Micah - మీకా 1

1. యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూష లేమునుగూర్చియు దర్శనరీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

1. [This verse may not be a part of this translation]

2. సకల జనులారా, ఆలకించుడి, భూమీ, నీవును నీలో నున్న సమస్తమును చెవి యొగ్గి వినుడి; ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు, పరిశుద్దాలయములోనుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.

2. ప్రజాలారా, మీరంతా వినండి! భూమీ, దాని మీదగల ప్రతి ఒక్కడూ, అంతా వినండి! నా ప్రభువైన యెహోవా తన పవిత్ర ఆలయం నుండి వస్తాడు. నా ప్రభువు మీకు వ్యతిరేకంగా ఒక సాక్షిగా వస్తాడు.

3. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమియొక్క ఉన్నతస్థలములమీద నడువబోవుచున్నాడు.

3. చూడండి, దేవుడైన యెహోవా తన స్థానంనుండి బయటకు వస్తున్నాడు. ఆయన భూమీయొక్క ఉన్నత స్థలాలపై నడవటానికి కిందికి వస్తున్నాడు.

4. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగి పోవును, లోయలు విడిపోవును, వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును,

4. దేవుడైన యెహోవా అగ్ని ముందు మైనంలా పర్వతాలు కరిగిపోతాయి. గొప్ప జలాపాతంలా, లోయలు వికలమై కరిగిపోతాయి.

5. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటునుబట్టియు, ఇశ్రాయేలు సంతతివారి పాపములనుబట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతివారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనేగదా; యూదావారి ఉన్నతస్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా?

5. యాకోబు పాపం కారణంగా, ఇశ్రాయేలు ఇంటి వారు చేసిన పాపాల కారణంగా ఇది జరుగుతుంది. యాకోబు పాపానికి కారణం ఏమిటి? దానికి కారణం సమరయ! యూదాలో ఉన్నత స్థలమేది? అది యెరూషలేము!

6. కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్లకుప్పవలె చేసెదను, ద్రాక్షచెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను, దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను;

6. మైదానంలో రాళ్ల గుట్టలా నేను సమరయను మార్చుతాను. అది ద్రాక్షాతోట వేయటానికి అనువైన భూమివలె మారిపోతుంది. సమరయ యొక్క నిర్మాణపు రాళ్లను పెరిగి లోయలో పారవేస్తాను. నేను దాని పునాదులను నాశనం చేస్తాను.

7. దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును, అది పెట్టు కొనిన విగ్రహములను నేను పాడు చేతును, అది వేశ్యయై సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగుదాని జీతముగా మరల ఇయ్యబడును.

7. దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరుగ గొట్టబడతాయి. అది సంపాదించిన ధనం అగ్నికి ఆహుతి అవుతుంది. దానియొక్క బూటకపు దేవుళ్ల విగ్రహాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. ఎందుకంటే, సమరయ నా పట్ల అవిశ్వాసంగా ఉండి అవన్నీ కూడబెట్టింది. కావున ఈ వస్తువులన్నీ నాపట్ల అవిశ్వసంగా ఉన్న ఇతర ప్రజలకు వెళ్లిపోతాయి.

8. దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియు లేకుండ దిగం బరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను.

8. ఈ చెడు విషయంలో నేను కలవరపాటుచెంది, విచారిస్తున్నాను. నేను పాద రక్షలు కూడ లేకుండా, నగ్నంగా బయటకు వెళతాను. నక్కలు ఊళ పెట్టినట్లు నేను అరుస్తాను. నిప్పు కోళ్లలా మూల్గుతాను.

9. దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు తగిలియున్నవి, నా జనుల గుమ్మములవరకు యెరూషలేము వరకు అవి వచ్చియున్నవి.

9. ఎందుకనగా సమరయ గాయం మాన్పరానిది. ఆమె గాయం (పాపం) యూదాకు వ్యాపించింది. అది నా ప్రజల నగర ద్వార వద్దకు చేరింది. అది చివరకు యెరూషలేము వరకు వచ్చింది.

10. గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు; అచ్చట ఎంత మాత్రమును ఏడ్వవద్దు; బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని.

10. ఇది గాతులో చెప్పవద్దు. అక్కడ ఏడ్వవద్దు. బేత్‌యఫ్రలో విలపించి, దుమ్ములో పొర్లాడు.

11. షాఫీరు నివాసీ, దిగంబరివై అవమానమునొంది వెళ్లిపొమ్ము; జయ నానువారు బయలుదేరక నిలిచిరి, ప్రలాపము బేతేజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది.

11. షాఫీరులో నివసించేవాడు, దిగంబరివై, సిగ్గుతో నీ దారిన నీవు పోమ్ము. జయనానులో నివసించేవాడు బయటకు వెళ్లడు. బేతేజెలులో ఉన్నావారు విలపిస్తారు. దానికి కావలసిన ఆసరా మీ నుండి తీసుకొంటుంది.

12. మారోతువారు తాము పోగొట్టుకొనిన మేలునుబట్టి బాధ నొందుచున్నారు ఏల యనగా యెహోవా యొద్దనుండి కీడు దిగి యెరూషలేము పట్టణద్వారము మట్టుకువచ్చెను.

12. మారోతులో నివసించేవాడు మంచివార్త కోసం ఎదురు చూస్తూ నీరసించిపోయాడు. ఎందుకంటే యెహోవానుండి ఆపద యెరూషలేము నగర ద్వారంవరకు వచ్చింది.

13. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుఱ్ఱములను కట్టుడి; ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమకారణముగా ఉండును.

13. లాకీషులో నివసిస్తున్న ఓ స్త్రీ, రథాన్ని వేగముగల గుర్రానికి తగిలించు. సీయోను పాపాలు లాకీషులో మొదలైనాయి. ఎందుకంటే నీవు ఇశ్రాయేలు పాపాలనే అనుసరించావు.

14. మోరెషెత్గతు విషయములో మీరు విడు దలకైకోలు ఇయ్యవలసివచ్చును, అక్జీబు ఇండ్లు ఇశ్రా యేలు రాజును మోసపుచ్చునవై యుండును.

14. కావున గాతులోని మోరెషెతుకు మీరువీడ్కోలు బహుమతులు ఇవ్వాలి. అక్జీబులోని ఇండ్లు ఇశ్రాయేలు రాజులను మోసపుచ్చుతాయి.

15. మారేషా నివాసీ, నీకు హక్కు దారుడగు ఒకని నీయొద్దకు తోడుకొని వత్తురు, ఇశ్రాయేలీయులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు.

15. మారేషా నివాసులారా, మీ మీదికి నేనోక వ్యక్తిని తీసుకొని వస్తాను, మీకున్న వస్తువులన్నీ ఆ వ్యక్తి తీసుకుంటాడు. ఇశ్రాయేలు మహిమ (దేవుడు) అదుల్లాములో ప్రవేశిస్తుంది.

16. సీయోనూ, నీకు ప్రియులగువారు నీయొద్ద నుండకుండ పట్టబడియున్నారు; నీ తల బోడిచేసికొనుము, బోరుచగద్దవలె నీ బోడితనము కనుపరచుకొనుము.

16. కావున మీ తలలు గొరిగించి, బోడిగా చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రేమించే పిల్లలకొరకుమీరు దుఃఖిస్తారు. రాబందులారా మీ తలలు బోడి చేసుకోండి. ఎందుకంటే మీ పిల్లలు మీకు దూరమవుతారు. వారు బలవంతంగా ఇండ్లు వదిలి పోయేలా చేయబడతారు.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.