Ezra - ఎజ్రా 1

1. పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్య మును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమం దంతట చాటింపుచేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

1. పారశీక రాజ్యానికి కోరెషు రాజైన మొదటి సంవత్సరం , యెహోవా కోరెషును ఒక ప్రకటన చేయవలసిందిగా ప్రోత్సహించాడు. కోరెషు ఆ ప్రకటనను వ్రాయించి, తన రాజ్యపు అన్ని ప్రాంతాలలోనూ చదివి వినిపించే ఏర్పాటు చేశాడు. దేవుడు యిర్మీయా నోట పలికించిన యీ సందేశం వాస్తవ రూపం ధరించేందుకు అనువుగా ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన యిలా సాగింది:

2. పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగాఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశముచేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.

2. “పారశీక రాజు కోరెషు తెలియజేసేది ఏమంటే: పరలోకాధిపతి అయిన యెహోవా దేవుడు భూలోకంలోని దేశాలన్నింటినీ నాకు అప్పగించాడు. యూదా దేశంలోని యెరూషలేములో తనకొక ఆలయాన్ని నిర్మించేందుకుగాను యెహోవా నన్ను ఎంచుకున్నాడు.

3. కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడైయుండునుగాక.

3. యెరూషలేములో వున్న ఇశ్రాయేలీయుల దేవుడే ప్రభువైన యెహోవా. మీ మధ్య దేవుని మనుష్యులు ఎవరైనా వున్నట్లయితే, వారిని ఆశీర్వదించ వలసిందిగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. యూదా దేశంలోని యెరూషలేముకు మీరు వాళ్లని పోనివ్వాలి. మీరు వాళ్లని దేవుని ఆలయాన్ని నిర్మించనివ్వాలి

4. మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆ యా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను.

4. ఇశ్రాయేలీయుల్లో మిగిలివున్నవాళ్లు ఎక్కడైనా ఉన్నట్లయితే, వాళ్లకి అక్కడి ప్రజలు తోడ్పడాలి. ప్రజలు ఆ హతశేషులకు వెంది బంగారాలు, ఆవులు, వగైరాలు ఇవ్వాలి. యెరూషలేములో దేవాలయ నిర్మాణం కోసం వాళ్లకి కానుకలు ఇవ్వాలి.”

5. అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితో కూడుకొని వచ్చి, యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి.

5. యూదా, బెన్యామీను వంశానకు చెందిన కుటుంబాల పెద్దలు యెరూషలేముకు పోయేందుకు సన్నద్ధ మయ్యారు. వాళ్లు యెరూషలోములో దేవాలయ నిర్మాణానికి పోసాగారు. వాళ్లే కాకుండా, దేవుడు ప్రేరేపించిన ప్రతి ఒక్క వ్యక్తి యెరూషలేముకు పోయేందుకు సంసిద్ధుడయ్యాడు.

6. మరియు వారి చుట్టు నున్న వారందరును స్వేచ్ఛగా అర్పించినవి గాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తు వులను ఇచ్చి వారికి సహాయము చేసిరి.

6. వాళ్ల ఇరుగుపొరుగు వారు వాళ్లకి అనేక కానుకలు సమర్పించారు. వెండి బంగారాలు, ఆవులు, ఖరీదైన ఇతర వస్తువులు ఇచ్చారు. ఇరుగు పొరుగువారు వాళ్లకి ఈ కానుకలన్నీ స్వచ్ఛందంగా ఇచ్చారు.

7. మరియు నెబు కద్నెజరు యెరూషలేములోనుండి తీసికొని వచ్చి తన దేవ తలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉప కరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను.

7. పూర్వం నెబుకద్నెజరు యెరూషలేమునందున్న యెహోవా ఆలయానికి చెందిన కొన్ని వస్తువులు కొల్లగొట్టి, వాటిని తన అబద్ధపు దేవతల ఆలయంలో వుంచాడు. వాటిని ఇప్పుడు కోరెషు మహారాజు బయటికి తీయించాడు.

8. పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతుద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను.

8. పారశీక రాజైన కోరెషు ఆ వస్తుపులను బయటికి తీసుకురమ్మని తన ఖజానాదారుని ఆదేశించాడు. ఆ ఖజానాదారుని పేరు మిత్రిదాతు. మిత్రిదాతు ఆ వస్తువులను బయటికి తీయించి, వాటిని యూదా నాయకుడైన షేష్బజ్జరుకు అప్పగించాడు.

9. వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమ్మిది కత్తులును

9. మిత్రిదాతు బయటికి తెచ్చిన దేవాలయ వస్తువుల జాబితా యిది: బంగారు గిన్నెలు30 వెండి గిన్నెలు1,000 చాకులు, పెనాలు29

10. ముప్పది బంగారుగిన్నెలును నాలుగువందలపది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరి యితరమైన ఉపకరణములును వెయ్యియై యుండెను.

10. బంగారు పాత్రలు30 బంగారు పాత్రల వంటివే వెండి పాత్రలు 410 ఇతర పాత్రలు1,000

11. బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగు వందలు. షేష్బజ్జరు బబులోనుచరలోనుండి విడిపింపబడినవారితో కూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.

11. వెండి బంగారాలతో చేసిన వస్తువులు కలసి మొత్తం 5,400 వున్నాయి. బబులోను చెరనుండి విడి పింపబడినవారు యెరూషలేముకు తిరిగి వెళ్లేటప్పుడు, షేష్బజ్జరు పై వస్తువులన్నింటినీ తనతో యెరూషలేముకు తీసుకువెళ్లాడు.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.