఆయనలో చీకటి ఏ మాత్రం లేదు. ఈ సందేశాన్ని ఆయన మాకు చెప్పాడు. దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం.

6. ఆయనతోకూడ సహ వాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.

6. మనకు ఆయనతో సహవాసముందని అంటూ చీకట్లో నడిస్తే మనము అసత్యమాడినట్లే కదా! సత్యాన్ని ఆచరించటం మానుకొన్నట్లే కదా!

7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును.
యెషయా 2:5

7. దేవుడు వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగులో నడిస్తే మన మధ్య సహవాసం ఉంటుంది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రక్తం మన పాపాలన్నిటిని కడుగుతుంది.

8. మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు.

8. మనలో పాపం లేదని అంటే, మనల్ని మనము మోసం చేసుకొన్న వాళ్ళమౌతాము. సత్యం మనలో ఉండదు.

9. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
కీర్తనలు 32:5, సామెతలు 28:13

9. మనం చేసిన పాపాన్ని ఒప్పుకొంటే దేవుడు సత్యవంతుడు సక్రమంగా న్యాయం జరిగించే వాడు కనుక మన పాపాల్ని క్షమిస్తాడు. మనలో ఉన్న అవినీతిని కడిగి వేస్తాడు.

10. మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.

10. మనం పాపాలు చెయ్యలేదని అంటే ఆయన్ని మనం అబద్ధమాడుతున్న వానిగా చేసినట్లౌతుంది. ఆయన సందేశానికి మన జీవితాల్లో స్థానం ఉండదు.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2017. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.