Hebrews - హెబ్రీయులకు 4 - గ్రంథ విశ్లేషణ

1. ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.
కీర్తనలు 95:11

దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అనేది ఈ భాగంలోని అంశం – వ 1. క్రీస్తు విశ్వాసులు అందులో ప్రవేశిస్తారు. కానీ నమ్మకం లేని ఇస్రాయేల్ అలా ప్రవేశించలేదు – వ 2,3. ఈ విశ్రాంతి ఇస్రాయేల్‌వారి కాలంలో ఉంది, దానిలో వారు ప్రవేశించే అవకాశం ఉంది – వ 4-6. అయితే వారలా చేరలేదు గనుక, కొందరు అందులో చేరాలని దేవుని ఉద్దేశం గనుక, దేవుడు మరో దినాన్నీ సమయాన్నీ నియమించాడు – వ 6-8. చివరికి తేలినది: ఇప్పుడు మనుషులు ప్రవేశించగల విశ్రాంతి ఉంది – వ 9,10. హెచ్చరిక: అందులో ప్రవేశించేందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేయాలి – వ 11, ఎందుకంటే అవిశ్వాసిని దేవుని వాక్కు కనిపెట్టి ప్రవేశించనీయ కుండా అడ్డగించగలదు – వ 12,13. “ఆయన విశ్రాంతి”– అంటే ఆధ్యాత్మిక విశ్రాంతి, మత్తయి 11:28 లో యేసు చెప్పిన విశ్రాంతి. ఇది క్రీస్తులో రక్షణను సూచిస్తున్నది. కనాను దేశం ఈ విశ్రాంతికి చిహ్నం లేక సాదృశ్యం మాత్రమే (యెహోషువ 1:18 నోట్‌). “మీలో ఎవరైనా”– “మనలో ఎవరైనా” అనడం లేదు రచయిత. విశ్వాసులు తమకు పాపవిముక్తి, రక్షణ ఉందో లేదో తెలుసుకోలేరని రచయిత చెప్పడం లేదు. తాము చివరికి నాశనం అవుతామేమోనన్న భయంతోనే జీవితం గడపాలని చెప్పడం లేదు (హెబ్రీయులకు 2:15; లూకా 12:32; రోమీయులకు 8:15; 1 యోహాను 5:13 చూడండి). రచయిత తన రక్షణ గురించి భయపడడం లేదు గానీ హీబ్రూవారిలో కొందరి రక్షణ గురించి భయపడుతున్నాడు. క్రైస్తవులమని చెప్పుకునేవారు అపనమ్మకం, అవిధేయత సూచనలు కనపరిస్తే మనందరం కంగారు పడవలసిందే. వారిని హెచ్చరించి ప్రోత్సహించడంలో జాగ్రత్త వహించాలి కూడా – హెబ్రీయులకు 3:13; 1 తిమోతికి 5:20.

2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసముగలవారై కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్‌ప్రయోజనమైనదాయెను.

ఇస్రాయేల్‌కు ప్రకటించిన శుభవార్త ఇది: వాగ్దాన దేశం మీ ముందు ఉంది. వెళ్ళి స్వాధీనం చేసుకోండి – ద్వితియోపదేశకాండము 1:19-21. మనుషులకు ఇప్పుడు ప్రకటిస్తున్న శుభవార్త ఇది: దేవుడు క్రీస్తులో విశ్రాంతినీ పాపవిముక్తినీ రక్షణనూ అందిస్తున్నాడు. ఆయనలో నమ్మకం ద్వారా దాన్ని స్వీకరించండి. ఇస్రాయేల్‌ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఈ విధంగా వారు తమ అపనమ్మకాన్నీ అవిధేయతనూ ప్రదర్శించారు. ఇప్పుడు మనుషులు క్రీస్తును స్వీకరించకుండా, ఆయనలోని దేవుని దీవెనలను స్వంతం చేసుకోకుండా ఉండడం ద్వారా తమ అపనమ్మకాన్ని బయటపెట్టుకుంటున్నారు. శుభవార్తను వినడం మాత్రమే సరిపోదు. వినడంలో విశ్వాసాన్ని జోడించాలి. విశ్వాసం విధేయతను పుట్టించాలి.

3. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యము లన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చినేను కోపముతో ప్రమాణముచేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము.

దేవుడు కీర్తనలు 95:11 లో చెప్పిన విశ్రాంతిలో ప్రవేశించే మార్గం ఒకటే – అది క్రీస్తులో నమ్మకం ఉంచడం.

4. మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పి యున్నాడు.
ఆదికాండము 2:2

రచయిత ఆదికాండము 2:2; కీర్తనలు 95:11 లను (మరో సారి) ఉదహరించడం ద్వారా దేవుని విశ్రాంతి ఒకటి ఉందనీ, సృష్టి పూర్తి అయినప్పటినుంచీ అది ఉందనీ తెలియజేస్తున్నాడు. దేవుడు విశ్వాసులకు ఇచ్చే ఆధ్యాత్మిక విశ్రాంతికి ఈ విశ్రాంతి సూచన, దృష్టాంతం.

5. ఇదియునుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు.

6. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించు దురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినినవారు అవిధేయతచేత ప్రవేశింపలేదు గనుకను,

మనుషుల్లో కొందరు తన విశ్రాంతిలో ప్రవేశించాలని దేవుని ఉద్దేశం. ఆ విశ్రాంతికి సూచనగా ఉన్న కనానులో ఇస్రాయేల్ ప్రజలు చేరుకున్న తరువాత కూడా ఆ విశ్రాంతిలో చేరలేదు. యెహోషువ ద్వారా దేవుడు వారికి శత్రువులనుంచి నెమ్మది ఇచ్చాడు (యెహోషువ 21:44; యెహోషువ 22:4), గానీ ఆధ్యాత్మిక విశ్రాంతి ఇవ్వలేదు. కాబట్టి దేవుడొక కొత్త సమయాన్ని నియమించి దాన్ని “ఈ రోజు” అన్నాడు. “ఈ రోజు” అంటే క్రీస్తు మొదటిసారి వచ్చిన సమయంతో ఆరంభమైన ఈ శకమంతా. హెబ్రీయులకు 3:7 చూడండి. యెహోషువ గానీ మోషే గానీ ధర్మశాస్త్రం గానీ పాత ఒడంబడిక మొత్తం గానీ దేవుడు ఆ ప్రజలకు కలగాలని కోరిన విశ్రాంతిని కలిగించలేకపోయింది. కాబట్టి దేవుడు మరో సమయాన్నీ మరో ఒడంబడికనూ నియమించాడు.

7. నేడు మీ రాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములోనేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు.
కీర్తనలు 95:7-8

8. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును.
ద్వితియోపదేశకాండము 31:7, యెహోషువ 22:4

9. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.

“విశ్రాంతి”– యూదులు విశ్రాంతి దినాన్ని రాబోయే లోకానికి ఒక సాదృశ్యంగా ఎంచారు – “ఇస్రాయేల్‌వారు అన్నారు ‘లోకనాథుడైన ప్రభూ, రాబోయే లోకం నమూనా మాకు చూపించు’; అందుకు దేవుడు ‘విశ్రాంతి దినమే ఆ నమూనా’ అని జవాబిచ్చాడు” (ఒక యూదా వ్యాఖ్యానంలో కనిపించే మాటలు). 92వ కీర్తన “రాబోయే లోకం గురించి చెప్తున్నది. ఆ లోకం అంతా విశ్రాంతి దినమే, శాశ్వత జీవం గురించిన విశ్రాంతే గనుక ఆ కీర్తనను విశ్రాంతి దినం కోసం కీర్తన” అని వారు అన్నారు. ఈ లేఖ రచయిత ఇక్కడ అదే ఉపదేశాన్ని చేస్తున్నట్టుంది.

10. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.
ఆదికాండము 2:2

విశ్వాసులు దేవుని విశ్రాంతిలోకి ఎప్పుడు ప్రవేశిస్తారు? ఈ లోకంలో వారి జీవితం అంతమైన తరువాత సంపూర్ణంగా ప్రవేశిస్తారని నిస్సందేహమే. అప్పుడు వారు తమ ప్రయాస అంతా ముగించి దేవుని సన్నిధిలో విశ్రమిస్తారు. ప్రకటన గ్రంథం 14:13; 2 కోరింథీయులకు 5:8; ఫిలిప్పీయులకు 1:21-24 పోల్చి చూడండి. కానీ ఒక విధంగా చూస్తే వారు ఇప్పుడే కొంతవరకు ఆ విశ్రాంతిలో ఉన్నారు – మత్తయి 11:28-29. ఇప్పటి విశ్రాంతి అంతిమ విశ్రాంతి కాదు. దానికి తొలిరుచి మాత్రమే. దీని అర్థం స్వంత పనుల ద్వారా పాపవిముక్తి, రక్షణ సంపాదించుకునే ప్రయత్నాలను మానుకుని రక్షణ కోసం క్రీస్తు పైనే నమ్మకం ఉంచడమే (రోమీయులకు 4:4-5 చూడండి). ఆ విశ్రాంతి ఇప్పుడే మొదలై దేవుని సన్నిధిలో లోపం లేని విశ్రాంతితో అంతం అవుతుంది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ విశ్రాంతిని క్రీస్తులో అనుభవించడం ప్రారంభించకపోతే, రాబోయే లోకంలో శాశ్వత విశ్రాంతి మనకు దొరకదని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.

11. కాబట్టి అవిధే యతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.

మత్తయి 11:12; లూకా 13:24; 2 కోరింథీయులకు 13:5; 2 పేతురు 1:10. మనలో మన సాటి క్రైస్తవుల్లో అపనమ్మకం, అవిధేయత ఏమైనా ఉన్నాయేమో అని జాగ్రత్తగా చూచుకుంటూ విశ్వాసంతో గమ్యం వైపుకు సాగిపోవాలి. ఇప్పుడు క్రీస్తు వాగ్దానం చేసిన విశ్రాంతి మనకు ఉందని ఖాయం చేసుకుని, ఆయన కాడి నెత్తుకుని ఆయనతో ముందుకు సాగిపోవడం ద్వారా అంతిమ విశ్రాంతిలో ప్రవేశించగలమనే నిశ్చయత కలిగి ఉందాం.

12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.
యెషయా 49:2

“నమ్మకం లేని చెడ్డ హృదయం”, పాపం మూలంగా బండబారిపోయిన హృదయం (హెబ్రీయులకు 3:12-13) దేవుని కంటబడకుండా దాక్కోవడం అసాధ్యం అని రచయిత చెప్తున్నాడు. దేవుని వాక్కు అంతరంగాన్ని బట్టబయలు చేస్తుంది. తన వాక్కును ఇచ్చిన దేవునికి ఎవర్ని తన విశ్రాంతిలో రానియ్యాలో ఎవరిని బయట ఉంచాలో బాగా తెలుసు. “జీవం...బలప్రభావాలు గలది”– 1 పేతురు 1:23. “ఖడ్గం”– ఎఫెసీయులకు 6:17; యిర్మియా 23:29 పోల్చి చూడండి.

13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.

14. ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.

రచయిత హెబ్రీయులకు 2:17 లో పరిచయం చేసిన అంశానికే తిరిగి వస్తున్నాడు – క్రీస్తు ప్రముఖ యాజి. ప్రోత్సాహ వాక్కులు, హెచ్చరికలతో కలిపి ఈ అంశాన్ని గురించిన చర్చను హెబ్రీయులకు 10:18 దాకా కొనసాగిస్తున్నాడు. “అయితే”– హెబ్రీయులకు 3:1; హెబ్రీయులకు 4:1. మనం దేవుని సత్యాన్ని మన జీవితాలలో ఆచరణ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ సత్యాన్ని ఇస్తాడు. “గొప్ప ప్రముఖయాజి”– లోకమంతటా మనుషులు తమకు ఒక యాజి అవసరమని, అంటే తమకన్నా దేవునికి మరింత సన్నిహితంగా ఉండి దేవుని ఎదుట తమకు ప్రతినిధిగా ఉండగల వ్యక్తి అవసరమని అనుకుంటున్నట్టు కనిపిస్తున్నది. ఈ భూమిపై దాదాపు ప్రతి మతంలోనూ ఈ భావన కనిపిస్తుంది. క్రీస్తు రాకముందు సుమారు 1400 సంవత్సరాలుగా యూదులకు యాజులు, ఒక ప్రముఖ యాజి కూడా ఉన్నారు. కానీ క్రీస్తును అనుసరించేవారికి కంటికి కనిపించే ప్రముఖయాజి ఎవరూ లేరు. వారికి ఈ భూమిపై అలాంటి ప్రముఖయాజి ఎవరూ కనబడడం లేదు కాబట్టి వారికసలు ఎవరూ లేరని క్రీస్తుపై నమ్మకం ఉంచని యూదులు అనుకుని ఉండవచ్చు. ఈ తప్పు అభిప్రాయాన్ని ఈ లేఖ రచయిత ఖండిస్తున్నాడు. క్రీస్తుకు చెందిన విశ్వాసులకు సాధ్యమైనంత గొప్ప ప్రముఖయాజి ఉన్నాడు – ఆయన సాక్షాత్తూ దేవుని కుమారుడే. ఆయన ఈ భూమిపై లేని సంగతి, కంటికి కనిపించని సంగతి వల్ల ఎలాంటి లోటూ లేదు, సరిగదా ఇది ప్రయోజనకరం. ఎందుకంటే ఆయన ఆకాశాల గుండా ఎక్కిపోయి ఉన్నత స్థలంలో ఉన్న దేవుని సన్నిధికి చేరి అక్కడ ఉన్నాడు. అక్కడ భూమిపై ఉన్న ఏ ప్రముఖ యాజి చేయగలిగినదాని కన్నా ఉత్తమమైన రీతిలో ఆయన తన ప్రజలకు ప్రతినిధిగా ఉండగలడు. ఈ సత్యం తెలియకపోవడం మనుషులను అంతటా మానవ యాజి వ్యవస్థలకూ మతాలకూ బానిసలుగా ఉంచేస్తుంది. అందువల్ల యేసును ప్రముఖయాజిగా చూపించేందుకూ, తన పని చేయడానికి ఆయన ఎంతగా తగినవాడో వివరించేందుకూ రచయిత చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు.

15. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

“మన బలహీనతలు”– మనందరిలో కావలసిన దానికన్నా ఎక్కువే ఉన్నాయి ఇవి. మత్తయి 26:41; రోమీయులకు 7:18; రోమీయులకు 8:26; 1 కోరింథీయులకు 2:3; 2 కోరింథీయులకు 12:5, 2 కోరింథీయులకు 12:9; గలతియులకు 5:17 చూడండి. “సానుభూతి”– దేవుడు తన ప్రజలైన ఇస్రాయేల్‌వారికి యాజి వ్యవస్థను స్థాపించిన కారణం ఇదే. ప్రజల బలహీనతలు, చింతలు, దుఃఖాలు, బాధలు, అవసరతలు ఎరిగి ఉండి వాటిని సానుభూతి పూర్వకంగా దేవునికి విన్నవించగలవాడే సరైన యాజి – హెబ్రీయులకు 5:1-2. నిర్గామకాండము 28:29 పోల్చి చూడండి. ఇస్రాయేల్‌లో గానీ మరెక్కడా గానీ ఎప్పుడైనా ఉన్న యాజులందరి కన్నా, యేసుప్రభువు దీన్ని మరింత బాగా చేయగలడు. “విషమ పరీక్షలకు గురి అయ్యాడు”– హెబ్రీయులకు 2:18; మత్తయి 4:1-10. అందువల్ల మనపట్ల సానుభూతి చూపగలడు. భూమిపై మనుషులకు వచ్చే విషమ పరీక్షలన్నిటికీ యేసు గురయ్యాడు. ఆయనకు నిజమైన రక్తమాంసాలు, నిజమైన మానవ స్వభావం ఉన్నాయి – హెబ్రీయులకు 2:14. దేవునికి చెందిన వారందరికీ వ్యతిరేకంగా సైతాను ఎంత రెచ్చిపోతాడో ఆయనకు అనుభవపూర్వకంగా తెలుసు. మనకూ మన నమ్మకానికీ విరుద్ధంగా సైతాను దుర్మార్గత ఎంత బలవంతంగా ప్రయోగిస్తాడో ఆయనకు తెలుసు. సైతాను ప్రయోగించగలిగే ప్రతి అగ్నిబాణం వల్ల ఆయనకు బాధ కలిగింది. అయినప్పటికీ “ఆయన పాపం లేనివాడు”, అంటే ఆయనెప్పుడూ పాపం చెయ్యలేదనీ ప్రతి సారీ కూడా విషమ పరీక్షనుంచి విజయవంతంగా బయటికి వచ్చాడనీ అర్థం కావచ్చు. లేక ఆయనలో భ్రష్ట స్వభావం లేదు అని అర్థం కావచ్చు. ఈ రెండూ కూడా నిజమే (హెబ్రీయులకు 2:17 నోట్ చూడండి). భ్రష్ట స్వభావం లేకపోతే విషమ పరీక్షకు గురి కావడం సాధ్యమేనా? సాధ్యమే. ఆదికాండము 3:1-6 చూడండి. 2 పేతురు 2:4; యూదా 1:6 కూడా చూడండి. నిజానికి భ్రష్ట స్వభావం లేని వ్యక్తి, విషమ పరీక్షలకు లొంగని వ్యక్తి, త్వరగా లొంగిపోయే పాపికన్న మరెక్కువగా విషమ పరీక్షల బలప్రభావాలను అనుభవిస్తాడని అనుకోవచ్చు.

16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.

“కృప సింహాసనం”– విశ్వాన్ని ఏలేందుకు దేవుడు ఆసీనుడై ఉండే సింహాసనం. మన గొప్ప ప్రముఖయాజి అయిన క్రీస్తు అక్కడ ఆయన పక్కన కూచుని ఉన్నాడు – హెబ్రీయులకు 1:3; ప్రకటన గ్రంథం 3:21. మన పాపాలకోసం ఆయన చేసిన బలి అర్పణ కారణంగా ఇప్పుడు కృప రాజ్యమేలుతున్నది. రోమీయులకు 5:21 చూడండి. మనకు అవసరమైన వాటన్నిటికోసం దేవుని చెంతకు రమ్మని ఆయనే మనల్ని ప్రోత్సహిస్తున్నాడు – మత్తయి 6:9-13; మత్తయి 7:7-10; యోహాను 16:23-24. మనకు అన్నిటికన్నా ముఖ్యంగా అవసరమైనవి కరుణ, కృప. పాపం చేయకుండా భద్రత మనకు కావాలి, ఒకవేళ పాపం చేస్తే క్షమాపణ కావాలి. మనం విశ్వాన్ని ఏలే సింహాసనం దగ్గరికి వస్తున్నాం కాబట్టి ఉనికిలో ఉన్న ఏ శక్తి కూడా మనకు అవసరమైనవి ఇవ్వకుండా దేవుణ్ణి అడ్డగించడం అసాధ్యం. అది కృప సింహాసనం గనుక మనకు అవసరమైనది ఇవ్వడం ఆయనకు ఇష్టమేనని మనకు తెలుసు (ఫిలిప్పీయులకు 4:19 పోల్చి చూడండి). మనకు నిబ్బరం కలిగించి, అవసరం సమయంలో ఆయన ఎదుటికి వచ్చే ధైర్యం ఇచ్చేందుకు ఇంతకన్నా వేరే సత్యం మనకేది కావాలి?