Timothy I - 1 తిమోతికి 5

1. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చ రించుము.
లేవీయకాండము 19:32

క్రీస్తు నియమించిన నాయకుడిగా సంఘ కాపరికి అధికారం ఉంది. కానీ సంఘాన్ని తనదైన చిన్న రాజ్యంగా భావించి సర్వాధికారం చెలాయించకుండా, సంఘం ఒక ఇల్లు, ఒక కుటుంబం (1 తిమోతికి 3:15) అని గుర్తుంచుకోవాలి.

2. అన్నదమ్ములని ¸యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో ¸యవనస్త్రీలను హెచ్చరించుము.

3. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.

సంఘానికి, దాని కాపరికి తమ సంఘంలో ఉన్న పేదవారి గురించి శ్రద్ధ తీసుకునే బాధ్యత ఉంది. ముఖ్యంగా ఏ పనీ చేయలేని, ఆదాయం లేని విధవరాండ్ర విషయంలో.

4. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు

పిల్లలకూ పిల్లల సంతానానికీ ఉండవలసిన బాధ్యతను జాగ్రత్తగా గమనించండి. “తమ భక్తి...చూపేందుకు”– ప్రతి విశ్వాసికి ఇది ఎంతో ముఖ్యం. సత్యాన్ని కేవలం నమ్మడం మాత్రమే కాదు, ఆచరించాలి కూడా. దేవుడేదో చెప్పాడని తెలుసుకోవడమే కాదు ఆయన చెప్పినది చేయాలి కూడా. ఈ విధంగా చేస్తేనే దేవునికి సంతోషం కలిగించగలం. పిల్లలు గానీ పిల్లల సంతానం గానీ ఆర్థిక సహాయం చేయగలిగి కూడా అవసరంలో ఉన్న తమ తల్లిదండ్రులకు, లేక తాత అమ్మమ్మలకు అలా చేయకపోతే వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారన్నమాటే.

5. అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియై యుండి, దేవునిమీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాప నలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలుకడగా ఉండును.
యిర్మియా 49:11

క్రైస్తవ విధవరాండ్రను గురించి చెప్తున్నాడు పౌలు. వారికి సహాయం చేసేవారు ఎవరూ లేకపోతే వారి అవసరాలను సంఘం గానీ సంఘంలో ఉన్న వ్యక్తిగత సభ్యుల్లో ఎవరైనా గానీ తీర్చాలి. ఇదే దేవుడు నియమించిన విధానం.

6. సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు చుండియు చచ్చినదైయుండును.

“జీవచ్ఛవం”– ఆత్మ సంబంధమైన మరణం, దేవుని నుంచి వేరై పోవడం అన్నమాట (ఎఫెసీయులకు 2:1; ఎఫెసీయులకు 4:18). సుఖాసక్తితో బ్రతుకుతున్న విధవరాండ్రకే కాదు, అందరి విషయంలోనూ ఇది సత్యమే. క్రీస్తు లేకుండా ఉన్నవారు జీవచ్ఛవాలతో సమానం. సుఖాసక్తి కోసం బ్రతికేవారు కొన్ని సార్లు తామే నిజంగా బ్రతికేవారు అనుకుంటారు. ఎందుకు? – యిర్మియా 17:9.

7. వారు నిందారహితులై యుండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము.

8. ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.

“విశ్వాసం”– క్రైస్తవ జీవితం, నమ్మకం అని దీని అర్థం. ప్రేమ దీనికి కేంద్రం. ఎవరైనా ఈ ప్రేమను ఆచరణలో పెట్టి చూపించడం లేదు అంటే విశ్వాసాన్ని కాదంటున్నాడన్నమాటే (1 యోహాను 3:16-18; 1 యోహాను 4:7-8). విశ్వాసం లేనివారు చాలామంది సహా అవసరంలో ఉన్న తమ బంధువులను ఆదుకుంటున్నారు. మరి విశ్వాసులు దీనినుంచి వెనుకతీయడానికి తెగించవచ్చా?

9. అరువది ఏండ్ల కంటె తక్కువవయస్సు లేక, ఒక్క పురుషునికే భార్యయై,

“జాబితాలో”– 60 సంవత్సరాలకంటే తక్కువ వయస్సున్న, అక్కరలో ఉన్న విధవరాండ్రకు సంఘం సహాయం చేయకూడదని పౌలు చెప్పి ఉండడు. ఒక విధవరాలు అవసరంలో ఉన్నా, సహాయం పొందడానికి ఈ వచనంలోని అర్హతలు తప్పక ఉండాలి అని కూడా చెప్పి ఉండడు. అందువల్ల ఇక్కడ పౌలు ఇతరులకు పరిచర్య చేయడానికి సంఘం నియమించిన విధవరాండ్ర జాబితా గురించి మాట్లాడుతున్నాడని అనుకోవచ్చు. జాబితాలో చేరాలంటే సంఘ నాయకులకూ పరిచారకులకూ ఉన్నట్టు (1 తిమోతికి 3:1-12) ఈ విధవరాండ్రకు కూడా కొన్ని అర్హతలుండాలి.

