2 సమూయేలు 24:1-25.
“సైతాను”– 2 సమూయేలు 24:1 పోల్చిచూడండి. దేవునికి ఇస్రాయేల్పై కోపం వచ్చింది. అందువల్ల సైతాను దావీదుకు దుష్ ప్రేరేపణ కలిగించేందుకు అనుమతించాడు. సైతాను అనే పేరు హీబ్రూ పదంనుంచి వచ్చింది. దాని అర్థం “విరోధి”, లేక “శత్రువు”, లేక కొందరు భావించినట్లు “నేరాలు మోపేవాడు”. వాడు దేవునికీ మానవుడికీ కూడా గర్భ శత్రువు. వీడి పుట్టుపూర్వోత్తరాలు అంత స్పష్టంగా లేవు అయితే మొదట్లో వీడు పవిత్రుడూ, మహా శక్తివంతుడైన దేవదూత అనీ, తరువాత పాపం చేసి దురాత్మగా మారిపోయాడనీ మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది. దేవుడు దుర్మార్గమైనదేదీ చెయ్యలేదు. ఆయన ఏ జీవినీ చెడ్డగా సృష్టించలేదు. యెషయా 14:12-15; యెహెఙ్కేలు 28:12-17 సైతాను ఎలా పతనం చెందాడో వివరిస్తూ ఉన్నాయని కొందరు పండితుల అభిప్రాయం. ఇది నిజమే కావచ్చు.
బైబిల్లో సైతానుకు మరి కొన్ని పేర్లున్నాయి. అపనింద పిశాచం (మత్తయి 4:1), దయ్యాల నాయకుడు బేల్జెబూల్ (మత్తయి 12:24), దుర్మార్గుడు (1 యోహాను 5:19), లోక పాలకుడు (యోహాను 12:31), ఈ యుగ దేవుడు (2 కోరింథీయులకు 4:4), వాయుమండల రాజ్యాధికారి (ఎఫెసీయులకు 2:2), రెక్కలున్న మహా సర్పం లేక ఆదిసర్పం (ప్రకటన గ్రంథం 12:9).
తనకు చేతనైనంత మందిని నాశనం చెయ్యడానికీ, మనుషుల్ని వేధించడానికీ వాడు తిరుగుతున్నాడు (యోబు 1:12-19; యోబు 2:6-7; లూకా 13:16; 1 పేతురు 5:8). అందరూ తనను పూజించాలని వాడి కోరిక (మత్తయి 4:9). పాపం చేసేలా మనుషుల్ని వాడు ప్రేరేపిస్తాడు (1 థెస్సలొనీకయులకు 3:5). దేవుని పనికి ఆటంకం కలిగించేందుకు వాడు అనేక కుట్రలు పన్నుతుంటాడు (2 కోరింథీయులకు 2:11). వాడు బహు మోసకారి (2 కోరింథీయులకు 11:14). మనుషులు వాడికి లొంగిపోతే తప్ప, లేదా దేవుడు తన జ్ఞానం చొప్పున వాడికి అనుమతి ఇస్తే తప్ప వాడు మనుషుల మధ్య ఏమీ చెయ్యలేడు. వాడు (దయ్యాలన్నీ లేక పిశాచాలన్నీ) దేవుని సర్వాధికారానికి తల ఒగ్గి ఉండడం ఖాయం.
అడుగడుగునా సైతానును ఓడించే సదుపాయాన్ని దేవుడు తన విశ్వాసులకు కలిగించాడు (ఎఫెసీయులకు 6:10-18; యాకోబు 4:7; ప్రకటన గ్రంథం 12:11).
వాడి అంతం స్పష్టం (ప్రకటన గ్రంథం 20:10). వాడు దేవునికీ మానవునికీ కూడా శత్రువైతే దేవుడు వాణ్ణి వెంటనే ఎందుకు నాశనం చెయ్యడు? ఈ ప్రశ్నకు పూర్తి జవాబును దేవుడు బైబిల్లో ఇవ్వలేదు గాని కొన్ని సూచనలు మాత్రం లేకపోలేదు. తన ప్రజలను పరీక్షించి శుద్ధి చేసేందుకూ, వారి విశ్వాసం నిజమైనదని నిరూపించేందుకూ, పాపం, అపనమ్మకం మార్గాల వెంట వెళ్ళేవారిని శిక్షించేందుకూ దేవుడు వాడి చర్యలను వాడుకుంటాడు. యేసు క్రీస్తు మూలంగా మనం సైతానును ఓడించగలమనీ, ఈ లోకంలో తన పని కొనసాగించేలా సైతాన్ను దేవుడు ఉండనివ్వడం దేవుని పరిపూర్ణ జ్ఞానం, నీతిన్యాయాల ప్రకారమనీ మనం ఇప్పుడు తెలుసుకుంటే చాలు. దేవుడు మనకు అన్నీ చెప్పడేమిటని మనం ఆందోళన చెందనక్కర్లేదు. మనం తెలుసుకోవలసిన అవసరం ఉన్నంత వరకు ఆయన తెలియజేస్తాడు (ద్వితీయోపదేశకాండము 29:29).