Titus - తీతుకు 1

1. దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును,

1. దేవుని సేవకుడును, యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడయినటువంటి పౌలు నుండి, దేవుడు తానెన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని ధృఢపరచడానికి, వాళ్ళను భక్తి కల్గించే మన సత్యం వైపు మళ్ళించటానికి నన్ను ఎన్నుకొన్నాడు.

2. నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో

2. ఈ సత్యం, అనంత జీవితం లభిస్తుందని విశ్వసించటంపై ఆధారపడి ఉంది. అబద్ధం ఆడని దేవుడు మనకీ జీవితం యిస్తానని కాలానికి ముందే వాగ్దానం చేసాడు.

3. నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకా రము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటనవలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను

3. సరియైన సమయానికి దాన్ని తన సందేశం ద్వారా మనకు తెలియచేసాడు. ఈ సందేశం నాకప్పగింపబడింది. మన రక్షకుడైనటువంటి దేవుడు దాన్ని మీకు ప్రకటించుమని ఆజ్ఞాపించాడు. కనుక దాన్ని మీకు ప్రకటిస్తున్నాను.

4. తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.

4. మనలో ఉన్న విశ్వాసం మూలంగా నా ప్రియ కుమారునిగా భావిస్తున్న తీతుకు వ్రాయుటమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన రక్షకుడైన యేసు క్రీస్తునుండి నీకు శాంతి, కృప లభించుగాక!

5. నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియ మించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.

5. అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి చేయటానికి, నేను ఆదేశించిన విధంగా ప్రతి పట్టణంలో పెద్దలను నియమించటానికి నిన్ను క్రేతులో వదిలి వచ్చాను.

6. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధే యులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును.

6. క్రీస్తు సంఘంలోయున్న అధ్యక్షుడు నిందారహితుడై, ఏకపత్నీ వ్రతుడై ఉండాలి. తన పిల్లలు అవిధేయతగా ఉండక అవినీతిగా ఉండక చెడ్డపేరు లేకుండా విశ్వసించిన వాళ్ళుగా ఉండాలి.

7. ఎందు కనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందా రహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక,

7. సంఘాధ్యక్షుడు దైవకార్యాన్ని నడిపించే బాధ్యత కలవాడు కనుక అతడు నిందారహితుడై ఉండాలి. అతనిలో గర్వము ఉండరాదు. ముక్కోపి కాకూడదు. త్రాగుబోతు కాకూడదు. పోట్లాడరాదు. అధర్మంగా లాభాలు సంపాదించ రాదు.

8. అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవి త్రుడును, ఆశానిగ్రహముగలవాడునై యుండి,

8. అతిథులను పరామర్శించే వాడైయుండాలి. మంచి పనులు చెయ్యాలి. మనో నిగ్రహం, నీతి, పవిత్రత, క్రమశిక్షణ మొదలగు గుణాలు అతనిలో ఉండాలి.

9. తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదు రాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.

9. తనకు బోధింపబడిన సందేశాన్ని విశ్వాసంతో ఆచరించాలి. అప్పుడే యితరులకు ఈ గొప్ప సత్యాన్ని చెప్పి వాళ్ళను కూడా ప్రోత్సాహపరచగలడు. ఈ సందేశాన్ని అంగీకరించని వాళ్ళకు వాళ్ళు చేస్తున్న తప్పు చూపగలడు.

10. అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు.

10. తాము అవిధేయతగా ఉంటూ, అధికంగా మాట్లాడి నమ్మించాలని ప్రయత్నించే మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సున్నతి అవసరమని వాదించే యూదులు ఈ విధంగా చేస్తున్నారు.

11. వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభముకొరకు ఉప దేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయు చున్నారు.

11. అన్యాయంగా లాభం గడించటానికి బోధించరాని విషయాలు బోధించి కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళను ఆపటం అవసరం.

12. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెనుక్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండి పోతులునై యున్నారు.

12. “క్రేతీయులు అబద్ధాలాడుతున్నారనీ, క్రూర మృగాల్లాంటి వాళ్ళనీ, సోమరిపోతులనీ, తిండి పోతులనీ” క్రేతీయులలో ప్రవక్త ఒకడు అన్నాడు.

13. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక,

13. ఈ సాక్ష్యము నిజము. వాళ్ళను గట్టిగా వారించటం అవసరం. అలా చేస్తే, వాళ్ళ విశ్వాసం ధృఢమౌతుంది.

14. విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.

14. అప్పుడు వాళ్ళు యూదుల కల్పిత కథలను మరిచిపోయి, మన సత్యాన్ని నిరాకరించే వాళ్ళ బోధలను లెక్క చెయ్యరు.

15. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వా సులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి.

15. పవిత్రంగా ఉన్నవాళ్ళకు అన్నీ పవిత్రంగా కనిపిస్తాయి. కాని దుష్టులకు, విశ్వాసం లేని వాళ్ళకు ఏదీ పవిత్రంగా కనిపించదు. వాళ్ళ బుద్ధులు, మనస్సులు చెడుతో నిండి ఉంటాయి.

16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.

16. వాళ్ళు తమకు దేవుని గురించి తెలుసునంటారు కాని, వాళ్ళ ప్రవర్తన ఆ దేవుణ్ణి నిరాకరిస్తున్నట్లు చూపిస్తుంది. వాళ్ళు ద్వేషంతో, అవిధేయతతో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి పని చేయటానికి అంగీకరించరు.


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.