10. సత్‌క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.

“అతిథి సత్కారం”– రోమీయులకు 12:13. “పవిత్రుల పాదాలు కడగడం”– యోహాను 13:5.

11. ¸యవనస్థులైన విధవ రాండ్రను లెక్కలో చేర్చవద్దు;

ఆ జాబితాలో నమోదయిన స్త్రీలంతా క్రీస్తు సేవకు అంకితమై ఆ సేవకోసం సంఘపరంగా సమర్పించుకొన్నవారై ఉండాలి. మళ్ళీ పెండ్లి చేసుకోవడం తప్పు కాకపోయినప్పటికీ వారు అలా చేస్తే తాము చేస్తామన్న సేవను విడిచిపెట్టడం అవుతుంది. క్రీస్తు సేవను చేస్తాను అన్న వాగ్దానాన్ని తెంచివేయడం చిన్న పాపం కాదు. దీనివల్ల దేవుని శిక్ష వారిమీద ఏదో విధంగా వస్తుంది.

12. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పుపొందినవారై పెండ్లాడగోరుదురు.

13. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాం డ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చు కొందురు.

యవ్వన ప్రాయంలో ఉన్న విధవరాండ్రను సంఘ పరిచర్యలో ఎందుకు ఉంచకూడదో ఇదొక కారణం.

14. కాబట్టి ¸యవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరు చున్నాను.

సంఘంలో సేవ చేస్తానని వాగ్దానం చేసి ఆ తరువాత వాగ్దానాన్ని మీరి పెండ్లి చేసుకోవడం కంటే ముందుగానే పెండ్లి చేసుకోవడం తక్కువ వయస్సున్న విధవరాండ్రకు మంచి మార్గం. “శత్రువు”– క్రీస్తుకూ ఆయన సంఘానికీ వ్యతిరేకులు. ఇలాంటివారు క్రైస్తవులను తప్పు పట్టడానికీ నిందించడానికీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

15. ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగి పోయి సాతానును వెంబడించినవారైరి.

దీన్నిబట్టి చూస్తే ఇంతకుముందే కొంతమంది సంఘంలో సేవ చేస్తానని వాగ్దానం చేసి తమ “విలాసాలకు” (వ 11) మరిగి క్రీస్తు సేవను విడిచి పెట్టారని తెలుస్తున్నది. “సైతాను వెంట తొలగారు”– ఈ సందర్భంలో ఇది లైంగిక అవినీతిని సూచిస్తున్నది. లోక సంబంధమైన విలాసాలు, పాపాల వెంట వెళ్ళడం అంటే మన బద్ధ శత్రువు వెంట వెళ్ళడమే. సైతాను గురించి నోట్స్ 1 దినవృత్తాంతములు 21:1; మత్తయి 4:1-10.

16. విశ్వాసురాలైన యే స్త్రీ యింటనైనను విధవరాండ్రుండినయెడల, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారములేకుండ ఆమెయే వీరికి సహాయము చేయవలెను.

తమ బంధువుల్లో విధవలకు సహాయం చేయగలిగే స్త్రీలు మిగతావారిలాగానే తమ బాధ్యతను నిర్వర్తించవలసిందే. వ 4,8 పోల్చి చూడండి.

17. బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్య మందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను.

“పెద్దలు”, “నాయకత్వం” (1 తిమోతికి 3:1-7) ఇద్దరూ ఒకటే. “ప్రకటించడంలో, నేర్పడంలో”– 1 తిమోతికి 4:13. “రెట్టింపు గౌరవం”– కేవలం గౌరవానికే కాదు. అవసరమైతే ఆర్థిక సహాయానికి కూడా (వ 18).

18. ఇందుకు నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది.
లేవీయకాండము 19:13, ద్వితియోపదేశకాండము 25:4

19. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనేగాని పెద్దమీద దోషా రోపణ అంగీకరింపకుము
ద్వితియోపదేశకాండము 17:6, ద్వితియోపదేశకాండము 19:15

కొన్ని సార్లు నిర్దోషులు కూడా దోషం చేశారనే నిందకు గురౌతారు. ఇతరులు ఇలాంటి నిందలు నమ్మితే వారి సేవ నాశనం కావచ్చు. దీన్ని తప్పించడానికే పౌలు ఈ హెచ్చరిక చేశాడు. “ఇద్దరు ముగ్గురు సాక్షులు”– ద్వితియోపదేశకాండము 19:15; మత్తయి 18:16; 2 కోరింథీయులకు 13:1.

20. ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.

సంఘ పవిత్రతను కాపాడాలంటే సంఘంలో క్రమశిక్షణ ఉండాలి. సంఘం పాపాన్ని అరికట్టకపోతే పాపం సంఘాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. అపో. కార్యములు 5:1-11; 1 కోరింథీయులకు 5:1-5, 1 కోరింథీయులకు 5:13; మత్తయి 18:15-17 చూడండి. దేవుని పిల్లలు పాపానికి భయపడాలంటే ఒక పద్ధతి వారి పాపాన్ని బహిరంగంగా ఎత్తి చూపడమే.

21. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవ దూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను.

పౌలు ఎంత గట్టిగా, ఎంత నిక్కచ్చిగా రాస్తున్నాడో చూశారా. క్రైస్తవ నాయకులు పక్షపాతం, దురభిమానం చూపించడం సామాన్య విషయమని పౌలుకు తెలుసు. చాలామంది తమ బంధువులూ స్నేహితులూ పాపం చేసినప్పుడైతే వారిని సమర్థించి వెనకేసుకువస్తారు, ఇతరులు చేసినప్పుడైతే వారిపట్ల కఠినంగా ప్రవర్తిస్తారు. ఇది చాలా చెడ్డ విషయం. క్రీస్తుకు చెందే ప్రతి సేవకుడూ దీన్ని నివారించాలి.

22. త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాప ములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము.

“చేతులు”– 1 తిమోతికి 4:14; 2 తిమోతికి 1:6. బహుశా నాయకులనూ పరిచారకులనూ నియమించడం గురించి మాట్లాడుతున్నాడేమో. మనుషులు తమ యోగ్యత కనపరచుకోక ముందు వారిని సంఘ సేవకోసం నియమించడం అనేది సంఘానికి ఎంతో హాని కలిగించవచ్చు. 1 తిమోతికి 3:10 పోల్చి చూడండి. సంఘం పెద్దలు పాపం చేస్తున్నవారిని పెద్దలుగానూ పరిచారకులుగానూ నియమిస్తే జరిగే ఫలితాలకు వారే బాధ్యులవుతారు. సంఘ పెద్దలు తాము పవిత్రంగా ఉంటూ పవిత్రమైనవారినే నియమించాలి.

23. ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బునిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము.

“తరచుగా వచ్చే జబ్బుల కోసం”– పౌలుకు వ్యాధులను పూర్తిగా నయం చేసే సామర్థ్యం ఉన్నా (అపొ కా 28:8-9) అతను గాని ఇంకెవరయినా గానీ తిమోతిని బాగు చేయలేకపోయారు. 2 తిమోతికి 4:20; ఫిలిప్పీయులకు 2:27; 2 కోరింథీయులకు 12:7-10 పోల్చి చూడండి. తిమోతి త్రాగే నీరు మంచిది కాకపోవడం వల్ల ఆ జబ్బు వచ్చిందేమో. ఇలాంటప్పుడు కొద్ది ద్రాక్షరసం అతని ఆరోగ్యానికి మంచిది. త్రాగే నీరులో కొంచెం ద్రాక్షరసం కలపడం అనేది ఆ రోజుల్లో ఉన్న సాధారణమైన అలవాటు. ఇక్కడ “కొంచెం” అనే మాటను గమనించండి. 1 తిమోతికి 3:3, 1 తిమోతికి 3:8; ఆదికాండము 9:21; సామెతలు 20:1; సామెతలు 23:30-31; యోహాను 2:9-10 చూడండి.

24. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాప ములు వారివెంట వెళ్లుచున్నవి.

కొన్ని సార్లు మనిషి చేసే మంచి పనులు గానీ చెడ్డ పనులు గానీ స్పష్టంగా కనబడవు. రహస్యంగానే చేసే పాపాలు గానీ మంచి పనులు గానీ మనుషులు కొంత కాలం వరకు దాచగలరు (కీర్తనలు 90:8; ప్రసంగి 12:14; మత్తయి 6:1-4). ఈ కారణం వల్ల సంఘం పెద్దలు నాయకులనూ పరిచారకులనూ నియమించడంలో తొందర పడకూడదు. ఏది ఏమైనా కాలక్రమేణా అన్నీ బయట పడతాయి – మత్తయి 10:26; లూకా 8:17; లూకా 12:2-3; రోమీయులకు 2:16; 1 కోరింథీయులకు 4:5.

25. అటువలె మంచికార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు.