Genesis - ఆదికాండము 45 | View All

1. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్ను తాను అణచుకొనజాలక నా యొద్దనుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియ చేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు.
అపో. కార్యములు 7:13

1. యోసేపు ఇంకెంతమాత్రం తనను తాను ఓర్చుకోలేక పోయాడు. అక్కడున్న ప్రజలందరి ముందు అతడు గట్టిగా ఏడ్చేసాడు. “అందర్నీ ఇక్కడనుండి వెళ్లిపొమ్మనండి” అన్నాడు యోసేపు. అందుచేత అందరూ అక్కడనుండి వెళ్లిపోయారు. ఆ సోదరులు మాత్రమే యోసేపు దగ్గర ఉన్నారు. అప్పుడు యోసేపు తాను ఎవరయిందీ వారితో చెప్పేసాడు.

2. అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారును వినిరి.

2. యోసేపు ఇంకా ఏడుస్తూనే ఉన్నందుచేత, ఫరో ఇంటిలో ఉన్న ఈజిప్టు ప్రజలంతా అది విన్నారు.

3. అప్పుడు యోసేపునేను యోసే పును; నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగి నప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయిరి.
అపో. కార్యములు 7:13

3. యోసేపు తన సోదరులతో “మీ సోదరుడు యోసేపును నేనే, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా?” అన్నాడు. కాని ఆ సోదరులు నోటమాట రాలేదు. వారు భయంతో కలవరపడిపోయారు.

4. అంతట యోసేపునా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడుఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు
అపో. కార్యములు 7:9

4. కనుక యోసేపు మళ్లీ తన సోదరులతో, “నా దగ్గరకు రండి. ఇలా నా దగ్గరకు రమ్మని బ్రతిమాలుతున్నాను రండి” అన్నాడు. కనుక ఆ సోదరులంతా యోసేపుకు దగ్గరగా వెళ్లారు. యోసేపు వాళ్లతో చెప్పాడు, “నేనే మీ సోదరుణ్ణి, యోసేపును. ఈజిప్టుకు బానిసగా మీరు అమ్మిన వాడిని నేనే.

5. అయినను నేనిక్కడికి వచ్చు నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.
అపో. కార్యములు 7:15

5. ఇప్పుడేమీ బాధపడకండి. మీరు చేసినదాన్ని బట్టి మీ మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. నేను ఇక్కడికి రావటం దేవుని ఏర్పాటు. మీ ప్రాణం కాపాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను.

6. రెండు సంవత్సరములనుండి కరవు దేశములో నున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును
అపో. కార్యములు 7:15

6. భయంకరమైన ఈ కరువు కాలం ఇప్పటికే రెండు సంవత్సరాలనుండి ఉంది. నాట్లు వేయకుండా, కోతలు కోయకుండా ఇంకా అయిదు సంవత్సరాలు గడచిపోవాలి.

7. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.

7. కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో నేను రక్షించాలని చెప్పి దేవుడే నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపించాడు.

8. కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటివారి కందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను.

8. నేను యిక్కడికి పంపబడటం మీ తప్పకాదు. అదంతా దేవుని సంకల్పం. దేవుడు నన్ను ఫరోకు తండ్రిలా చేసాడు. ఆయన దివాణం అంతటిమీదను, మొత్తం ఈజిప్టు అంతటికి నేను పాలకుడ్ని.”

9. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో-నీ కుమారుడైన యోసేపు-దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు;
అపో. కార్యములు 7:14

9. “కనుక మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్లండి. ఆయన కుమారుడు యోసేపు పంపిన సందేశం ఇది అని నా తండ్రితో చెప్పండి” అన్నాడు యోసేపు. దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద అధికారినిగా చేసాడు. ఇక్కడికి నా దగ్గరకు వచ్చేయండి. ఇంకా వేచి ఉండవద్దు ఇప్పుడే వచ్చేయండి.

10. నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెలమందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును.

10. గోషను దేశంలో నా దగ్గర మీరు నివసిస్తారు. మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ జంతువులు, మీ మందలు ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాను.

11. ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.

11. వచ్చే అయిదు కరువు సంవత్సరాల కాలంలోనూ నేను మిమ్మల్ని చూచుకొంటాను. అందుచేత మీరూ, మీ కుటుంబాలు, మీ స్వంతది ఏదీ నష్టపోదు.”

12. ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి.

12. యోసేపు తన సోదరులతో మాట్లాడటం కొనసాగిస్తూనే ఉన్నాడు. “ఇప్పుడు మీరు నిజంగా, నేను యోసేపు అని చూడగలుగుతున్నారు. అన్నాడు అతడు. నేనే అని మీ సోదరుడు బెన్యామీనుకు తెలుసు. మీతో మాట్లాడుతున్న నేను మీ సోదరుణ్ణి.

13. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి

13. కనుక ఇక్కడ ఈజిప్టులో నాకు ఉన్న సమస్త ఘనతను గూర్చి నా తండ్రికి చెప్పండి. మీరు ఇక్కడ చూచిన వాటన్నింటి గూర్చి నా తండ్రికి చెప్పండి. ఇక మీరు త్వరపడి నా తండ్రిని నా దగ్గరకు తీసుకురండి.”

14. తన తమ్ము డైన బెన్యామీను మెడమీద పడి యేడ్చెను; బెన్యామీను అతని మెడమీదపడి యేడ్చెను.

14. అప్పుడు యోసేపు తన తమ్ముడు బెన్యామీనును కౌగలించుకొని ఏడ్చాడు. బెన్యామీను కూడ ఏడ్చాడు.

15. అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టు కొని వారిమీద పడి యేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.

15. తర్వాత యోసేపు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకొని, వారి మీదపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఆ సోదరులు అతనితో మాట్లాడటం మొదలు బెట్టారు.

16. యోసేపుయొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను.
అపో. కార్యములు 7:13

16. యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చినట్లు ఫరోకు తెలిసింది. ఫరో ఇల్లంతా ఈ వార్త పాకిపోయింది. దీని విషయమై ఫరో, ఆతని సేవకులు చాలా సంతోషించారు.

17. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను-నీవు నీ సహోదరులను చూచి-మీరీలాగు చేయుడి, మీ పశువులమీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి

17. కనుక యోసేపుతో ఫరో అన్నాడు: “నీ సోదరులకు కావలసినంత ఆహారం తీసుకొని తిరిగి కనాను దేశం వెళ్లమని చెప్పు.

18. మీ తండ్రిని మీ యింటివారిని వెంట బెట్టుకొని నా యొద్దకు రండి; ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకెచ్చెదను, ఈ దేశముయొక్క సారమును మీరు అనుభవించెదరు.
అపో. కార్యములు 7:14

18. నీ తండ్రిని, వారి కుటుంబాలను తిరిగి ఇక్కడికి నా దగ్గరకు తీసుకొని రమ్మని వారితో చెప్పు. ఈజిప్టులో శ్రేష్ఠమైన భూమిని నివాసానికి నేను నీకు ఇస్తాను. ఇక్కడ మనకు ఉన్న శ్రేష్ఠ ఆహారం నీ కుటుంబం భోంచేస్తారు.”

19. నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లలకొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి.
అపో. కార్యములు 7:14

19. తర్వాత ఫరో అన్నాడు: “మన బండ్లలో మంచి వాటిని కొన్నింటిని మీ సోదరులకు ఇయ్యి. కనాను వెళ్లి, మీ తండ్రిని, స్త్రీలందరిని, పిల్లలను ఆ బండ్లమీద తీసుకొని రమ్మని వారితో చెప్పు.

20. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా

20. వారి అన్ని సామానులు తెచ్చుకొనే విషయంలో ఏమీ చింత పడవద్దు. ఈజిప్టులో మనకు ఉన్న శ్రేష్ఠ వస్తువులు మనం వారికి ఇద్దాం.”

21. ఇశ్రాయేలు కుమారులు ఆలాగుననే చేసిరి. యోసేపు ఫరోమాట చొప్పన వారికి బండ్లను ఇప్పించెను; మార్గమునకు ఆహారము ఇప్పించెను.

21. కనుక ఇశ్రాయేలు కుమారులు అలా చేసారు. ఫరో వాగ్ధానం చేసినట్టే యోసేపు వారికి మంచి బండ్లు ఇచ్చాడు. వారి ప్రయాణానికి సరిపడినంత ఆహారం యోసేపు వారికి ఇచ్చాడు.

22. అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యా మీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,

22. ఒక్కో సోదరునికి ఒక్కో జత చక్కని వస్త్రాలు యిచ్చాడు యోసేపు. అయితే బెన్యామీనుకు అయిదు జతల మంచి బట్టలు యోసేపు ఇచ్చాడు. మరియు 300 వెండి నాణాలు కూడ యోసేపు బెన్యామీనుకు ఇచ్చాడు.

23. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును తిను బండములను మోయుచున్న పది ఆడుగాడిదలను పంపెను.

23. యోసేపు తన తండ్రికి కానుకలుకూడా పంపించాడు. ఈజిప్టులోని మంచి వస్తువులు చాలా సంచులనిండా నింపి పది గాడిదలమీద అతడు పంపించాడు. అతని తండ్రి తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన ఆహారం, రొట్టె, ధాన్యం విస్తారంగా పది ఆడగాడీదల మీద అతడు పంపించాడు.

24. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా-మార్గమందు కలహ పడకుడని వారితో చెప్పెను.

24. అప్పుడు యోసేపు అతని సోదరులను వెళ్లమన్నాడు. వారు వెళ్తూ ఉండగా యోసేపు “తిన్నగా ఇంటికి వెళ్లండి. దారిలో పోట్లాడకండి” అని వారితో చెప్పాడు.

25. వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశమునకు తన తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి

25. కనుక ఆ సోదరులు ఈజిప్టు దేశం విడిచి, కనాను దేశంలో ఉన్న తమ తండ్రి దగ్గరకు వెళ్లారు.

26. యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.

26. ఆసోదరులు “నాయనా, యోసేపు బతికే ఉన్నాడు, ఈజిప్టు దేశం అంతటికి అతడే అధికారి” అని అతనితో చెప్పారు. వారి తండ్రి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడు వాళ్లను నమ్మలేదు.

27. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను.

27. అయితే యోసేపు చెప్పినదంతా ఆ సోదరులు వారి తండ్రికి చెప్పారు. తర్వాత అతనిని ఈజిప్టు తీసుకొని రమ్మని యోసేపు పంపిన బండ్లను యాకోబు చూశాడు. అప్పుడు యాకోబు సంతోషంతో ఉప్పొంగిపొయ్యాడు.

28. అప్పుడు ఇశ్రాయేలు-ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను చావకమునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను.

28. “ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. నా కుమారుడు యోసేపు ఇంకా బతికే ఉన్నాడు! నేను మరణించక ముందు అతణ్ణి చూస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |