Kings I - 1 రాజులు 11

1. మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు... సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయ ములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీ యులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి

“స్త్రీలను”– సొలొమోను క్షీణ దశనూ, భయంకరమైన పాపాన్నీ తెలియజేసే విషాద గాధ ఇక్కడ మొదలౌతున్నది. శరీర సంబంధమైన పాపాలు చేయనివ్వకుండా అతని జ్ఞానం అతనికి కవచంగా పని చేయలేదు. జ్ఞానం ఉన్నవారు కూడా మోహానికి లొంగిపోవడం సాధ్యమే. దేవునితో సంబంధం తెగిపోయిన మానవ జ్ఞానం విపరీతమైన పిచ్చితనంలో పడిపోయే ప్రమాదం ఉంది. దేవుని ఆత్మానుసారంగా నడుచుకోవడం ఒక్కటే జీవితంలో పవిత్రతకు మార్గం – కీర్తనలు 51:10-12; గలతియులకు 5:16 పోల్చిచూడండి. రాజులు అనేకమంది భార్యలను ఉంచుకోకూడదని ద్వితియోపదేశకాండము 17:17 లో ఉంది. విగ్రహ పూజ చేసే వారిని పెళ్ళాడ కూడదని దేవుడు తన ప్రజలను అనేక సార్లు హెచ్చరించాడు (నిర్గామకాండము 34:16; ద్వితియోపదేశకాండము 7:1-4; యెహోషువ 23:12-13).

2. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.

3. అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయ మును త్రిప్పివేసిరి.

మన స్వంత కోరికలను అదుపులో పెట్టుకోలేకపోతే గొప్ప జ్ఞానం ఉండి ప్రయోజనమేమిటి? “తిప్పివేశారు”– ద్వితియోపదేశకాండము 17:17; నెహెమ్యా 13:26; సామెతలు 31:3.

4. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృద యము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాక పోయెను.

“దావీదు”– బత్‌షెబ విషయంలో దావీదు భయంకరంగా పాపం చేసినా (2 సమూ 11 అధ్యాయం), అతడు పశ్చాత్తాపపడి ఏకైక నిజ దేవుణ్ణి ఆరాధించడంలో నిలకడగా ఉంటూ అబద్ధ దేవుళ్ళ వైపుకు తిరగలేదు.

5. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.

“అష్తారోతు”– న్యాయాధిపతులు 2:13; న్యాయాధిపతులు 10:6. 2 రాజులు 23:13 లో దీనికి “అసహ్యమైన దేవత” అని పేరు ఉంది. కనాను దేశంలో దీనిని బయల్ దేవుడి భార్య అని ప్రజలు అనుకొన్నారు. దీనిని యుద్ధానికి, సంతాన బాహుళ్యానికి ఆధిదేవతగా ఎంచి లైంగిక సంబంధమైన కర్మకాండలతో పూజించేవారు. దీనికి శుక్రుడికి సంబంధం ఉందని అనుకొనేవారు. బబులోనువారు “ఇష్టారు” అనీ, గ్రీకులు “అస్తార్తె” లేక “అఫ్రోడైటె” అనీ, రోమ్‌వారు “వీనస్” అనీ దీనిని పిలిచేవారు. “మిల్కొమ్”– కొన్ని సార్లు వాణ్ణే “మోలెకు” లేక “మొలొకు” అని కూడా అన్నారు. ఇక్కడ వాణ్ణి “అసహ్యమైన దేవుడు” అనడం గమనించండి. కొన్ని సార్లు వీడికి అర్పణగా చిన్నపిల్లలను మంటల్లో కాల్చేసేవారు. 2 రాజులు 6:3; 2 రాజులు 17:17; 2 రాజులు 21:6; లేవీయకాండము 18:21; లేవీయకాండము 20:2-5 చూడండి.

6. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.

7. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూష లేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.

“కెమోష్”– వీడు కూడా “అసహ్యమైన” దేవుడే (2 రాజులు 23:13). అంటే జనం వీణ్ణి పూజించినప్పటికీ వీడు నిజ దేవునికి అసహ్యమైనవాడు. 2 రాజులు 3:26-27 ను బట్టి చూస్తే మోయాబువారు పూజించే ఈ దేవుడికి కొన్ని సార్లు నరబలులు కూడా అర్పించేవారని అనుకోవచ్చు.

8. తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.

దేవుని దేశంలోకీ దేవుని పట్టణంలోకీ సొలొమోను రానిచ్చిన అనేకమంది దేవుళ్ళలో పైన చెప్పినవాళ్ళు కొద్దిమంది మాత్రమే. దేవుని భయభక్తులు సొలొమోనులో ఎప్పుడైతే పోయాయో తన జ్ఞానం చాలా మట్టుకు అతడు కోల్పోయాడు – కీర్తనలు 111:10; సామెతలు 1:7 పోల్చి చూడండి.

9. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై

“ప్రత్యక్షమయ్యాడు”– 1 రాజులు 3:5; 1 రాజులు 9:2.

10. నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను. యెహోవా తన కిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి

“ప్రవర్తించలేదు”– 1 రాజులు 9:6-7; నిర్గామకాండము 20:3 నిర్గామకాండము 20:6 కూడా చూడండి. “కోపగించాడు”– సంఖ్యాకాండము 25:3; కీర్తనలు 90:7-11.

11. సెలవిచ్చినదేమనగానేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను.

12. అయి నను నీ తండ్రియైన దావీదు నిమిత్తము నీ దినములయందునేను ఆలాగున చేయక నీ కుమారుని చేతిలోనుండి దాని తీసివేసెదను.

అంటే 2 సమూయేలు 7:14-16 లో దేవుడు దావీదుకిచ్చిన మాటవల్ల.

13. రాజ్యమంతయు తీసివేయను; నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చెదను.

“జెరుసలం”– 1 రాజులు 9:3. “ఒక్క గోత్రం”– యూదా గోత్రం (1 రాజులు 12:20).

14. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను; అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.

దేవుడు సొలొమోనుకు విరోధంగా ఇద్దరు శత్రువులను లేపాడు – ఎదోంవాడైన హదదు, ఆరాం (సిరియా) వాడైన రెజొను. ఒకడు దక్షిణ తూర్పు దిశనుంచీ మరొకడు ఉత్తర తూర్పు దిశ నుంచీ. తన ప్రజల పాపాల మూలంగా తనకు కలిగిన కోపాన్ని వెల్లడించేందుకు దేవుడు తరచుగా వారిపైకి శత్రువులను పురిగొల్పడం అనే విధానాన్ని అవలంబించాడు (ద్వితియోపదేశకాండము 28:15 ద్వితియోపదేశకాండము 28:49-50; న్యాయాధిపతులు 2:10-23; 2 సమూయేలు 12:10; 2 దినవృత్తాంతములు 36:15-17; యెషయా 10:5-6; యిర్మియా 1:15-16). ఇప్పటికీ దేవుడు ప్రపంచ రాజ్యాల మధ్య ఈ రీతిలోనే తన పనులు జరిగిస్తున్నాడు అనుకునేందుకు చాలినన్ని కారణాలున్నాయి.

15. దావీదు ఎదోము దేశముమీద యుద్ధము చేయుచుండగా, సైన్యాధిపతియైన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లి యున్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరిని హతము చేసెను.

16. ఎదోములో నున్న మగవారినందరిని హతము చేయువరకు ఇశ్రాయేలీయులందరితో కూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను.

17. అంతట హదదును అతనితోకూడ అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులును ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి; హదదు అప్పుడు చిన్న వాడై యుండెను.

18. వారు మిద్యాను దేశములోనుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి, పారాను దేశమునుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తురాజగు ఫరోనొద్దకు రాగా, ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను.

19. హదదు ఫరో దృష్టికి బహు దయపొందగా తాను పెండ్లిచేసికొనిన రాణియైన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లిచేసెను.

20. ఈ తహ్పెనేసుయొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను; ఫరోయింట తహ్పెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబతు ఫరో కుటుంబికులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను.

21. అంతట దావీదు తన పితరులతోకూడ నిద్రపొందిన సంగతిని, సైన్యాధిపతియైన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు వినినేను నా స్వదేశమునకు వెళ్లుటకు సెలవిమ్మని ఫరోతో మనవిచేయగా

22. ఫరోనీవు నీ స్వదేశమునకు వెళ్ల కోరుటకు నాయొద్ద నీకేమి తక్కువైనది అని యడిగెను. అందుకు హదదుతక్కువైన దేదియు లేదు గాని యేలాగుననైనను నన్ను వెళ్లనిమ్మనెను.

23. మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదదెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు.

“సోబా”– 2 సమూయేలు 8:3. అప్పుడు దమస్కు (ఇప్పటికి కూడా) సిరియా రాజధాని.

24. దావీదు సోబావారిని హతము చేసి నప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి, కూడిన యొక సైన్య మునకు అధిపతియై దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను.

25. హదదు చేసిన యీ కీడు గాక సొలొమోను బ్రదికిన దినములన్నియు ఇతడు అరాముదేశమందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరో ధియైయుండి ఇశ్రాయేలీయులయందు అసహ్యతగలవాడై యుండెను.

“కీడు”– దేవుని ప్రజల మధ్య పాపం ఏదో ఒక రకమైన కీడుకు దారి తీస్తుంది.

26. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయీమీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లిపేరు జెరూహా, ఆమె విధవరాలు.

“యరొబాం”– వ 40; 1 రాజులు 12:2 1 రాజులు 12:20.

27. ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రియైన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను.

28. అయితే యరొబాము అను ఇతడు మహా బలాఢ్యుడైయుండగా ¸యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొని, యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను.

“పని చేశాడో”– సామెతలు 22:29. “యోసేపు”– యరొబాం ఎఫ్రాయిం వంశానికి చెందినవాడు (వ 26), యోసేపు సంతానం (ఆదికాండము 41:50-52). “వెట్టిపని”– 1 రాజులు 4:6 దగ్గర నోట్.

29. అంతట యరొబాము యెరూషలేములోనుండి బయలు వెడలిపోగా షిలోనీయు డును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కను గొనెను; అహీయా క్రొత్తవస్త్రము ధరించుకొని యుండెను, వారిద్దరు తప్ప పొలములో మరి యెవడును లేకపోయెను.

1 రాజులు 12:15; 1 రాజులు 14:2. బైబిలు కాలాల్లో ప్రవక్తలుగా ఉన్నవారిలో చాలామంది గురించి మనకేమీ సమాచారం లేదు. వీరిలో అహీయా ఒకడు.

30. అంతట అహీయా తాను ధరించుకొని యున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండు తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెనుఈ పది తునకలను నీవు తీసికొనుము;

1 సమూయేలు 15:27-28 పోల్చి చూడండి.

31. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున దేమనగాజనులు నన్ను విడిచి పెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును కెమోషు అను మోయాబీయుల దేవతకును మిల్కోము అను అమ్మో నీయుల దేవతకును మ్రొక్కి,

ఈ పది గోత్రాలు యూదా, షిమ్యోను, లేవీ తప్ప మిగతా ఇస్రాయేల్ జనం అంతా. షిమ్యోను గోత్రానికి ప్రత్యేకంగా ఏ భాగమూ లేదు గాని యూదా సరిహద్దుల్లోనే కొంత భాగం వారికి ఉంది (యెహోషువ 19:1-9). లేవీ గోత్రానికి కూడా వారి స్వంత ప్రదేశం లేదు. దేశమంతట్లోనూ చెదిరి ఉన్న పట్టణాల్లో వారు నివసించారు (యెహోషువ 13:14; యెహోషువ 21:41). యూదానుండి ఉత్తర ప్రాంతం గోత్రాలను వేరు చేయడానికి మూలకారణం సొలొమోను పాపం. అయితే ముందునుంచీ కూడా దేశంలో ఈ రెండు భాగాలకూ మధ్య కొంత కలహభావం ఉంది (సమూ 2వ అధ్యాయం; 2 సమూయేలు 19:40-43; 2 సమూయేలు 20:1-2).

32. సొలొమోను తండ్రియైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలొమోను చేతిలోనుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను.

వ 13.

33. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందునను ఇశ్రాయేలీయుల గోత్ర ములలోనుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును.

వ 5-8.

34. రాజ్యము వానిచేతిలోనుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచ రించెను గనుక దావీదును జ్ఞాపకము చేసికొని అతని దినము లన్నియు అతనిని అధికారిగా ఉండనిత్తును.

35. అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను;

36. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.

“దీపం”– అంటే దావీదు వంశం కొనసాగుతుంది. దేవుడు ఆ దీపాన్ని ఆర్పివేయడు.

37. నేను నిన్ను అంగీకరించి నందున నీ కోరిక యంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలువారిమీద రాజవై యుందువు.

38. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరింగిచుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచి నట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్ప గించెదను.

సొలొమోనుకు ఇచ్చిన వాగ్దానమే దేవుడు యరొబాంకు ఇచ్చాడు (1 రాజులు 2:3-4; 1 రాజులు 3:14; 1 రాజులు 6:12-13). యూదాకు, అందులోని పాలకులకు వర్తించినట్టే దేవుని ఒడంబడిక యరొబాంకు, ఉత్తర గోత్రాలకు కూడా వర్తించింది.

39. వారు చేసిన క్రియలనుబట్టి నేను దావీదుసంతతివారిని బాధ పరచుదును గాని నిత్యము బాధింపను.

40. జరిగినదానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తుదేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే యుండెను.

వ 26.

41. సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమును గూర్చియు, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథ మందు వ్రాయబడి యున్నది.

“సొలొమోను...గ్రంథం”– ఈ పుస్తకం ఏమైపోయిందో ఏ మనిషికి తెలియదు.

42. సొలొమోను యెరూష లేమునందు ఇశ్రాయేలీయులందరిని ఏలిన కాలము నలువది సంవత్సరములు.

43. అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.

“కన్ను మూసి”– 1 రాజులు 2:10 నోట్. రెహబాం అంటే “ప్రజను విస్తరింపజేసేవాడు”, లేక “ప్రజలు అభివృద్ధి చెందారు” అని అర్థం. ఇతడికి ఈ పేరు పెట్టడంలో సొలొమోను ఆశ ఇదే కావచ్చు. అయితే దీనికి సరిగ్గా వ్యతిరేకం జరిగింది. పాపం అనేది మనుషుల ఆశలను ఆర్పేసే గొప్ప శక్తి.