Timothy II - 2 తిమోతికి 1

1. క్రీస్తు యేసునందున్న జీవమునుగూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయు నది.

1. పౌలు నుండి నా ప్రియమైన కుమారుడు తిమోతికి వ్రాయడమేమనగా మన తండ్రియైన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి నీకు కృప, దయ, శాంతి లభించుగాక!

2. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసునుండియు కృపయు కనికరమును సమాధాన మును కలుగును గాక.

2. నేను దైవేచ్ఛానుసారం యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను. దేవుడు వాగ్దానము చేసిన అనంతజీవితము యేసు క్రీస్తు వలన సంభవిస్తుంది. దాని కారణముగా నేను అపొస్తలుడనయ్యాను.

3. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నీ కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణా నందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు,

3. నేను నిష్కల్మష హృదయంతో నా పూర్వీకుల దేవునికి సేవచేస్తూ కృతజ్ఞుడనై యున్నాను. రాత్రింబగళ్ళు నిన్ను జ్ఞాపకము పెట్టుకొని నీ కోసం ప్రార్థిస్తూ ఉంటాను.

4. నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచారప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞు డనై యున్నాను.

4. నీలాంటి వాణ్ణి నాకు యిచ్చినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞుణ్ణి. నీ కన్నీళ్ళు జ్ఞాపకం వస్తున్నాయి. నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూసాక నా మనస్సు ఆనందంతో నిండిపోతుంది.

5. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ము చున్నాను.

5. నీలో ఉన్న నిజమైన విశ్వాసం నాకు జ్ఞాపకము ఉంది. అటువంటి విశ్వాసం మీ అమ్మమ్మ లోయిలోనూ ఉండేది. నీ తల్లి యునీకేలో కూడా ఉండేది. నీలో కూడా అలాంటిది ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.

6. ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణమువలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను.

6. అందుకోసం, నా చేతులు నీ తలపై ఉంచడం వల్ల నీకు దేవుడు యిచ్చిన వరాన్ని ఉపయోగిస్తూ ఉండుమని నీకు జ్ఞాపకం చేస్తున్నాను.

7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.

7. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, స్వయం క్రమశిక్షణ గల ఆత్మనిచ్చాడు.

8. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము.

8. కనుక ప్రభువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు గాని, అతని ఖైదీనైన నా విషయము చెప్పవలసి వచ్చినప్పుడు గాని సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించి, సువార్త కోసం నాతో కలిసి కష్టాలు అనుభవించుము.

9. మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు,

9. దేవుడు మనల్ని రక్షించి తన ప్రజలుగా మాత్రమే ఉండటానికి పిలిచాడు. మనము చేసిన పనులను బట్టి ఆయన ఇలా చేయలేదు. కాని ఇది కేవలం ఆయన అనుగ్రహం వల్ల, ఆయన ఉద్దేశానుసారం చేసాడు. దేవుడు కాలానికి ముందే యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించాడు.

10. క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.

10. కాని ఇప్పుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వచ్చి దాన్ని మనకు వ్యక్తము చేసాడు. ఈయన తన సువార్త ద్వారా మరణాన్ని నిర్మూలించి అనంత జీవితాన్ని, అమరత్వాన్ని వెలుగులోకి తెచ్చాడు.

11. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను, నియమింపబడి తిని.

11. ఈ సువార్తను ప్రకటించటానికి, నన్ను వార్తాహరునిగానూ, అపొస్తలునిగానూ, ఉపాధ్యాయునిగానూ నియమించాడు.

12. ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని రాబోవు చున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.

12. ఆ కారణంగా నేను ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాను. అందుకు నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను విశ్వసించిన వాణ్ణి గురించి నాకు బాగా తెలుసు. ఆ రానున్న రోజు దాకా ఆయన నాకు అప్పగించిన దాన్ని, కాపాడుతాడని నాకు విశ్వాసం ఉంది.

13. క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము;

13. నేను నీకు బోధించిన ఉపదేశాలను ఆదర్శంగా పెట్టుకో. యేసు క్రీస్తులో వాటిని విశ్వాసంతో, ప్రేమతో వాటిని మార్గదర్శంగా ఉంచుకో.

14. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుము.

14. దేవుడు దాచమని నీకు అప్పగించిన గొప్ప సత్యాన్ని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయముతో కాపాడు.

15. ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువా రున్నారు.

15. ఆసియ ప్రాంతములో ఉన్న వాళ్ళంతా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపొయ్యారని నీకు తెలుసు. ‘పుగెల్లు’ ‘హెర్మొగెనే’ కూడా నన్ను వదిలి వెళ్ళిపొయ్యారు.

16. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక.

16. నా చేతికి సంకెళ్ళు ఉన్నాయని సంకోచించక ‘ఒనేసిఫోరు’ ఎన్నోసార్లు వచ్చాడు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. అతని కుటుంబాన్ని దేవుడు కాపాడు గాక!

17. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను.

17. అంతేకాక అతడు రోములో ఉన్నప్పుడు నేను కనిపించేవరకు నా కోసం కష్టపడి వెతికాడు.

18. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారముచేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువువలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక.

18. ఆ ‘రానున్న రోజున’ కనికరము పొందేటట్లు ప్రభువు అతనికి కృప అనుగ్రహించుగాక! నేను ఎఫెసులో ఉన్నప్పుడు అతడు నాకు ఎన్ని విధాల సహాయం చేసాడో నీకు బాగా తెలుసు.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.