Genesis - ఆదికాండము 16 - గ్రంథ విశ్లేషణ

1. అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను.
అపో. కార్యములు 7:5

2. కాగా శారయి ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసి యున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను.

3. కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయు రాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.

4. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను.

5. అప్పుడు శారయినా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటి కిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను.
గలతియులకు 4:22

6. అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా

7. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని

8. శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమాను రాలైన శారయి యొద్దనుండి పారిపోవుచున్నాననెను.

9. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి యుండుమని దానితో చెప్పెను.

10. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.

11. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;
లూకా 1:31

12. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా

13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.

14. అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్‌ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.

15. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను.

16. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు.